అరుదైన కళారూపం | Anju Poddar is a multiple personality as writer, art collector | Sakshi
Sakshi News home page

అరుదైన కళారూపం

Published Tue, Jun 24 2014 12:54 AM | Last Updated on Sat, Sep 2 2017 9:16 AM

అరుదైన కళారూపం

అరుదైన కళారూపం

 ‘‘మేం హైదరాబాద్‌కువచ్చిన తొలినాళ్ల నుంచీ తోటవైకుంఠం సాబ్, లక్ష్మాగౌడ్ సర్ వంటి వారితో పరిచయం ఉంది. తొలినాళ్లలోనే వారి వర్క్స్‌ను దగ్గర నుంచి పరిశీలించడం నా అదృష్టం’’ అని అంటున్నప్పుడు ఒక కళాకారుడ్ని కేవలం అభిమానించడమే కాదు ఎంత బాగా గౌరవించాలో కూడా తనకు తెలుసని అంజు మాటల ద్వారా నిరూపిస్తారు.
- అంజుపొద్దార్
 
 ఎం.ఎఫ్ హుస్సేన్‌కు ఆతిథ్యం...
 ఎం.ఎఫ్.హుస్సేన్  ప్రత్యేకంగా గీసి ఇచ్చిన కాన్వాస్ ఆమె ఇంటి గోడలపై కొలువుదీరింది. ‘‘ఆయన ఎప్పుడు వచ్చినా మా ఇంట్లో ఉండడానికి ఇష్టపడేవారు’’ అని గుర్తు చేస్తారు. రోజుకు అరడజను పుస్తకాలు చదివేసిన రోజులున్నాయని తన పఠానాభిరుచిని వివరిస్తారు. సొంతంగా దుస్తుల్ని డిజైన్ చేసుకునే ఈ మల్టీ టాలెంటెడ్ సిటిజన్‌కు కళాకారులకు అద్భుతమైన ఆతిధ్యం ఇవ్వడంలో సిటీలో మంచి పేరుంది. ఆమె నిర్వహించే పార్టీల్లో అతిథుల జాబితాలో కళాకారులు కచ్చితంగా చోటు ఉంటుంది.
 
 నాలుగు దశాబ్ధాల అనుబంధం...
 జూబ్లీహిల్స్‌లోని ఫిలింనగర్‌లో నివసించే అంజూపొద్దార్ కళాభిమాని మాత్రమే కాదు రచయిత, పర్యాటకురాలు, ఆర్ట్ కలెక్టర్, టెక్స్‌టైల్ ఎక్స్‌పర్ట్... వీటన్నింటికీ మించి విజయవంతమైన గృహిణి కూడా. ఢిల్లీ దగ్గరలోని మోడీనగర్‌కు మార్వాడీ ఫ్యామిలీకి చెందిన అంజుపొద్దార్... నగ రంతో పెనవేసుకున్న అనుబంధాన్ని పరిశీలిస్తే ఇక్కడే పుట్టి పెరిగిన వారికన్నా మిన్నగా అనిపిస్తుంది. ‘‘చిన్నప్పుడు దాదాపు ప్రతి రోజూ చార్మినార్‌కు వెళ్లేదాన్ని. అక్కడి రణగొణధ్వనులు, షాప్‌వాలాల మాటలు అవన్నీ నాకు ఇష్టం. ఇప్పటికీ ఖాళీ దొరికితే  చార్మినార్‌కు వెళ్లడానికి ఇష్టపడతాను. అలాగే రెండు వారాల క్రితం మక్కామసీదుకి  వెళ్లాను. చౌమహల్లా ప్యాలెస్‌కు వెళతాను. నేను పక్కా హైదరాబాదీని. ఈ నగరంలోని అణువణువూ నాకిష్టమైనదే’’ అని చెబుతున్నప్పుడు ఈ భాగ్యనగరి పట్ల పెంచుకున్న మమకారం ఆమె మాటల్లో మెరుస్తుంది.
 
 అష్ట్టైశ్వర్యాలు...
 మీ సంపద ఏమిటి? అంటే ఇవిగో అంటూ తన ‘అష్టైశ్వర్యాలు’ తీసుకొచ్చి పరుస్తారు. ఆమె రచించిన ఎనిమిది పుస్తకాలను  పరిశీలిస్తే... అంజు పొద్దార్‌లోని మరో కోణం మనకు గోచరిస్తుంది. ‘‘అమెరికాలో బీఈ చేసి తిరిగొచ్చాక మానస సరోవర్ వెళ్లా. ఆ అనుభవం ఎంతో గొప్పగా అనిపించి తొలిసారి జర్నీ టు హెవెన్ పేరుతో పుస్తకం రాశా’’ అంటూ గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత మరో రెండు ట్రావెలాగ్‌లు, వెడ్డింగ్ ఇన్ ద హౌస్, ట్రెడిషిన్స్ ఆఫ్ ఇండియా, కుక్ బుక్, తన తండ్రిగారి బయోగ్రఫీ, 108 షేడ్స్ ఆఫ్ డివినిటీ...’’ పుస్తకాలను ఆమె  అందించారు.
 
