
ముంబైలోని నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్‌లో భారీ ఆర్ట్ ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. ‘రన్ యాస్ స్లో యు క్యాన్’ (Run as slow as you can) పేరిట టాయిలెట్ పేపర్ అనే మ్యాగజైన్ ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేసింది. జులై 22న ప్రారంభమైన ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ అక్టోబర్ 22 వరకు సుదీర్ఘంగా కొనసాగనుంది. ఏడేళ్ల లోపు చిన్నారులు, సీనియర్ సిటిజెన్‌లు, ఆర్ట్ విద్యార్థులకు ఈ ప్రదర్శన పూర్తిగా ఉచితమని కల్చరల్ సెంటర్ పేర్కొంది.
ఈ ప్రదర్శనలో ఏర్పాటు చేసిన కళ్లు చెదిరే కళాకృతులు చిన్నారులు, యువతను అమితంగా ఆకట్టుకుంటాయని నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ చైర్‌పర్సన్ నీతా అంబానీ కుమార్తె ఇషా అంబానీ పేర్కొన్నారు. ఆర్ట్ ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక మంది ప్రఖ్యాత కళాకారులు, ఔత్సాహికులు తరలివచ్చారు. వీరితో కలిసి ఇషా అంబానీ సందడి చేశారు.
ఇదీ చదవండి ➤ IPL 2023: ఫ్రీగా చూపించినా.. వేల కోట్లు సంపాదించారు!
రంగురంగుల కార్నివాల్, 10,000 అరటిపండు బుడగలతో నిండిన స్విమ్మింగ్ పూల్, వింటేజ్ కారు, విలాసవంతమైన మొసలి ఆసనం, కళాకృతంగా తీర్చిదిద్దిన గోడలు వంటివి మంత్రముగ్ధులను చేస్తాయని, సందర్శకులు నచ్చినన్ని ఫొటోలు తీసుకోవచ్చని నిర్వాహకులు పేర్కొన్నారు. కాగా బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ ఈ ఎగ్జిబిషన్‌ను సందర్శించి బనానా పూల్‌లో ఆటలాడుతూ సందడి చేశారు.