సెల్ఫీ | Cellfie | Sakshi
Sakshi News home page

సెల్ఫీ

Published Mon, Oct 27 2014 1:15 AM | Last Updated on Sat, Sep 2 2017 3:25 PM

సెల్ఫీ

సెల్ఫీ

నచ్చిన, మెచ్చిన దృశ్యాన్నో, సందర్భాన్నో, అందాన్నో తీసి చూసి ఆనందపడే ఫేసుల్ని... ‘వెర్రిముఖమా.. ఎవర్నో చూసి ఎవరో తీసి కాదు నిన్ను నువ్వే తీసుకుని చూసుకుని ఎంజాయ్ చెయ్’ అంటూ కొత్త రకం టెక్నిక్‌ను చేతికిచ్చింది..‘సెల్ఫీ’. బ్యాక్ కెమెరాను వెనక్కినెట్టేస్తూ ఫ్రంట్ కెమెరాకు వీర క్రేజ్ తెచ్చిన ఈ ట్రెండ్ ఫొటోగ్రఫీకి కొత్త అర్థాలు చెబుతోంది. నిన్నామొన్నటి దాకా ఏదైనా టూరిస్ట్ ప్లేస్‌కి వెళ్లి.. పక్కనున్న వారినో, అపరిచితుల్నో బతిమాలి ఫొటోలు తీయించుకునేవాళ్లం. ఇప్పుడా బాధలకు శుభం కార్డ్ వేసింది సెల్ఫీ. సిటీలో ఈ ట్రెండింగ్ వింతలూ విశేషాలూ..           - ఎస్. సత్యబాబు

మనల్ని మనం ఫ్రంట్ ఫొటోలు తీసుకోవడమనేది వీడియో కాలింగ్‌తో స్టార్ట్ అయింది. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని నోకియా ఫ్రంట్ కెమెరాను పరిచయం చేయడంతో ఈ ట్రెండ్ ఊపందుకుంది. యువతరం సెల్ఫీపై బాగా మక్కువ పెంచుకుంటోంది. సెల్ఫీల దూకుడు ఏ రేంజ్‌లో ఉందంటే.. కొన్ని రోజులకి మామూలు కెమెరాను మర్చిపోతామేమో అనేంతగా. స్నేహితులు, కుటుంబసభ్యులు, బాయ్/గాళ్‌ఫ్రెండ్స్/సహోద్యోగులతో ఛాయాచిత్రాలను పంచుకోవడంలో తలమునకలైపోతున్నారు. మనం పంపిన సెల్ఫీని అవతలి వ్యక్తి చూశారా లేదా అనేదీ మనకు తెలిసిపోతుండడం కిక్‌నిస్తోంది.
 
ఐ విల్ అప్‌డేట్ టూ యూ
టీనేజ్ యువత సెల్ఫీమేనియాలో కొట్టుకుపోతోంది. స్నాప్‌చాట్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సప్ వంటి అప్లికేషన్స్ సాయంతో ఈ ట్రెండ్ విజృంభిస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో సెల్ఫీలు అప్‌లోడ్ చేస్తున్నారు. స్నాప్‌చాట్ అప్లికేషన్ ద్వారా లేచిన దగ్గర్నుంచి ప్రతిదీ ఫ్రెండ్స్‌తో పంచుకుంటున్నారు. ‘టుడే ఆనంద్‌కాబ్రా డిజైన్ చేసిన డ్రెస్ వేసుకున్నాను. బార్బెక్యూలో ఫిష్ టేస్ట్ చేస్తున్నా. స్పాయిల్ పబ్‌లో క్యూట్ ‘చిక్’తో సల్సా చేస్తున్నా. లియో మెరిడియన్‌లో స్విమ్ చేస్తున్నా. ఐమ్యాక్స్‌లో సినిమా చూస్తున్నా’.. ఇలా టెక్ట్స్ మెసేజ్‌ల ద్వారా అప్‌డేట్స్‌ను నియర్ అండ్ డియర్‌కు ఫొటోలు జోడించి మరీ పంపించుకుంటున్నారు. క్లాస్‌రూమ్‌ల నుంచీ సెల్ఫీలు పంపడం ఇబ్బడిముబ్బడిగా పెరిగింది. స్టాండ్‌కి కెమెరా తగిలిం చి సెల్ఫీలు తీసుకోవడం ఇప్పుడు నయా ట్రెండ్‌గా మారింది.  
 
‘ఇగో’ తృప్తికి ఇదో మార్గం
మనం చేసే రోజువారీ పనులను కాస్త గొప్పగానో, కొంచెం వెరైటీగానో ఇతరులకు ససాక్ష్యంగా చెప్పడంతో పాటు చూపడం మరింత క్రేజీగా మారింది. ఎక్కువ మంది దృష్టిని తమవైపు తిప్పుకోవడం దీన్లో ఒక ప్రధానోద్ధేశంగా కనిపిస్తోందని నగరానికి చెందిన సైకాలజిస్ట్‌లు అంటున్నారు. స్నేహితులకు తమ క్రియేటివిటీ తెలపడం, దినచర్యలోని వైవిధ్యాన్ని ప్రదర్శించడం ద్వారా వ్యక్తిగత ఇగో సంతృప్తికి ఇది ఉపకరిస్తోందట.

దినచర్యలో రొటీన్ ఫీలింగ్‌ను దూరం చేసుకోవాలను కోవడమూ ఓ కారణమేనంటున్నారు. వ్యక్తులు ఎదురుగా ఉన్నప్పుడు కొన్ని చూపాలనుకుని, లేదా చెప్పాలనుకుని.. అవి చేయలేకపోయినవారు సెల్ఫీలను ప్రత్యామ్నాయంగా వినియోగిస్తున్నారు. ఎమోషన్స్ వ్యక్తీకరణలకు ఇది మాధ్యమంగా మారింది. దూరంగా ఉన్నవారికి సెల్ఫీ ద్వారా ఎక్స్‌ప్రెషన్స్‌ను పంపడం లేటెస్ట్ ట్రెండ్. ఉదాహరణకు ఇతరులు పంపిన టెక్స్ట్‌మెసేజ్ నవ్వు తెప్పిస్తే దానికి సమాధానంగా స్మైలీని పంపేవాళ్లు. ఇప్పుడదే స్మైలీ ప్లేస్‌లో తామే నవ్విన ఫొటోని తీసుకుని పంపుతున్నారు. టీజింగ్‌కూ వీటిని వాడుతుండడం సెల్ఫీలు మోసుకొస్తున్న దుష్పరిణామాల్లో ఒకటి.
 
డోంట్ బీ ‘సెల్ఫీ’ష్...
జంటలు తీసుకుంటున్న కొన్ని సెల్ఫీలు బాగా క్లోజప్‌లుగా ఉంటున్నాయి. ఇవి ఒక్కసారి చేయి దాటితే జీవితాలనే తలకిందులు చేయవచ్చునని ఇటీవల దేశవ్యాప్తంగా జరిగిన కొన్ని సంఘటనలు వెల్లడిస్తున్నాయి. కాబట్టి ఫ్రంట్ కెమెరా వినియోగంలోనూ సంయమనం పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. వ్యక్తిగత భధ్రతను భంగపరిచేవి, మన ం నివసించే పరిసరాలు, పరిస్థితులు పదేపదే ఇతరులకు తెలియజేయడం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. పదుల సంఖ్యలో రోజూ సెల్ఫీలు తీసుకోవడం అలవాటైతే.. అది మానసిక జాడ్యంగా మారే ప్రమాదం ఉందంటున్నారు. సో... టేక్ సెల్ఫీ అండ్ హ్యాండిల్ విత్ కేర్.
 
 
సర్వే(సెల్ఫీ)జనా...
* సెల్ఫీక్రేజ్ మహిళల్లోనే ఎక్కువని సెల్ఫిసిటీ పేరుతో జరిగిన ఓ అంతర్జాతీయ సర్వేలో వెల్లడైంది.
* విదేశీ నగరాల్లో ఈ ట్రెండ్ ప్రమాదపు ఘంటికలు మోగిస్తోంది. న్యూయార్క్‌లో ఇటీవల ఒక యూనివర్సిటీ చేసిన సర్వేలో న్యూడ్ సెల్ఫీలు పంపుకోవడం యువతకు క్రేజీగా మారిందని తేలిన విషయం ఉలిక్కిపడేలా చేసింది. ముఖ్యంగా హైస్కూల్ స్టూడెంట్స్‌లో న్యూడ్ సెల్ఫీలు పంపుతామని 20శాతం మంది చెబితే... 38శాతం మంది అలాంటివి తరచుగా రిసీవ్ చేసుకుంటున్నామని చెప్పారు.
* ఫేస్‌బుక్‌పై సెల్ఫీలను పోస్ట్ చేసే మగవాళ్ల ధోరణి తమకు నచ్చదని 23.1 శాతం మంది అమ్మాయిలు చెప్పారట. ఒక మ్యారేజ్ వెబ్‌సైట్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాలన్నింటిలో చేసిన సర్వేలో ఇది తేలింది.
* సెల్ఫీ ముదిరి మానసిక జాడ్యంగా మారుతుందా? అని ప్రశ్నించుకుంటే అవుననే చెబుతున్నాయ్ పరిణామాలు. బ్రిటిష్ యువకుడు డానీ బొవ్‌మన్ (19) ఒకేరోజున ఏకంగా 200 సెల్ఫీలు తీసుకుని, అప్పటికే పర్ఫెక్ట్ ఫొటో రాక, మానసిక ఒత్తిడికి గురయ్యాడట. ఆత్మహత్యకు సైతం యత్నించాడు. సెల్ఫీల రాక తర్వాత సెల్ఫీ అడిక్షన్‌కు గురైన తొలి యువకుడిగా ఇతడ్ని ఇప్పుడు గుర్తించారు.
 
నాట్ ఫర్ సెల్ఫ్
మనల్ని మనం తీసుకునే ఫొటోలు సామాజిక చైతన్యం కోసం కూడా తీయవచ్చునని సిటీకి చెందిన మోడల్స్ నిరూపించారు. నగరానికి చెందిన దీపాదేవేంద్ర, సాధనాసింగ్, దినేష్ శర్మ వన్యప్రాణులను రక్షించాలనే సందేశంతో సిటీలోని చారిత్రక స్థలాలే వేదికగా సేవ్ వైల్డ్ అండ్ యానిమల్ నినాదాలతో సహా తీసుకున్న ఫొటోలు.. సెల్ఫీ క్రేజ్‌కు తొలిసారి మానవీయ కోణాన్ని యాడ్ చేశాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement