టైమ్ సరిపోవట్లేదా..? ఎక్సర్‌సైజ్ తప్పదు మరి!
వ్యాయామం ఎందుకు చేయడం లేదనో, మధ్యలో ఎందుకు మానేశారనో అడిగితే ఠపీమని వచ్చే సమాధానం ‘‘అబ్బే... టైమెక్కడండీ’’ అని. అయితే ఇక ఇలాంటి సాకులు చెల్లవు. ఎందుకంటే బిజీగా గడుపుతూ రోజువారీ పనులు చేసేందుకు రోజు మొత్తం సరిపోవడం లేదనేవారు వెంటనే చేయాల్సిన పని ఎక్సర్‌సైజ్... అని నిపుణులు చెప్తున్నారు. పైగా సమయాన్ని ఆదా చేసేందుకు వ్యాయామం ఒక గొప్ప సాధనం కూడా అని వివరిస్తున్నారు. అదెలాగో తెలుసుకోవాలంటే కాస్త టైమ్ వెచ్చించి ఈ కథనం చదవండి మరి...
వేగం...యోగం...
స్పీడు యుగంలో మనిషికి రెండు చేతులు చాలడం లేదు. ఒక మెదడు సరిపోవడం లేదు. అలాగే సమయం కూడా. కళ్లు తెరిచి మూసేలోగా... రోజుకున్న 24 గంటలూ హాంఫట్ అయిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సాధారణంగా గంటలో చేసే పనిని మనం అరగంటలోనే చేసేయగలిగితే... అందుకు తగ్గ శారీరక సామర్థ్యం, చురుకుతనం మన స్వంతం అయితే ఎంత అద్భుతంగా ఉంటుంది కదా! అయితే ఆ అద్భుతం నిజం కావాలంటే మనం వెంటనే వ్యాయామం మొదలుపెట్టాలి.
రోజూ వర్కవుట్ చేసేవారిలో రక్తప్రసరణ చేయనివారికన్నా మెరుగ్గా ఉంటుంది. వ్యాయా మం వల్ల దేహంలోని ప్రతి అవయవం తన పనితీరును మరింతగా మెరుగుపరచుకుంటుంది. తగినంత రక్తప్రసరణ కారణంగా మెదడు మరింత సామర్థ్యం సంతరించుకుంటుంది. దాంతో ఆలోచనల్లో, నిర్ణయాలు తీసుకోవడం లో వేగం పెరుగుతుంది. తద్వారా మన పనితీరులో సమూలమైన మార్పులు వస్తాయి. ఎప్పుడూ చేసే పనులను మరింత సమర్థంగా, వేగంగా చేయగలుగుతాం. తద్వారా సమయాన్ని ఆదా చేసుకుంటూ ఒక పని చేసే టైమ్‌లోనే రెండు పనులు చేసేయగలుగుతాం. రోజు మొత్తం మీద కనీసం 40 నిమిషాల పాటు సరిపడా శారీరకశ్రమ చేసేవారి చురుకుదనం అలా చేయనివారితో పోలిస్తే రెట్టింపు ఉంటుందని ఇటీవల నిర్వహించిన ఒక అంతర్జాతీయ స్థాయి పరిశోధనలో వెల్లడైంది.
ప్లాన్ చేస్తే...
ఇలాంటి మార్పు చేర్పులన్నీ మనం సూక్ష్మంగా విశ్లేషించుకుంటే సులభంగానే అర్థమవుతాయి. వ్యాయామం చేసిన రోజుల్లో నిర్వహించిన పనులను, వాటికి పట్టిన సమయాన్ని ఒక డైరీలో రాసుకోవాలి. ఆ తర్వాత ఓ రెండ్రోజులు వ్యాయామానికి విరామం ఇవ్వాలి. వ్యాయామం చేయని రోజుల్లో చేసిన పనులను, వాటికి పట్టిన సమయాన్ని కూడా డైరీలో మన వర్క్‌రొటీన్ సహా నమోదు చేసుకోవాలి. ఈ రెండిటినీ బేరీజు వేసుకుంటే సులభంగా తేడా తెలుస్తుంది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే... కొంతకాలం గా వ్యాయామం చేస్తున్నవారు, విరామం ఇచ్చిన తర్వాత కనీసం 3 రోజుల అనంతరం మాత్రమే పనితీరులో పూర్తి స్థాయి వ్యత్యాసం కనిపిస్తుందని నిపుణులు చెప్తున్నారు.
- ఎస్.సత్యబాబు
రెట్టింపు పనులు చేసే శక్తి వస్తుంది...
వారంలో 5 రోజులు చొప్పున ఏళ్ల తరబడి చేస్తున్నా. అప్పుడప్పుడు అనుకోకుండా అనివార్యకారణాల వల్ల, విదేశాలకు వెళ్లినప్పుడో 2,3 రోజులు గ్యాప్ వస్తే... వెంటనే నా పనితీరులో తేడా తెలిసిపోతుంది. రోజుకు 30మంది స్టాఫ్‌కు ఆదేశాలు ఇస్తూ, రకరకాల పనులు చేస్తూ ఉండే నేను... ఎక్సర్‌సైజ్‌కు దూరమైన 2-3 రోజుల్లో తప్పనిసరిగా పనుల్లోనూ వెనుకబడిపోతాను. మంచి బ్లడ్ సర్క్యులేషన్ ఉంటేనే మనం మంచి నిర్ణయాలు అదీ వేగంగా తీసుకోగలం. ఇందుకు సరైన ఉదాహరణ..క్రీడాకారులు. వారు చూడండి ఎంత చురుకుగా ఉంటారో... వేలమంది చూస్తున్నా ఏమాత్రం ఏకాగ్రత కోల్పోరు. అలాగే గాయాల నుంచి కూడా త్వరగా రికవ ర్ అవుతారు. శరీరానికి అవసరమైన చురుకుదనాన్ని అందిస్తే విజయాలు ఆటోమేటిక్‌గా వరిస్తాయి. నిజానికి వ్యాయామాన్ని మించి సమయాన్ని ఆదాచేసే చిట్కా మరొకటి లేదు.
శిల్పారెడ్డి, మోడల్, ఫిట్‌నెస్ కాలమిస్ట్
సామర్థ్యం మెరుగవుతుంది...
వాకింగ్ చేయమంటే... టైమ్ లేదంటారు చాలామంది. అయితే అది సరైనది కాదు. పని ఎంత ఎక్కువ ఉంటే అంత తప్పనిసరిగా వ్యాయామం చేయాలి. ఎందుకంటే దీనివల్ల పని సామర్థ్యం పెరుగుతుంది. చేయాల్సిన పనులు మరింత సమర్థవంతంగా, త్వరితంగా చేయగలరు. రకరకాల వ్యాపకాలతో చాలా బిజీగా ఉండే పెద్ద పెద్ద వాళ్లు సైతం టైమ్ సెట్ చేసుకుని మరీ వ్యాయామం చేసేది అందుకే. ఇప్పుడు మనం ఎంత బిజీగా ఉన్నా... అవి శరీరానికి పెద్దగా శ్రమ కలిగించే పనులు కావనేది నిస్సందేహం. నిజానికి శరీరం ఎప్పుడూ చలిస్తూ ఉండాలి. దాని అన్ని అవయవాలకూ చలనం కావాలి. బ్రెయిన్, కిడ్నీ, హార్ట్ అన్నింటికీ క్రమపద్ధతిలో రక్తప్రసరణ జరగాలంటే... క్రమబద్ధమైన కదలిక అవసరం. బాడీ మూవ్‌మెంట్ లేకపోతే శరీరంతో పాటు మైండ్ కూడా బద్ధకంగా తయారవుతుంది. తద్వారా ఎన్నో పనులు చేస్తున్నామనుకున్నా... అన్నీ సరిగా చేయడం సాధ్యపడదు. ఇంకో విషయం ఏమిటంటే... ఇంతే సామర్థ్యంతో మనం మున్ముందు కూడా ఉండాలన్నా... వ్యాయామం అవసరం. ఇప్పుడు ఎక్సర్‌సైజ్ చేయడం అంటే భవిష్యత్తు సమస్యలను ఎదుర్కోవడంపై శరీరానికి శిక్షణ అందించినట్టే.
- డాక్టర్ విజయ్‌మోహన్, కన్సల్టెంట్ ఫిజిషియన్, కేర్ ఆసుపత్రి.