 వీటిలో అత్యధికం భారతీయతకు, సంస్కృతీ సంప్రదాయాలకు పట్టం కట్టేవే కావడం గమనార్హం.‘‘పుస్తకాల త ర్వాత నేను అంతగా ఇష్టపడే వి చేనేతలు’’ అంటారామె. అందుకే పోచంపల్లి, ఉప్పాడ, వెంకటగిరి, ఖాదీ వంటివి మాత్రమే కాదు నవాబులు, నిజాంలు మెచ్చిన, ప్రస్తుతం అంతరిస్తున్న హస్త కళల్లో ఒకటైన టెరియరుమాల్ (చీరాల ప్రాంతపు పురాతన చేనేత)ను సైతం ఆమె తన వస్త్రధారణలో భాగం చేసుకుంటారు.(సిటీప్లస్‌కి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఆమె ధరించిన చీర టెరియరుమాల్ చేనేతదే)
 
 పెండెంట్స్‌లో పెయింటింగ్స్...
 ‘‘నా జీవితంతో మమేకమైన అంశాల్లో అత్యంత ముఖ్యమైనది చిత్రకళ’’ అంటున్నప్పుడు ఆమెలో ఒక సాధారణ కళాభిమాని కనపడతారు. అయితే ఆమె ఆ చిత్రకళతో మమేకమైన తీరు చూసినప్పుడు మాత్రం అసాధారణ కళాపిపాసి ఉట్టిపడతారు. ‘‘నా చీరలు, పెండెంట్స్‌లో సైతం పెయింటింగ్స్‌కు చోటుఉంటుంది’..అంటూ తన ‘చిత్ర’ప్రపంచాన్ని ఆవిష్కరిస్తారామె. అంతేకాదు... తను అభిమానించే ఎమ్ ఎఫ్ హుస్సేన్, తోట వైకుంఠం, లక్ష్మాగౌడ్ వంటి చిత్రకారులకు ఆమె తన ఇంట్లో పట్టం కట్టిన తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఒక్కో గదిని ఒక్కో చిత్రకారుడికి అంకితం ఇచ్చిన ఆమె కళాభిమానం అబ్బురపరుస్తుంది.
 
 సోషలైట్ అంటే అసహ్యం...
 ‘‘సోషలైట్ పిలుపు ఇష్టపడను. చిత్రకారులనో, మరెవరినో నేను ప్రమోట్ చేస్తున్నాను అంటే కూడా ఒప్పుకోను. ఎవరికైనా అంతర్గత ప్రతిభ ఉంటే అది వెలికి రావడానికి నా వంతు సాయం చేస్తాను. అది నా సంతోషం కోసం మాత్రమే. నేను గిఫ్ట్స్‌గా కూడా ఆర్ట్ వర్క్స్ మాత్రమే ఇస్తాను. ఫ్యాషన్‌లో ఆర్ట్ లేని రోజుల్లో చిత్రాలను రూ.50కి కూడా కొన్నాను. ఇప్పుడవి ఏ ధరలో ఉన్నాయో మీకు తెలుసు. అయినా నా అభిమానంలో మార్పులేదు.  లక్ష్మాగౌడ్, జగదీష్ మిట్టల్, ఎం.ఎఫ్. హుస్సేన్‌ల దగ్గర నుంచి  ఇప్పుడిప్పుడే ప్రాచుర్యంలోకి వస్తున్న ఉదయలక్ష్మి, సరస్వతి వంటి చిత్రకారులను కూడా అభిమానిస్తాను’’ అంటారామె.
 
 బహుముఖపాత్రల్లో రాణించిన అంజుపొద్దార్...
 విజయవంతమైన గృహిణి కూడా. తన పిల్లలను ప్రయోజకులుగా తీర్చిదిద్ది, మనవళ్లు, మనవరాళ్ల ఆటపాటలతో తన జీవితానికి మరింత కళను అద్దుకుంటున్న అంజుపొద్దార్... మరికొన్ని ప్రజోపయోగ అంశాలపై పుస్తకాలు రాయాలనుందని, మరెందరో ఔత్సాహిక కళాకారుల విజయాలకు సాక్షిగా నిలవాలనుందని తన భవిష్యత్తు లక్ష్యాలను వివరిస్తారు. కళాభిమానులెందరో... అంజుపొద్దార్‌లు కొందరే...
-  ఎస్.సత్యబాబు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement