ఫిట్ 2 హిట్ | Youth and Celebrities most crazy about Foreign fitness centers | Sakshi
Sakshi News home page

ఫిట్ 2 హిట్

Published Wed, Aug 27 2014 12:25 AM | Last Updated on Thu, Apr 4 2019 5:41 PM

ఫిట్ 2 హిట్ - Sakshi

ఫిట్ 2 హిట్

పిజ్జాల నుంచి ఫెంగ్‌షుయ్ దాకా సిటీలో ఎందెందు వెదికినా అందందే కనబడే విదేశీ ‘కళ’..  ఇప్పుడు ఫిట్‌నెస్ రంగానికీ జతయింది. వెస్ట్రన్ కంట్రీస్ నుంచి తరలి వస్తున్న కండల వీరులు సిటీవాసుల ఫిజిక్‌లను చూడముచ్చటగా తీర్చిదిద్దే పనిలో ఉన్నారు. సంపన్నుల దేహాలను చక్కదిద్దుతూ.. భారీ మొత్తంలో చెక్‌లు అందుకుంటున్నారు.  

టాలీవుడ్ హీరోల నుంచి సిటీ సెలిబ్రిటీల వరకూ.. కొత్త సోకుల వెనుక విదేశీ హస్తాల పనితనం ఉంది. ప్రసిద్ధ ఫిట్‌నెస్ నిపుణుల గురించి నెట్‌లో ఆరా తీసి మరీ సిటీకి రప్పిస్తున్నారు మనవాళ్లు. ఫ్యాషన్ రంగంలో దూసుకొచ్చిన ఫారిన్ తళుకులు.. ఫిట్‌నెస్ విషయంలోనూ స్టేటస్ సింబల్‌గా మారుతున్నాయి. తమ శరీరాకృతి అందరూ మెచ్చే విధంగా ఉండాలని బలంగా ఫిక్సయిన యంగ్ తరంగ్‌లు విదేశీ నిపుణులకు జై కొడుతున్నారు. వారిని పర్సనల్ ట్రైనర్లుగా నియమించుకుంటున్నారు.
 
 బాలీవుడ్ టు టాలీవుడ్
 బాలీవుడ్‌లో జాన్ అబ్రహాం, హృతిక్‌రోషన్, ప్రియాంక చోప్రా.. ఇలా టాప్ సెలిబ్రిటీలందరూ విదేశీ కోచ్‌లను పర్సనల్ ట్రైనర్స్‌గా నియమించుకున్నారు. అదే ఒరవడిని టాలీవుడ్ అందిపుచ్చుకుంది. మహేష్‌బాబు, ఎన్టీఆర్, నాగచైతన్య, రామ్‌చరణ్, నవదీప్.. ఇంకా ఫుల్ ఎంట్రీ ఇవ్వని అఖిల్ అక్కినేని సహా హీరోలంతా విదేశీయుల దగ్గరే ట్రైనప్ అవుతున్నారు. వీరినే స్ఫూర్తిగా తీసుకుంటున్న సిటీలోని సంపన్నులు కూడా అదే బాట పడుతున్నారు. నెలకు రూ.50 వేలు మొదలు రూ.10 లక్షల వరకు రెమ్యునరేషన్ తీసుకునే విదేశీ ట్రైనర్లు సిటీలో ఉన్నారంటే ఆశ్చర్యం కలిగిస్తుంది.
 
 పొలిటికల్ హీరోలూ..
 మంత్రులు, రాజకీయ ప్రముఖులు, వారి వారసులు, బిజినెస్‌మెన్.. సమాజంలో కాస్త స్టేటస్ ఉన్న వారంతా ఇప్పుడు ఫిజికల్ పర్సనాలిటీపై కన్నేశారు. కాస్త అందంగా.. ఇంకాస్త ఆకర్షణీయంగా కనిపించాలనే వారి కోరిక.. విదేశీ ట్రైనర్ల వైపు మొగ్గు చూపేలా చేస్తోంది. దీంతో ఐదారేళ్లుగా సిటీకి విదేశీ ఫిట్‌నెస్ నిపుణుల రాక పుంజుకుంది.
 
 రెడ్ కార్పెట్..
ఈ విదేశీ ఫిట్‌నెస్ శిక్షకులు సెలిబ్రిటీలకు మాత్రమే పరిమితం కాలేదు.. వారి సేవలు జిమ్‌ల వరకూ విస్తరించాయి. ఫారిన్ ట్రైనర్లకు పెరుగుతున్న క్రేజ్ గమనించిన జిమ్, ఫిట్‌నెస్ సెంటర్స్ నిర్వాహకులు విదేశీ కోచ్‌లకు రెడ్ కార్పెట్ పరచి స్వాగతం పలుకుతున్నారు. మాదాపూర్‌లోని ప్రొటెన్స్ జిమ్‌లో విదేశీయులే ట్రైనర్లు. ‘జిమ్ ప్రారంభించిన కొత్తలో అమెరికాకు చెందిన జంటను శిక్షకులుగా నియమించుకున్నాం. ప్రస్తుతం అమెరికాకే చెందిన ట్రైనర్ కేలబ్ మా దగ్గర ట్రైన్ చేస్తున్నారు. క్రాస్‌ఫిట్ వంటి వర్కవుట్స్‌పై విదేశీ ట్రైనర్సే పక్కాగా శిక్షణ ఇవ్వగలరు’ అని చెప్పుకొచ్చారు ప్రొటెన్స్ జిమ్ నిర్వాహకుడు రాము.
 
 మనకు సెట్ కాదు..
 ఓ వైపు విదేశీ ట్రైనర్లకు ఆదరణ పెరుగుతుంటే.. మరో వైపు సిటీలైఫ్ స్టైల్‌కు ఫారిన్ సరుకు సెట్ కాదంటున్నారు లోకల్ ట్రైనర్లు. ‘ఇక్కడివారి జీవనశైలి, ఆహారపు అలవాట్లను, జెనిటిక్స్‌ను, బోన్‌స్ట్రక్చర్‌ను అర్థం చేసుకోవడంలో విదేశీయులకు సరైన అవగాహన ఉండద’ని  సిటీలో తొలి సర్టిఫైడ్ ట్రైనర్‌గా, సెలబ్రిటీ స్పెషలిస్ట్‌గా పేరొందిన హెలియోస్ జిమ్ నిర్వాహకుడు చంద్రశేఖర్‌రెడ్డి చెబుతున్నారు.
 
 ఈయన అభిప్రాయాలతో మరికొందరు సిటీ ట్రైనర్లు కూడా ఏకీభవిస్తున్నారు. ఇప్పటి వరకు స్థానిక ట్రైనర్ల పర్యవేక్షణలోనే హీరోలు సిక్స్‌ప్యాక్స్ సాధించారని గుర్తు చేస్తున్నారు. విదేశీ ట్రైనర్ల రాకతో ఈ రంగంలో యువత ఉపాధి అవకాశాలకు గండిపడే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఇటీవల సిటీలో ఊపందుకున్న విదేశీ ట్రైనర్ల హవా మాత్రం ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు.
 
 - ఫ్లోరిడా నుంచి వచ్చిన అంబర్, షూమేట్‌ల జంట గత కొంతకాలంగా జూనియర్ ఎన్టీఆర్ ఫిజిక్‌ని తీర్చిదిద్దుతున్నారని సమాచారం.
 - మహేష్‌బాబు ట్రైనర్‌గా ఫేమస్ అయిన క్రిస్ గెథిన్ నెలకు రూ.7 లక్షల నుంచి రూ.30 లక్షల వరకూ ఛార్జ్  చేస్తాడట. ముంబై నుంచి నగరానికి రాకపోకలు సాగించే ఈ సెలబ్రిటీ ట్రైనర్ ఇక్కడ తన స్వంత జిమ్ కూడా ప్రారంభించే పనిలో ఉన్నాడు.
 -    హీరో రామ్‌చరణ్ ఆస్ట్రేలియాకు చెందిన సమీర్‌జోరాను ట్రైనర్‌గా నియమించుకున్నారట
 -    సినీనటుడు నవదీప్, మోడల్ శిల్పారెడ్డి వంటి వారికి డేనియల్ మెక్‌కీ ట్రైనర్‌గా చేశారు. అపోలో ఆస్పత్రికి అనుబంధంగా ప్రారంభించిన జిమ్‌లోనూ వర్కవుట్స్‌ని ఈయన డిజైన్ చేశారు.
 -    ప్రస్తుతం మాదాపూర్‌లోని ప్రొటెన్స్‌లో ట్రైనర్‌గా ఉన్న అమెరికా వాసి కెలబ్ క్రాస్‌ఫిట్ ట్రైనింగ్‌కు పేరొందారు.
 - ఎస్.సత్యబాబు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement