అజ్ఞాతవాసం: మాధవ సేవలో రాధమ్మ
ప్రస్తుతం ఆమె నివసించే ఇంటి అలంకరణ చూస్తే బాల్యంలోనే ఆధ్యాత్మికమార్గం పట్టిన వ్యక్తి అనుకుంటాం. అయితే ఈ గృహిణి... నిన్నా మొన్నటి దాకా రంగులలోకంలో రాణించిన తార. వందకుపైగా సినిమాల్లో, వేలాదిగా నాటకాల్లో పాత్రలు పోషించి, పురస్కారాలు దక్కించుకుని... ఇల్లే దేవాలయంగా మార్చుకుని ప్రశాంతంగా జీవిస్తున్న ఆమె పేరు... రాధా ప్రశాంతి.
హైదరాబాద్, జూబ్లీహిల్స్‌లోని ఫిలిమ్‌నగర్‌లో ఉన్న ఓ అపార్ట్‌మెంట్ ఫ్లాట్ కాలింగ్‌బెల్ మోగించి, తలుపు తెరచుకోగానే ... ఒక్కసారిగా మనం వచ్చింది ఎక్కడికా అని అయోమయానికి గురవుతాం. హాలు మధ్యలో పెద్దగా అమర్చిన షిర్డి సాయిబాబా బొమ్మలు, గోడలకు నలువైపులా రాధాకృష్ణుల చిత్రపటాలు, నేపథ్యంలో కమనీయంగా జేసుదాస్ పాటలు మనం ఇంటికి వచ్చామా లేక ఏదైనా గుడికి వెళ్లామా అనే అనుమానం వచ్చేలా ఉంటుంది అలంకరణ తీరు.
రాధలా ఉన్నావని...
‘‘నా పేరు కృష్ణవేణి అండీ. సినిమాల్లో ప్రశాంతిగా మారింది. నా ఫీచర్స్ అప్పటి టాప్ హీరోయిన్ రాధలా ఉన్నాయని జర్నలిస్ట్‌లే నా పేరుకు ముందు రాధ చేర్చారు’’ అంటూ పరిచయం చేసుకున్నారామె. ‘‘ఆంధ్రా-ఒరిస్సా సరిహద్దులో గజపతిజిల్లాలోని పర్లాకిమిడి గ్రామం మాది. నృత్యప్రదర్శన లు ఇచ్చేదాన్ని. రంగస్థలంపైనా నాటకాలు ఆడేదాన్ని. అలా సినిమాల్లోకి వచ్చాను’’ అంటూ మొదలుపెట్టారామె. శ్రీదేవి నర్సింగ్‌హోం, మధ్యతరగతి మహాభారతం, పెళ్లిపందిరి, పెళ్లికానుక, ఎర్రసూరీడు వంటి సినిమాలలో రెండో హీరోయిన్‌గానూ, ప్రధానపాత్రలతో పాటు, మల యాళం సహా పలు భాషల్లో దాదాపు 100కుపైగా సినిమాలు, వేలాదిగా నాటకాల్లో నటించానని చెప్పారు. రంగస్థలనాయికగా, సినీనటిగా ఎన్నో పురస్కారాలనూ స్వంతం చేసుకున్నారు. అయినప్పటికీ ఎందుకు పూర్తిగా తెరమరుగయ్యారు?
వివాహంతో... శుభం కార్డు...
సినీజీవితానికి పెళ్లితో ముగింపు పలికానని కృష్ణవేణి చెప్పారు. తనను ఇష్టపడి పెళ్లి చేసుకున్న ఉప్పుడి కిరణ్‌కుమార్‌రెడ్డి ఇష్టం మేరకు వివాహానంతరం పూర్తిగా ఇంటికే పరిమితమయ్యానన్నారు. అనంతరం వ్యక్తిగత జీవితంలోని హడావిడి తగ్గి ఖాళీ దొరకగానే...చిన్నతనంలో ఊరి గుడిలో చేసిన పూజలు, నదిలో వదిలిన కార్తీకదీపాలు మదిలో మెదిలాయి. అప్పట్లో తానెంతో ఇష్టంగా పూజించిన కృష్ణుడి రూపం మనోహరంగా మెదిలింది. దాంతో ఈ ‘రాధా’ నివాసం... లో పందిరి మంచం నుంచి పడకగది దాకా, వరండా నుంచి వంటగది దాకా కృష్ణరూపం నిండిపోయింది. కృష్ణభక్తి ఆమెను మరింతగా ఆధ్యాత్మిక మార్గం వైపు మళ్లించింది. ‘‘కృష్ణమందిరం కట్టిన చోటే సమాధి అయిన షిర్డిసాయిబాబా అంటే నాకెంతో నమ్మకం. సమయం అదీ అని లేకుండా ఎప్పుడు అనిపిస్తే అప్పుడు షిర్డీ వెళ్లివస్తుంటాను’’ అని ఆమె చెప్పారు. దాంతో సాయిబాబా చిత్రపటాలు, విగ్రహాలకు కూడా ఆమె ఇల్లు కట్టని కోవెల అయింది. మాధవసేవలో పునీతమవుతున్న ఈ గృహిణి... మానవసేవను కూడా మరచిపోకపోవడం విశేషం.
ప్రస్తుతం తను పుట్టిన ఊరిలో దేవాలయం కట్టించిన ఈ దైవభక్తురాలు... అంగవికలురులకు, అనాధలకు క్రమం తప్పని సేవలను అందిస్తున్నారు. భర్తకు చెందిన స్టెప్ అనే స్వఛ్చంద సంస్థ కార్యక్రమాలనూ పర్యవేక్షిస్తున్నారు.
వస్తా... రమ్మంటే...
సినిమాలకు గుడ్‌బై చెప్పాక చేసిన ఏకైక సినిమా కూడా ‘దేవుళ్లు’ కావడం ఆ యాదృచ్ఛికమే కావచ్చు. ప్రస్తుతం భర్త, ఇద్దరు పిల్లలతో పాటు ఇలవేల్పుల సేవలో కాలం గడిపేస్తున్న ఈ తెలుగింటి గృహిణి... మళ్లీ సినిమాల్లో నటించాలనుంది అంటున్నారు. సినిమాల్లో మంచి పాత్రలు పోషించే అవకాశం వస్తే అంగీకరించడానికి సిద్ధంగా ఉన్న ఈమె ఆకాంక్ష నెరవేరితే... మరో మంచి క్యారెక్టర్ నటి తెలుగుతెరకు దొరికినట్టే.
- ఎస్.సత్యబాబు