జీవితం సాధారణం
బడ్జెట్.. సామాన్యుల నుంచి అసామాన్యుల దాకా అందరినీ అటెన్షన్‌లో పెడుతుంది! కామన్ థింగ్స్ నుంచి కాస్మోటిక్స్ దాకా అన్నిటి ఉనికినీ శాసిస్తుంది. ఆ శాసనం కామన్‌మ్యాన్ శ్వాసను బరువెక్కించొచ్చు.. తేలిక చేయొచ్చు. సూట్‌కేస్తే తెరిస్తే కానీ సీక్రెట్ రివీల్ కాదు. ఈలోపు కొన్ని కుటుంబాలు వాళ్ల చిట్టాపద్దులు, ఈ వార్షిక బడ్జెట్ ఎలా ఉంటుందో అన్న కుతూహలాన్నీ తెలిపాయి.
- సరస్వతి రమ/ఎస్.సత్యబాబు
చివర్లో టెన్షన్
రాంచందర్ టీఆర్‌ఎస్ గ్రేటర్ హైదరాబాద్ ఎస్సీ సెల్ ప్రెసిడెంట్. స్థిరమైన ఆదాయంలేని వృత్తి. ఇద్దరు అమ్మాయిలు, అబ్బాయి. చిన్నమ్మాయి చెన్నైలోని ఓ ఎమ్‌ఎన్‌సీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. కొడుకుది మార్కెటింగ్ జాబ్. చిన్నదే అయినా సొంత ఇల్లుంది. కింద పోర్షన్, పైన పోర్షన్‌కి నామమాత్రపు అద్దె వస్తుంది. అయినా ఆదాలేని సంసారం.. చూసి ఖర్చుపెట్టుకోవాల్సిన ఆగత్యం అంటారు రాంచందర్ సతీమణి బాలేశ్వరి. ‘మాకు నెలకు ముప్పయ్‌వేల ఖర్చుంటుంది. నాలుగు రోజుల కూరగాయలకు రూ.250 అవుతున్నయ్. కరివేపాకు, కొత్తిమీర.. అంతెందుకు ఆకుకూరలు కూడా బాగా పిరం అయినయ్. సండే నాన్‌వెజ్‌కి మసాలాకి పదిహేను వందలు. పప్పూ, ఉప్పూ అన్నీ కొనుక్కోవల్సిందే. బియ్యం ధరలు కూడా మండిపోతున్నయ్. అందుకే రాత్రిపూట చపాతీకి ఓటేస్తున్నం.
మా అదృష్టానికి పిల్లల చదువులు పూర్తయినా, వారి పెళ్లిళ్లు చేయాలింకా. హైదరాబాద్‌లో ఉంటాం కాబట్టి.. హాస్పిటల్‌కని, పిల్లల కాలేజ్ అడ్మిషన్స్‌కని.. ఆఫీస్ పనుల మీదని వచ్చే చుట్టాలకేం కొదవుండదు. వచ్చిన చుట్టాలకు కనీసం పప్పన్నమన్నా పెట్టాలే కదా! జీతం రానంత వరకే మంచిగ. వచ్చిందంటే రెండు రోజుల్లో ఖతం. మల్లా ఒకటో తారీఖు దాకా టెన్షనే. సినిమాలు, షికార్లు, హోటళ్లల్ల డిన్నర్లయితే మాకు గుర్తేలేదు. ఒక్క సంతోషమేందంటే.. పొదుపు చేయలేకపోయినా అప్పు అయితే చేస్తలేం. మందు, సిగరెట్, గుట్కా లాంటి వాటిమీద బాగా రేట్లు పెంచి మిగిలినవి పెంచకుండా ఉంటే కుటుంబాలు బాగుపడ్తయ్’ అని చెప్పుకొచ్చారు బాలేశ్వరి. వాళ్లాయన మాట్లాడుతూ ‘నిజమే.. సామాన్యుల నిత్యావసరాల ధరలను తగ్గిస్తే చాలా క్షేమం’ అంటారు. చెన్నైలో ఉండే వాళ్లమ్మాయి రమోలా సెలవు మీద హైదరాబాద్ వచ్చింది. ఆ అమ్మాయి ‘ఎమ్‌ఎన్‌సీలలో పనిచేస్తున్నామంటే దానికి తగ్గట్టే ఉండాల్సి వస్తుంది. బ్రాండెడ్ డ్రెసెస్, వీకెండ్స్‌కి అవుటింగ్స్‌కి, స్ట్రెస్ బస్టర్స్ అంటూ టీమ్ డిన్నర్స్ కంపల్సరీ. సగం శాలరీ వీటికే ఖర్చు అవుతుంది. ఇంకొంత.. ట్రావెలింగ్‌కి. ఆఫీస్‌కైతే ఆటోలో వెళ్లాల్సిందే. ఏ ఆటో మీటర్ మీద రాదు. గట్టిగా అడిగితే.. రేట్లు పెరిగాయని దబాయిస్తారు. వీళ్ల రేట్లకు అనుగుణంగా మా శాలరీలు పెరగవ్ కదా. ఎంతో ఖర్చుపెట్టి మమ్మల్ని ఈ స్థితికి తెచ్చిన మా పేరెంట్స్‌కి ఫైనాన్షియల్ హెల్ప్ చేయలేకపోతున్నామనే గిల్ట్ ఫీలింగ్ ఉంటుంద’ని చెబుతోంది.
సగం జీతం రెంట్‌కే...
విద్యుత్ ఉద్యోగి అస్క మల్లయ్య బడ్జెట్ గోస ఇది.. ‘లైన్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నా. పేరుకే గవర్నమెంట్ జాబ్.. పొదుపు ముచ్చటే లేదు. ముగ్గురు పిల్లలు. పెద్ద బిడ్డ మాధురి బీటెక్ ఫస్టియర్. ఏటా లక్షలు పోయాలె. రెండో బిడ్డ అనూష బాసర ట్రిపుల్ ఐటీలో ఇంటర్ చదువుతుంది. ఆమెకు రూ.50 వేలు ఫీజు. కొడుకు అనిల్‌కుమార్ ఎనిమిది చదవుతున్నడు. ఇంట్లో ఒక్కడినే సంపాదించేటోడిని. సొంతిల్లు లేదు.సగం జీతం కిరాయిలకే పోతది. ఆ మిగిలిన జీతంలనే కూరగాయలు, ఉప్పు, పప్పు అన్నీ.. చిట్టీలు వేసినా.. ఎత్తుకున్న పైసలు పిల్లల చదువులకే అయితయ్. మీదికెళ్లి అప్పు చేయాల్సొస్తది. అది తీర్చడానికి ఇంకో కాడ అప్పు. ఇట్ల పెరుగుతనే ఉంటది. పిల్లలున్న కుటుంబం.. వాళ్లకు తిండి తక్కువ చేస్తమా? చదువు మాన్పిస్తమా? ఏ ఖర్చు తగ్గించుకోవాలె? ఇంక మా పిల్లలు.. దోస్తులు, సినిమాలు, షికార్లు అనేటోళ్లు కూడా కారు. కాలేజ్‌లల్ల సీట్లు కూడా మెరిట్ మీదనే వచ్చినయ్. ఇయ్యాల బడ్జెట్‌ల చూడాలే.. మాలాంటోళ్లకేమన్నా నిమ్మలంగా ఉంటదో.. ఉండదో!’ అంటారు మల్లయ్య.
మిగిలేది సున్నా..
మేమిద్దరం ఉద్యోగస్థులమే. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఉద్యోగం అంటే లక్షల్లో ప్యాకేజీలు వాళ్లకేంటి అనుకుంటారు కానీ.. సంవత్సరానికి రూ.10 లక్షలు ఆదాయం ఉన్నా.. మా బోటి వారికి మొత్తం పన్నులు, ఖర్చులు పోతే పెద్దగా మిగిలేదేమీ ఉండదు. టాక్స్, పీఎఫ్ వగైరాలు పోను చేతికి వచ్చేది రూ.7.50 లక్షలు. ఒక డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ రూ.30 లక్షలు పెట్టి కొంటే దీర్ఘకాలం దానికి నెలసరి వాయిదాలు చెల్లించడం కూడా కష్టమే. రూ.5 లక్షల దాకా ఆదాయంపై పన్ను తీసేసి, రూ.10 లక్షల లోపు ఆదాయానికి 10 శాతం, 10-15 లక్షల లోపుంటే 15 శాతం, ఆపైన ఉంటే 30 శాతం పన్ను అయితే వెసులుబాటుగా ఉంటుంది.
- అశోక్.
నోరు కట్టేసుకుంటేనే...
వాచ్‌మెన్ ఉద్యోగంలో చేరినప్పుడు నా జీతం రూ.700. ఇప్పటికి దాదాపు 18 ఏళ్లు కావస్తోంది. ఇప్పుడు జీతం రూ.8 వేలు. మా ఆవిడ ఆయాగా పనిచేస్తూ రూ.4,000 తెస్తోంది. అయినా ముగ్గురు పిల్లల్ని పెంచడం కష్టంగానే ఉంది ఫీజులు లేని గవర్నమెంట్ స్కూల్లోనే చదివించినా డ్రెస్సులు, పైన ఖర్చులు తప్పవు కదా. మా ఇద్దరికీ వచ్చిన దానిలో దాదాపు సగం ఇంటి అద్దె (రూ.5వేలు), కరెంటుకే సరిపోతంది. నచ్చింది తినడానికి లేదు. పప్పు, పచ్చడి మెతుకులతోనే సరిపెట్టుకోవాలి. ఈ మధ్యే పెద్దమ్మాయికి పెళ్లి చేశాం. ఇంకా ఇద్దరున్నారు. వీరిని గట్టెక్కించేవరకూ ఒళ్లు హూనం చేసుకోవాల్సిందే.
- శివ, కస్తూరి
కేంద్ర బడ్జెట్ అయినా మార్చిలో వచ్చే రాష్ట్ర బడ్జెట్ అయినా.. ప్రభుత్వాలకి చెలగాటం.. సామాన్యులకు ప్రాణ సంకటంలా ఉండకూడదనే వీళ్లందరి విన్నపం. కేంద్ర బడ్జెట్ సరే.. ఆమ్ ఆద్మీ నుంచి బడా ఆద్మీ వరకు అందరి దృష్టి కొత్త రాష్ట్రం కొత్త బడ్జెట్ మీదే!