ఎక్స్‌పోజర్ | Hyderabad residents ready to choose Expo Fancy Jewelry | Sakshi
Sakshi News home page

ఎక్స్‌పోజర్

Published Tue, Oct 21 2014 1:39 AM | Last Updated on Sat, Sep 2 2017 3:10 PM

ఎక్స్‌పోజర్

ఎక్స్‌పోజర్

కుప్పలుగా పోసి అమ్మే డిజైనర్ దుస్తులు, గుత్తులుగా వేలాడే ఫ్యాన్సీ ఆభరణాలు.. ఎక్స్‌పో ఏదైనా కావల్సింది ఎన్నుకోవడంలో హైదరాబాదీలు సిద్ధహస్తులైపోయారు. ఇప్పుడు నగరంలోని ప్రతి స్టార్ హోటల్స్, క్లబ్స్.. వగైరాలన్నీ ఫ్యాషన్ సంతలకు వేదికలయ్యాయి. సిటీలో ఎక్స్‌పోలకు పెరుగుతున్న క్రేజ్ రాష్ట్రం, దేశం ఎల్లలు దాటింది. జాతీయ అంతర్జాతీయ డిజైనర్లు, అమ్మకపుదారులు హైదరాబాద్‌లో ఫ్యాషన్ ఎక్స్‌పో అంటే చాలు సై అంటున్నారు. సదరు ఎగ్జిబిషన్స్‌లో స్టాళ్ల కోసం క్యూ కడుతున్నారు. ఈ ట్రెండ్ సిటీలోని ఎక్స్‌పో నిర్వాహకులకు మరింత ఊపునిస్తోంది.
 
 మహా అయితే ఒక్కరోజు.. వీలైతే మూడు రోజుల పాటు సాగే ఈ ఎక్స్‌పోలు రూ. కోట్లలో వ్యాపారం చేస్తుండడంతో పలు రాష్ట్రాలు, దేశాల నుంచీ వ్యాపారులు తరలివస్తున్నారు. ‘హైదరాబాద్‌లో ఎక్స్‌పో జరుగుతోందంటే వెంటనే స్టాల్ బుక్ చేసేసుకుంటాం. ముంబైలో వ్యాపారం ఎక్కువ చేసినా, స్టాల్‌కయ్యే వ్యయం అవీ చూసుకుంటే ఇక్కడే లాభం ఎక్కువ. అందుకే మూడేళ్లుగా 6 ఎక్స్‌పోలలో పార్టిసిపేట్ చేశాను’ అని ముంబైకి చెందిన ఓ వ్యాపారి చెప్పారు.
 
మహిళలే నిర్వాహకులు..
 సిటీ పేజ్ త్రీ సర్కిల్‌ను ఇప్పుడు బిజీగా మారుస్తున్నవి కేవలం నైట్ పార్టీలూ, క్లబ్ సందళ్లు మాత్రమే కాదు.. ఎక్స్‌పోలు కూడా. దశాబ్దం కిందట కామిని షరాఫ్ ఫ్యాషన్ యాత్ర తప్ప పెద్దగా ఎక్స్‌పోజర్‌కు నోచుకోని ఫ్యాషన్ ఉత్పత్తుల ప్రదర్శనలు.. ఇప్పుడు సిటీలో ఎక్కడ పడితే అక్కడ ఏర్పాటవుతున్నాయి. మహిళల కోసం మహిళల చేత అన్నట్టుండే ఈ ఎక్స్‌పోలను నిర్వహించడంలో సిటీ వనితలు ముందుంటున్నారు. కామినిషరాఫ్, శశినెహతా, నిఖితారెడ్డి, మనీషాకపూర్.. ఇలా పేజ్ త్రీ సర్కిల్‌లోని పలువురు ఎక్స్‌పో నిర్వాహకుల జాబితాలో చేరిపోతున్నారు.  
 
 పశ్చిమ బెంగాల్ నుంచి పాకిస్థాన్ దాకా...
 కారెవరూ స్టాళ్ల ఏర్పాటుకు అనర్హం అన్నట్టుగా.. పలు ప్రాంతాల నుంచి వ్యాపారులు నగరంలో జరిగే ఎక్స్‌పోలకు తరలివస్తున్నారు. నిర్వహణ వ్యయం తక్కువగా ఉండడం, వ్యాపార పరిమాణం దినదినాభివృద్ధి చెందుతుండడంతో దూరాభారాలు లెక్కచేయకుండా మరీ వస్తున్నారు. పాకిస్థాన్ నుంచి రెడ్జ్, రూమీ ఫ్యాబ్రిక్స్.. వంటి బ్రాండ్స్, ఆఖరికి సౌతాఫ్రికా నుంచి కొరియన్ క్లిప్స్ వంటి సంస్థలూ ఇక్కడికి ఉరుకులు పరుగులు పెడుతున్నాయి.
 
  సిటీకి తరలివస్తున్న ఉత్పత్తిదారుల్లో ముంబై, కోల్‌కతా, బెంగళూరుల నుంచి పెద్దసంఖ్యలో ఉంటే, ఢిల్లీ, జైపూర్, చెన్నైల నుంచీ చెప్పుకోదగ్గ స్థాయిలోనే వస్తున్నారు. ఏర్పాటవుతున్న స్టాల్స్‌లో డిజైనర్ దుస్తులు అందులోనూ శారీస్ ఫస్ట్ ప్లేస్ దక్కించుకుంటుంటే, ఫ్యాన్సీ జువెలరీ సెకండ్, యాక్సెసరీస్‌ది థర్డ్‌ప్లేస్. ‘గతంతో పోలిస్తే ఎక్స్‌పోల సంఖ్య బాగా పెరిగింది. ఒకే సమయంలో పలుచోట్ల ఎక్స్‌పోలు ఏర్పాటవుతున్నాయి. అయినా వేరే ఊళ్ల నుంచి వస్తున్న వారి మధ్య స్టాల్స్‌కు పోటీ తగ్గడం లేదు’ అంటున్నారు ఎక్స్‌పో నిర్వాహకురాలు శశినెహతా.  
 
 మా సిటీ కన్నా బెస్ట్
 మాది బెంగళూరు. తొలిసారి ఎగ్జిబిషన్‌లో పార్టిసిపేట్ చేయడానికి హైదరాబాద్ వచ్చినప్పుడు నాకెలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ లేవు. ఆ తర్వాత బిజినెస్ పరంగా హైదరాబాద్ ఏమిటో నాకు అర ్థమైంది. మొదట్లో ఏడాదికి ఒకసారి వచ్చేదాన్ని. లాస్ట్ సిక్స్ ఇయర్స్ నుంచి ఇయర్లీ ట్వైస్ సిటీకి వస్తున్నా. ఇక్కడి ఫ్యాషన్ ప్రియుల టేస్ట్‌కు తగ్గట్టు డిజైన్లు, ఫ్యాబ్రిక్స్ అందించడం నిజంగా ఒక డిజైనర్‌కు సవాల్ లాంటిది. ఐయామ్ ఎంజాయింగ్ ఇట్. ఫ్యాషన్ విషయంలో బెంగళూర్ కన్నా హైదరాబాదే బెస్ట్.
 - ఆమ్రపాలి, బెంగళూరు
 
 ‘బోర్డర్స్’కు ఆర్డర్లు
లాస్ట్ ఇయర్ ఫస్ట్‌టైమ్ హైదరాబాద్‌కి వచ్చా. మంచి రెస్పాన్స్ వచ్చింది. సేల్స్ బాగున్నాయి. దాంతో ఈసారీ వచ్చేశాం. శారీస్‌కు డిజైనర్ బోర్డర్స్ మా స్పెషల్. ఇక్కడ మాకు రెగ్యులర్ క్లయింట్లు కూడా ఏర్పడ్డారు. ఫోన్ల ద్వారా ఆర్డర్స్ ఇస్తున్నారు. నె క్ట్స్ ఇయర్ కూడా వస్తాను. అప్‌కమింగ్ డిజైనర్లకు సిటీ ఒక బెస్ట్ చాయిస్.
 -బీనా జైస్వాల్, ఢిల్లీ
 
 డిఫరెంట్ సిటీ
 ఆరేళ్లుగా ఏడాదికి మూడుసార్లు వస్తున్నా. ఇక్కడ జరిగే ప్రతి టాప్ ఎక్స్‌పోలో పార్టిసిపేట్ చేస్తున్నా. హైదరాబాదీలకు ఉన్నంత ఫ్యాషన్ స్పృహ మరెవరికీ లేదేమో!. ఇక్కడి షాపింగ్ టేస్ట్స్ చాలా స్పీడ్‌గా మారుతుంటాయి. ఇక్కడ ఎక్స్‌పోలో పార్టిసిపేట్ చేయడమనేది ఒక డిజైనర్‌ని అలర్ట్ చేసేస్తుంది. రొటీన్ నుంచి బయటపడేస్తుంది. అన్నింటికన్నా హ్యాపీగా అనిపించే విషయం నచ్చిన డిజైన్ కోసం ఎంతైనా సరే ఖర్చు పెట్టడానికి సై అంటారు.
 - రీనా, ఇండోర్
 - ఎస్.సత్యబాబు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement