సినీ నటి పెన్ డ్రైవ్ పోయింది...
కాల్‌డేటాను సేకరించారు.. అడ్రస్ కోసం గాలించారు.. ప్రత్యేకంగా ఓ బృందాన్ని నియమించారు... పోలీసు పెట్రోవాహనంలో నలుగురు క్రైం పోలీసులు దిల్ షుక్‌నగర్‌కు పరుగులుతీసి ఎట్టకేలకు కావాల్సిన వ్యక్తిని అరెస్టు చేశారు. ఇంతకు అతడు దొంగిలించింది ఏంటో తెలుసా..? వింటే ఆశ్చర్యపోతారు. అవును మరి ఆయన దొంగిలించింది పెన్‌డ్రైవ్.
బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. దిల్‌షుక్‌నగర్‌లో నివసించే జగదీష్ అనే వ్యక్తి ఆక్యుపంక్షర్ థెరపిస్టుగా పనిచేస్తున్నాడు. రెండు వారాల క్రితం ఫిలింనగర్‌లో నివసించే సినీ నటి రాధా ప్రశాంతికి పరిచయం అయ్యాడు. ఈ నేపథ్యంలో వారం రోజుల నుంచి జగదీష్ ఆమెతో ఫోన్‌లో అందుబాటులో లేకుండా పోయాడు. అయితే తన ఇంట్లో పెన్‌డ్రైవ్ చోరీకి గురైందని అది జగదీష్ చోరీ చేశాడంటూ ఆమె మూడు రోజుల క్రితం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
కేసు నమోదు చేసిన పోలీసులు జగదీష్ కోసం గాలింపు చేపట్టారు. మూడు రోజులు అతని ఇంటి వద్ద మాటువేశారు. రేయింబవళ్లు అతడి కోసం వెతికేందుకు పోలీసు బృందాన్ని ఏర్పాటు చేశారు. తీరా జగదీష్‌ను విచారిస్తే ఆ పెన్‌డ్రైవ్ తాను తీయలేదని తెలిపాడు. పెన్‌డ్రైవ్ పోయిందని సినీనటి ఇచ్చిన ఫిర్యాదు మీద పోలీసులు చేసి హడావుడికి అవాక్కయ్యారు.
ఇటీవల బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో అయిదు ఖరీదైన కార్లు చోరీకి గురయ్యాయి. ఇందులో ఫార్చునర్‌లాంటి ఖరీదైన కారు కూడా ఉంది. వీటి కోసం గాలించాల్సిన పోలీసులు ఓ పెన్‌డ్రైవ్ దొంగ కోసం మూడు రోజులుగా వేట సాగించారని తెలిసి.. జనం ముక్కున వేలేసుకున్నారు.