బోనమెత్తిన శకటం సకల కళామకుటం
కొత్తగా ఏర్పడిన 29వ రాష్ట్రం తెలంగాణ గణతంత్రదినోత్సవాల్లో తన తొలి శకటాన్ని ప్రదర్శిస్తోంది. దేశ సార్వభౌమాధికారాన్ని చాటే ఉత్సవాల్లో తొలిసారి ’ తెలంగాణ స్వేచ్ఛా స్వరూపం, సంస్కృతీ సంప్రదాయాల ‘ప్రతిరూపం’ సగర్వంగా సాక్షాత్కరించనుంది. దేశ ప్రథమపౌరునితో పాటు అగ్రరాజ్యాధినేత ఒబామా సాక్షిగా తెలంగాణ వైభవం కనువిందు చేయనుంది.
ఈ నేపథ్యంలో తెలంగాణ శకటానికి రూపుకట్టిన మన రాష్ట్ర ప్రసిద్ధ చిత్రకారుడు, హైదరాబాద్ నివాసి ఎం.వి.రమణారెడ్డి తన మనోభావాలను ‘ఫ్యామిలీ’తో పంచుకున్నారిలా.. - ఎస్.సత్యబాబు
తొలి తెలంగాణ శకటాన్ని రూపొందించే అవకాశం నాకు దక్కడం ఎంతో సంతోషాన్నిచ్చింది. అనుమతి ఆలస్యం కావడం వల్ల అతి తక్కువ సమయమే ఉన్నా ఛాలెంజ్‌గా తీసుకున్నాం. మిగిలిన రాష్ట్రాల శకటాలకు థీటుగా 15 రోజుల రికార్డ్ టైమ్‌లో దీన్ని రూపొందించాం. తెలంగాణ సంస్కృతికి రెండు కళ్లలాంటివి బతుకమ్మ, బోనాలు. డిఫెన్స్ విభాగం సమకూర్చిన 45 అడుగుల పొడవు, 14 అడుగుల వెడల్పు ఉన్న ప్రత్యేక వాహనం వేదికగా... బోనాల వైభవాన్ని చాటుతున్నాం.
ప్రస్తుతం మహిళల రక్షణ సమాజంలో అత్యంత కీలకంగా మారిన నేపథ్యంలో మహిళా రక్షకుడిగా, శక్తిమంతమైన పోతరాజును చూపుతున్నాం. ఈ శకటానికి ముందు భాగంలో పోతరాజు భీకర రూపం ఉంటుంది. వెనుక భాగం గోల్కొండ కోటను చూపుతుంది. సంప్రదాయదుస్తుల్లో బోనమెత్తిన ఇద్దరు మిహ ళలుంటారు. డప్పు, కొమ్ము, తష, పగడం... పరికరాలను వాయించే 25 మంది కళాకారుల ప్రత్యక్ష ప్రదర్శన మరో ప్రధాన ఆకర్షణ. దీనితో పాటే మహంకాళి అమ్మవారి మాటగా భవిష్యవాణిని చెప్పే మహిళ...
అచ్చమైన బోనాల సందడితో, అణువణువూ అద్భుతమైన తెలంగాణ ప్రతిరూపంగా దీన్ని మలుస్తున్నాం. మన రాష్ట్రానికి చెందిన కొరియోగ్రాఫర్ రాఘవరాజ్ భట్, డప్పు కళాకారుడు శేఖర్,10మంది యువతులు... మరెందరో ఈ సందడిలో భాగం అవుతున్నారు. మొత్తం 18 రాష్ట్రాలు, 25 శకటాలతో 4కి.మీ సాగే ఈ పెరేడ్‌లో మన శకటానిది 9వ నెంబరు.
వ్యక్తిగతం...
సిద్ధిపేటలో పుట్టాను. తెలంగాణ బిడ్డగా... చిత్రకారుడిగా తెలంగాణ చిత్రకారులను ఏకతాటి మీదకు తెచ్చి తెలంగాణ ఆర్టిస్ట్స్ ఫోరంను ఏడేళ్ల క్రితమే ఏర్పాటు చేశాను. పేద, ప్రోత్సాహం కరవైన తెలంగాణ చిత్రకారుల కోసం పదుల సంఖ్యలో పది జిల్లాల్లో ఆర్ట్ క్యాంప్ లు నిర్వహించాను. పేరు తెచ్చిన కాన్వాస్‌నే సాధనంగా చేసుకుని పుట్టిన గడ్డకు సేవ చేయాలనేదే నా లక్ష్యం.