చైల్డ్ రాక్ | David Prabhakar musical journey in Childhood | Sakshi
Sakshi News home page

చైల్డ్ రాక్

Published Fri, Nov 14 2014 12:37 AM | Last Updated on Sat, Sep 2 2017 4:24 PM

చైల్డ్ రాక్

చైల్డ్ రాక్

ఆయన పేరు డేవిడ్ ప్రభాకర్. సిటీలో చాలామందికి చిరపరిచితమైన రాక్ సంగీతజ్ఞుడు. అయితే పబ్‌లు, క్లబ్బుల్లో రాత్రుల్ని వేడెక్కించే రాక్‌కు భిన్నమైన రాగాలాపన ఆయనది. ‘సంగీతం అత్యంత బలమైన మాధ్యమం. దీనిని మంచి పనులకు ఉపయోగిస్తే అద్భుతమైన సందేశం అందించవచ్చు’ అంటారు డేవిడ్. తన రాక్ బ్యాండ్ ద్వారా అదే పని చేస్తున్నారాయన. నిరుపేద చిన్నారులతో ఈయన చేసే మ్యూజికల్ జర్నీ స్ఫూర్తిదాయకం.
 - ఎస్.సత్యబాబు
 
 కొంతకాలంగా పలు ప్రదర్శనలు ఇచ్చిన డేవిడ్.. తన ప్రతి సంగీత ప్రదర్శనకూ చక్కని థీమ్‌ను ఎంచుకుంటారు. అంతేకాక ఆయన రాక్ బృందం సభ్యులు కూడా ఎప్పుడూ చిన్నారులే. ‘స్వచ్ఛమైన సందేశం అందించాలంటే చిన్నారులే కరెక్ట్’ అంటారు డేవిడ్. పర్యావరణం పరిరక్షణ, ప్రపంచశాంతి, మానవత్వం-సేవాభావం.. ఇలా ఒక్కో ప్రోగ్రామ్‌కి ఒక్కో మెసేజ్‌ను ఆయన ‘చిరు’ రాగాల రాక్ బృందం మోసుకొస్తుంటుంది.
 
 గుడిసెల్లో.. గుండెల్లో..
 సిటీలో ఏదైనా బస్తీ మీదుగా వెళ్తుంటే.. వీనులవిందైన గిటార్ రాగాలు లేదా చక్కని సంగీతస్వరాలు వినిపించాయనుకోండి. పరిశీలిస్తే ఆ మురికివాడల్లోని ఇళ్లలో పిల్లల్లో పిల్లవాడిగా మురిసిపోయే  డేవిడ్‌ని చూడవచ్చు. ‘ఇది నాకెంతో ఇష్టమైన వ్యాపకం.మనం గిటార్ ప్లే చేస్తుంటే కళ్లింతలు చేసుకుని చూస్తూ ఆనందంగా కేరింతలు కొట్టే ఈ పిల్లలను చూస్తే మనసుకు ఎంతో హాయిగా అనిపిస్తుంది’ అంటారు డేవిడ్. వారాంతాల్లో, లేదా  ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు ఆయన తన సంతోషాలకు దగ్గర్లోని బస్తీ చిన్నారులతో వంతెన కట్టుకుంటారు. హైటెక్‌సిటీ ఎదురుగా ఉన్న డంప్ యార్డ్ పరిసరాల్లోని బస్తీతో సహా పలు బస్తీల్లో ఆయన ఈ తరహా వీనుల విందును పంచుతున్నారు. ఆయా బస్తీల్లో పిల్లలు మ్యూజిక్‌పై ఆసక్తి చూపిస్తే వారికి ప్రాథమిక శిక్షణ కూడా ఉచితంగా అందిస్తున్నారు.
 
 సన్నాఫ్ హరీష్‌రావు సారథ్యం...
 డేవిడ్ ఆలోచన మేరకు రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు తనయుడు అర్చిష్‌మన్ సారథ్యంలో ఏర్పడిన ఇన్‌ఫ్యూజ్ చిన్నారుల రాక్ గ్రూప్ శుక్రవారం సాయంత్రం శిల్పారామంలో ప్రదర్శన ఇవ్వనుంది. ఈ చిన్నారుల రాక్ బృందంలో మంత్రి హరీశ్‌రావు తనయ వైష్ణవి కూడా ఉన్నారు. బేస్ గిటారిస్ట్‌గా అర్చిస్‌మెన్, రిథమ్ గిటార్‌తో ఐశ్వర్య కృష్ణన్, ఓకల్స్ వైష్ణవి, వరుణ్, కీబోర్డ్ ప్లేయర్‌గా అరిందమ్, డ్రమ్మర్ హర్షలు తమ దైన శైలిలో సంగీతాన్ని అందిస్తారు. నిరుపేద చిన్నారుల అవస్థలకు సంబంధించిన ‘షి కాల్ ఫ్రమ్ ద స్ట్రీట్ టు ద మేన్ సర్ కెన్ యు హెల్ప్ మీ’ అనే సూపర్ హిట్ సాంగ్‌తో మొదలు పెట్టి మొత్తం 8 నుంచి 10 దాకా పాటలు వినిపిస్తారు. శిల్పారామంలో నైట్ బజార్‌లో రాత్రి 6.30గంటలకు ప్రారంభమయే ఈ కార్యక్రమంలో ఎలైస్ మ్యూజిక్ అకాడమీ టీచర్స్ ప్రదర్శన కూడా భాగం. ఈ సందర్భంగా మారు మూల ప్రాంతాలకు చెందిన 100 మంది నిరుపేద చిన్నారులకుబేసిక్ సర్వైవల్ కిట్స్ అందిస్తున్నారు. ‘‘కార్యక్రమానికి మంత్రి హరీ్‌శ్‌రావు తదితరులు హాజరవుతున్నారు’ అని డేవిడ్ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement