Radha prasanthi
-
వందల కోట్ల ఆస్తి ఉన్న అతడు నాకోసం బిల్డింగ్‌పై నుంచి దూకాడు: నటి
తన హావభావాలతో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న నటి రాధ ప్రశాంతి. ఉన్నది ఉన్నట్లుగా ముక్కుసూటిగా మాట్లాడే ఆమె టైగర్, ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకుంది. భయమనేదే ఎరుగనని చెప్తూ ఉండే రాధ ప్రశాంతి ఆంధ్రా-ఒడిశా బార్డర్‌లోని కాశీనగర్‌లో జన్మించింది. ఆమె అసలు పేరు కృష్ణవేణి. తొమ్మిదో తరగతిలోనే తండ్రిని కోల్పోవడంతో చదివించేవాళ్లు లేక విద్యకు దూరమైంది. స్టేజీపై డ్రామాలు చేస్తూ నెమ్మదిగా వెండితెరకు పరిచయమైంది. పెళ్లిపందిరి, పెళ్లికానుక, లవకుశ.. వంటి పలు చిత్రాల్లో నటించింది. హీరోయిన్గా, సెకండ్ హీరోయిన్గా, సహాయక నటిగా పలు పాత్రలు పోషించింది. రెండు దశాబ్దాలుగా వెండితెరకు దూరమైన ఆమె కరోనా సమయంలో ఆహారం పంపిణీ చేస్తూ ఎంతోమందికి సేవ చేసింది. భర్త సాయంతో శ్రీకాకుళంలో గూడు లేనివాళ్లకు ఇళ్లు సైతం కట్టించింది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకుంది. నా కోసం బస్సు తగలబెట్టాడు.. 'మా ఇంట్లో అందరం ఫైర్‌బ్రాండ్సే. నేను కాలేజీకి వెళ్లే ఎక్స్‌ప్రెస్ బస్సు మా ఇంటి ముందు ఆపడం లేదని మా పెద్దన్న ఏకంగా బస్సునే తగలబెట్టాడు. ఎక్కడికి వెళ్లినా నాతో బాడీగార్డులా వచ్చేవాడు. మొదట నేను నాటకాలు వేసేదాన్ని. తర్వాత ఇండస్ట్రీలో అడుగుపెట్టా. హిందీతో పాటు దక్షిణాదిలో నాలుగు భాషల్లో చేశాను. వి.మధుసూదన్‌రావు డైరెక్షన్లో లవకుశ మూవీలో సెకండ్ హీరోయిన్గా చేశా. హిందీలో స్వప్నసుందరి సీరియల్ చేశాను. నిద్రమాత్రలు మింగి.. 12 ఏళ్లపాటు సినీ పరిశ్రమలో ఉన్నాను. హీరోయిన్గా మంచి ఆఫర్లు వస్తున్న సమయంలో పెళ్లైంది. కిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్నాను. మా పెళ్లి ఎలా జరిగిందంటే.. ఆయన నన్ను చూసి ఇష్టపడ్డారు. నా నెంబర్ తీసుకుని రాత్రి ఫోన్లు చేసేవాళ్లు. ఏంటి? ఇలా విసిగిస్తున్నావని అడిగితే తన ఫైనాన్స్ కంపెనీకి సంబంధించిన యాడ్ చేస్తారా? అని అడిగేవాడు. ఫైనాన్స్ కంపెనీలకు నేను యాడ్ చేయనని ముఖం మీదే చెప్పాను. అయినా తన ప్రవర్తన వింతగానే ఉండేది. అసలు విషయం ఆరా తీస్తే నన్ను పెళ్లి చేసుకునేందుకు రెడీ అయ్యాడని తెలిసింది. నేను నో చెప్పడంతో నిద్రమాత్రలు మింగి మూడంతస్తుల భవంతిపై నుంచి దూకాడు. వందల కోట్ల ఆస్తి ఉన్న అతడు ఎవరినీ కాదని, నిన్నే కావాలనుకుంటున్నాడంటే అతడి ప్రేమను అర్థం చేసుకోమన్నారు. చిన్నప్పటి నుంచి కష్టాలు.. నిజానికి నేను అతడికి నో చెప్పడానికి కారణం ఉంది. చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు చూశాను. నటిగా పేరు ప్రఖ్యాతలు వచ్చిన సమయంలో ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు నన్ను పెళ్లి చేసుకునేందుకు మా ఇంటి ముందుకు వచ్చేవారు. నాకు మాత్రం పెళ్లిపై ఏమాత్రం ఆసక్తి ఉండేది కాదు. కానీ చివరకు నాకోసం ప్రాణాలు తీసుకోవడానికి సిద్ధపడ్డ కిరణ్ కుమార్‌ను పెళ్లి చేసుకున్నాను. అయితే అత్తారింట్లో వాళ్లు సినిమా ఇండస్ట్రీకి కొంత దూరంగా ఉండేవారు. పెళ్లైన ఏడాది తర్వాత రామానాయుడు మంచి ఆఫర్లు ఇచ్చారు, కానీ నా భర్త ఒప్పుకోలేదు. పిల్లలు చిన్నవాళ్లు.. ఇప్పుడెందుకు అనడంతో ఆ అవకాశాలు తిరస్కరించాను. అలా వచ్చిన గ్యాప్ ఇప్పటికీ కొనసాగుతోంది. ఇల్లు తగలబెట్టారు కరోనా సమయంలో నా ఇల్లు తగలబడిపోయింది. కానీ అది ప్రమాదవశాత్తూ జరగలేదు, కొందరు కావాలనే చేశారు. జూన్ 6న నా ఇంటికి నిప్పుపెట్టారు. మూడు ఫ్లోర్ల భవంతిలో కేవలం నా ఒక్క ఇల్లే కాలిపోయిందంటే అక్కడే అర్థమైపోతుంది ఇదంతా ఓ కుట్ర అని! ఆ సమయంలో మా ఆయన పిల్లలతో పాటు ఊర్లో స్ట్రక్ అయిపోయారు. అందరూ కరోనా భయంతో ఉన్నారు. ఎవరి దగ్గర తలదాచుకోవాలో తెలియలేదు. ఎక్కడికి వెళ్లాలో దిక్కుతోచని స్థితిలో రామకృష్ణ మఠ్ వాళ్లు ఆశ్రయం కల్పించారు. వారు ఆశ్రయం ఇవ్వకపోతే నేనీ రోజు ఉండేదాన్ని కాదేమో! నేను ఆత్మహత్య చేసుకునేంత పిరికిదాన్ని కాదు. కానీ మనిషి జీవితం మారిపోవడానికి, చనిపోవడానికి ఒక్క క్షణం చాలు అని చెప్పుకొచ్చింది రాధా ప్రశాంతి. -
కాస్టింగ్ కౌచ్ ఎదురైనా పబ్లిసిటీ చేసుకోలేదు : నటి
సీనియర్ నటి రాధా ప్రశాంతి కాస్టింగ్ కౌచ్‌పై చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట హాట్‌టాపిక్‌గా మారాయి. ప్రస్తుతం సినిమాలకు దూరమైన ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో కాస్టింగ్ కౌచ్‌పై స్పందించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 'ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అన్నది ఇంతకు ముందు ఉంది..ఇప్పుడు ఉంది.. ఇక ముందు కూడా ఉంటుంది. అయితే అప్పట్లో ఇలాంటివి ఎదురైనా ఎవరూ పబ్లిసిటీ చేసుకోలేదు. ఇప్పుడు రోడ్డు మీదకి ఎక్కారు. అంతే తేడా. ఇక్కడ ఎవరూ ఎవరిని బలవంతం చేయరు. సినిమా కావాలంటే కమిట్మెంట్ ఇవ్వాలి అనే పాలసీ ఉందిక్కడ. నాకు కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైంది. ఓ సినిమాలో నన్ను సెకండ్ హీరోయిన్గా పెట్టుకొని ఆ తర్వాత తీసేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. మేనేజర్ని అడిగితే ఈ విషయం తెలిసింది. నా స్థానంలో కమిట్మెంట్ ఇచ్చిన వాళ్లని పెట్టుకున్నారు. అప్పుడు, ఇప్పుడు కూడా కాస్టింగ్ కౌచ్ ఉంది' అంటూ చెప్పుకొచ్చారు. -
సినీనటి రాధ ప్రశాంతిపై కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: సినీనటి రాధ ప్రశాంతిపై బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదయ్యింది. రాధా ప్రశాంతి తనపై దురుసుగా ప్రవర్తించారంటూ సాఫ్ట్వేర్ ఇంజనీర్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బిల్డింగ్ సెక్యూరిటీగా పని చేస్తున్న లక్ష్మీ అనే మహిళను రాధ ప్రశాంతి కారు ఢీ కొట్టింది. శబ్దం వినిపించడంతో స్థానికంగా ఉండే సాఫ్ట్వేర్ ఇంజనీర్ బయటికి వచ్చి చూడగా... రాధ ప్రశాంతితో పాటు ఉన్న మరో వ్యక్తి ఆ మహిళపై దాడి చేస్తుండగా తన మొబైల్లో చిత్రీకరించారు. దీంతో సాప్ట్వేర్ ఇంజనీర్ మొబైల్ లాక్కొని ధ్వంసం చేసి, అసభ్యకరంగా ప్రవర్తించినట్లు తెలిసింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు రాధ ప్రశాంతితో పాటు మరో వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
‘ఆ పెన్‌డ్రైవ్‌లో నా జీవితం ఉంది’
హైదరాబాద్ : పోయిన పెన్‌డ్రైవ్ వెల గురించి కాదని, అందులో తన జీవితం ఉందని సినీ నటి, రాష్ట్రపతి అవార్డు గ్రహీత రాధా ప్రశాంతి తెలిపారు. ఆ పెన్‌డ్రైవ్‌లో తన ఫొటోలు, తన కుటుంబసభ్యుల ఫొటోలు ఉన్నాయని, వాటిని మార్ఫింగ్ చేస్తే పరిస్థితి ఏమిటని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో రాధాప్రశాంతి విలేకరులతో మాట్లాడుతూ ... మూడు వారాలక్రితం ఫేస్బుక్ ద్వారా పరిచయమైన ఓ వ్యక్తి తాను రాష్ట్రపతి అవార్డుగ్రహీతను కావడం, పలు సామాజిక కార్యక్ర మాల్లో ముందుండటం, 100కు పైగా సినిమాల్లో నటించడంతో తనకు ఒక ప్రత్యేక పేజీ రూపొందిస్తానని మాయమాటలు చెప్పి తన పెన్‌డ్రైవ్ తీసుకెళ్లాడని తెలిపారు. ఆ పెన్‌డ్రైవ్‌లో తన కుటుంబ సభ్యుల ఫొటోలతో పాటు తాను సినిమాల్లో నటించినప్పటి ఫొటోలు, విలువైన డాక్యుమెంట్లు ఉన్నాయన్నారు. అందుకే బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశానన్నారు. దీనిపై పలు వార్తా పత్రికలు రకరకాలుగా రాయడం తనను తీవ్రంగా బాధిస్తోందన్నారు. -
సినీ నటి పెన్ డ్రైవ్ పోయింది...
కాల్‌డేటాను సేకరించారు.. అడ్రస్ కోసం గాలించారు.. ప్రత్యేకంగా ఓ బృందాన్ని నియమించారు... పోలీసు పెట్రోవాహనంలో నలుగురు క్రైం పోలీసులు దిల్ షుక్నగర్కు పరుగులుతీసి ఎట్టకేలకు కావాల్సిన వ్యక్తిని అరెస్టు చేశారు. ఇంతకు అతడు దొంగిలించింది ఏంటో తెలుసా..? వింటే ఆశ్చర్యపోతారు. అవును మరి ఆయన దొంగిలించింది పెన్‌డ్రైవ్. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. దిల్‌షుక్‌నగర్‌లో నివసించే జగదీష్ అనే వ్యక్తి ఆక్యుపంక్షర్ థెరపిస్టుగా పనిచేస్తున్నాడు. రెండు వారాల క్రితం ఫిలింనగర్లో నివసించే సినీ నటి రాధా ప్రశాంతికి పరిచయం అయ్యాడు. ఈ నేపథ్యంలో వారం రోజుల నుంచి జగదీష్ ఆమెతో ఫోన్లో అందుబాటులో లేకుండా పోయాడు. అయితే తన ఇంట్లో పెన్‌డ్రైవ్ చోరీకి గురైందని అది జగదీష్ చోరీ చేశాడంటూ ఆమె మూడు రోజుల క్రితం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు జగదీష్ కోసం గాలింపు చేపట్టారు. మూడు రోజులు అతని ఇంటి వద్ద మాటువేశారు. రేయింబవళ్లు అతడి కోసం వెతికేందుకు పోలీసు బృందాన్ని ఏర్పాటు చేశారు. తీరా జగదీష్‌ను విచారిస్తే ఆ పెన్‌డ్రైవ్ తాను తీయలేదని తెలిపాడు. పెన్‌డ్రైవ్ పోయిందని సినీనటి ఇచ్చిన ఫిర్యాదు మీద పోలీసులు చేసి హడావుడికి అవాక్కయ్యారు. ఇటీవల బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో అయిదు ఖరీదైన కార్లు చోరీకి గురయ్యాయి. ఇందులో ఫార్చునర్లాంటి ఖరీదైన కారు కూడా ఉంది. వీటి కోసం గాలించాల్సిన పోలీసులు ఓ పెన్‌డ్రైవ్ దొంగ కోసం మూడు రోజులుగా వేట సాగించారని తెలిసి.. జనం ముక్కున వేలేసుకున్నారు. -
అజ్ఞాతవాసం: మాధవ సేవలో రాధమ్మ
ప్రస్తుతం ఆమె నివసించే ఇంటి అలంకరణ చూస్తే బాల్యంలోనే ఆధ్యాత్మికమార్గం పట్టిన వ్యక్తి అనుకుంటాం. అయితే ఈ గృహిణి... నిన్నా మొన్నటి దాకా రంగులలోకంలో రాణించిన తార. వందకుపైగా సినిమాల్లో, వేలాదిగా నాటకాల్లో పాత్రలు పోషించి, పురస్కారాలు దక్కించుకుని... ఇల్లే దేవాలయంగా మార్చుకుని ప్రశాంతంగా జీవిస్తున్న ఆమె పేరు... రాధా ప్రశాంతి. హైదరాబాద్, జూబ్లీహిల్స్‌లోని ఫిలిమ్నగర్లో ఉన్న ఓ అపార్ట్మెంట్ ఫ్లాట్ కాలింగ్‌బెల్ మోగించి, తలుపు తెరచుకోగానే ... ఒక్కసారిగా మనం వచ్చింది ఎక్కడికా అని అయోమయానికి గురవుతాం. హాలు మధ్యలో పెద్దగా అమర్చిన షిర్డి సాయిబాబా బొమ్మలు, గోడలకు నలువైపులా రాధాకృష్ణుల చిత్రపటాలు, నేపథ్యంలో కమనీయంగా జేసుదాస్ పాటలు మనం ఇంటికి వచ్చామా లేక ఏదైనా గుడికి వెళ్లామా అనే అనుమానం వచ్చేలా ఉంటుంది అలంకరణ తీరు. రాధలా ఉన్నావని... ‘‘నా పేరు కృష్ణవేణి అండీ. సినిమాల్లో ప్రశాంతిగా మారింది. నా ఫీచర్స్ అప్పటి టాప్ హీరోయిన్ రాధలా ఉన్నాయని జర్నలిస్ట్‌లే నా పేరుకు ముందు రాధ చేర్చారు’’ అంటూ పరిచయం చేసుకున్నారామె. ‘‘ఆంధ్రా-ఒరిస్సా సరిహద్దులో గజపతిజిల్లాలోని పర్లాకిమిడి గ్రామం మాది. నృత్యప్రదర్శన లు ఇచ్చేదాన్ని. రంగస్థలంపైనా నాటకాలు ఆడేదాన్ని. అలా సినిమాల్లోకి వచ్చాను’’ అంటూ మొదలుపెట్టారామె. శ్రీదేవి నర్సింగ్‌హోం, మధ్యతరగతి మహాభారతం, పెళ్లిపందిరి, పెళ్లికానుక, ఎర్రసూరీడు వంటి సినిమాలలో రెండో హీరోయిన్‌గానూ, ప్రధానపాత్రలతో పాటు, మల యాళం సహా పలు భాషల్లో దాదాపు 100కుపైగా సినిమాలు, వేలాదిగా నాటకాల్లో నటించానని చెప్పారు. రంగస్థలనాయికగా, సినీనటిగా ఎన్నో పురస్కారాలనూ స్వంతం చేసుకున్నారు. అయినప్పటికీ ఎందుకు పూర్తిగా తెరమరుగయ్యారు? వివాహంతో... శుభం కార్డు... సినీజీవితానికి పెళ్లితో ముగింపు పలికానని కృష్ణవేణి చెప్పారు. తనను ఇష్టపడి పెళ్లి చేసుకున్న ఉప్పుడి కిరణ్‌కుమార్‌రెడ్డి ఇష్టం మేరకు వివాహానంతరం పూర్తిగా ఇంటికే పరిమితమయ్యానన్నారు. అనంతరం వ్యక్తిగత జీవితంలోని హడావిడి తగ్గి ఖాళీ దొరకగానే...చిన్నతనంలో ఊరి గుడిలో చేసిన పూజలు, నదిలో వదిలిన కార్తీకదీపాలు మదిలో మెదిలాయి. అప్పట్లో తానెంతో ఇష్టంగా పూజించిన కృష్ణుడి రూపం మనోహరంగా మెదిలింది. దాంతో ఈ ‘రాధా’ నివాసం... లో పందిరి మంచం నుంచి పడకగది దాకా, వరండా నుంచి వంటగది దాకా కృష్ణరూపం నిండిపోయింది. కృష్ణభక్తి ఆమెను మరింతగా ఆధ్యాత్మిక మార్గం వైపు మళ్లించింది. ‘‘కృష్ణమందిరం కట్టిన చోటే సమాధి అయిన షిర్డిసాయిబాబా అంటే నాకెంతో నమ్మకం. సమయం అదీ అని లేకుండా ఎప్పుడు అనిపిస్తే అప్పుడు షిర్డీ వెళ్లివస్తుంటాను’’ అని ఆమె చెప్పారు. దాంతో సాయిబాబా చిత్రపటాలు, విగ్రహాలకు కూడా ఆమె ఇల్లు కట్టని కోవెల అయింది. మాధవసేవలో పునీతమవుతున్న ఈ గృహిణి... మానవసేవను కూడా మరచిపోకపోవడం విశేషం. ప్రస్తుతం తను పుట్టిన ఊరిలో దేవాలయం కట్టించిన ఈ దైవభక్తురాలు... అంగవికలురులకు, అనాధలకు క్రమం తప్పని సేవలను అందిస్తున్నారు. భర్తకు చెందిన స్టెప్ అనే స్వఛ్చంద సంస్థ కార్యక్రమాలనూ పర్యవేక్షిస్తున్నారు. వస్తా... రమ్మంటే... సినిమాలకు గుడ్‌బై చెప్పాక చేసిన ఏకైక సినిమా కూడా ‘దేవుళ్లు’ కావడం ఆ యాదృచ్ఛికమే కావచ్చు. ప్రస్తుతం భర్త, ఇద్దరు పిల్లలతో పాటు ఇలవేల్పుల సేవలో కాలం గడిపేస్తున్న ఈ తెలుగింటి గృహిణి... మళ్లీ సినిమాల్లో నటించాలనుంది అంటున్నారు. సినిమాల్లో మంచి పాత్రలు పోషించే అవకాశం వస్తే అంగీకరించడానికి సిద్ధంగా ఉన్న ఈమె ఆకాంక్ష నెరవేరితే... మరో మంచి క్యారెక్టర్ నటి తెలుగుతెరకు దొరికినట్టే. - ఎస్.సత్యబాబు