రావోయ్ సాంబా.. పోవే చిన్నా.. | Siblings is reality symbol of brother and sister relationship | Sakshi
Sakshi News home page

రావోయ్ సాంబా.. పోవే చిన్నా..

Published Sun, Aug 10 2014 12:21 AM | Last Updated on Sat, Sep 2 2017 11:38 AM

రావోయ్ సాంబా.. పోవే చిన్నా..

రావోయ్ సాంబా.. పోవే చిన్నా..

తీర్చిదిద్దిన శిల్పాల్లా ఉంటారు. గ్లామర్ ఇండస్ట్రీ కోసం పుట్టిన ‘అందమైన’ బేబీస్‌లా ఉంటారు. అంతేనా.. ఒకరి కోసం ఒకరన్నట్టు ఉంటారు.

తీర్చిదిద్దిన శిల్పాల్లా ఉంటారు. గ్లామర్ ఇండస్ట్రీ కోసం పుట్టిన ‘అందమైన’ బేబీస్‌లా ఉంటారు. అంతేనా.. ఒకరి కోసం ఒకరన్నట్టు ఉంటారు. అక్క డిజైన్ల కోసం తమ్ముడు ర్యాంప్ ఎక్కితే, తమ్ముడి సినిమా కోసం అక్క డిజైనింగ్‌లో మునిగి తేలుతుంటారు. సిటీలోని ఫ్యాషన్, సినీ రంగాలకు చిరపరిచితమైన ఈ అక్కాతమ్ముళ్లు ఆప్యాయత అనురాగాలనే చెట్టు కొమ్మల్లా ఉంటారు. ‘సిబ్లింగ్స్’కు సిసలైన సింబల్ అనిపించే ఈ అందమైన తెలుగింటి ‘కొమ్మల్ని’ కదిలిస్తే కబుర్లెన్నో కురుస్తాయిలా..
 
 ‘సాంబయ్యా.. ఈ పప్పుచారన్నం
 కొంచెం తిని వెళ్లరా’
 ‘ఓయ్ చిన్నా... నన్నలా పిలవొద్దన్నానా?’
 ‘‘పోవోయ్.. నేనలాగే పిలుస్తా’
 ఈ సంభాషణ చదివితే.. అచ్చమైన తెలుగింటి కబుర్లులా కమ్మగా అనిపిస్తాయి. అదే అల్ట్రా మోడ్రన్ అక్కా తమ్ముళ్ల మధ్య అని తెలిస్తే ఆశ్చర్యం కలిగిస్తాయి. ‘వీడు పుట్టినప్పుడు నాకొచ్చే గిఫ్ట్‌లూ, పేరెంట్స్ ముద్దులూ తగ్గిపోతాయేమోనని భయపడ్డా. నాకన్నా ఆరేళ్లు చిన్నోడు. అయినా నన్ను చిన్నా అని పిలుస్తాడు’ అంటూ మురిపెంగా చెప్పారు శిల్పారెడ్డి. ‘పెద్దరికం చూపించి తనే నావన్నీ లాక్కునేది. నేను ఫియరో బైక్ కొనుక్కుంటే తను వేసుకుని వెళ్లిపోయేది. మంచి పేరుంది కదా నాకు.. అయినా సాంబయ్యా, సమ్మూ అని పిలుస్తుంది’ అంటూ ఆ మురిపాన్ని షేర్ చేసుకున్నాడు సామ్రాట్.
 
 ఆడిపించినా.. ఏడిపించినా..
 ‘నేను మంచం దిగకుండానే పొద్దున్నే  చెస్ బోర్డ్ పట్టుకుని వచ్చేసేవాడు. ఆడి, ఓడిపోయేదాకా ఊరుకునేవాడు కాదు. ఫ్రెండ్స్‌తో నేను నా రూమ్‌లో ఉంటే బయట నుంచి ఒకటే గోల..’ తమ్ముడి చిన్ననాటి అల్లరి గురించి  శిల్ప ఫిర్యాదులు కొనసాగుతూండగానే.. ‘ఫ్రెండ్స్‌తో ఉంటే డిస్ట్రబ్ చేస్తున్నానని రిబ్బన్లతో కట్టేసి 2 గంటలు అలాగే ఉంచేసేది’ అంటూ ఎదురుదాడికి దిగాడు సామ్రాట్. ఈ  జ్ఞాపకాల జడిలో ఆటపట్టించు కున్నవైనా.. ప్రోత్సహించుకున్నవీ ఉన్నాయి.
 
 చప్పట్లూ.. ముచ్చట్లూ..
 చదువులో కన్నా కళల్లోనే ప్రావీణ్యం చూపించిన వీరిలో ఫ్యాషన్ ఐకాన్‌గా శిల్ప, సినీనటుడిగా సామ్రాట్‌లు ఉండటం ఆశ్చర్యం కలిగించదు. ‘తమ్ముడు స్పోర్ట్స్ బాగా ఆడేవాడు. మిమిక్రీ చేసేవాడు. నాకు మ్యూజిక్ అంటే ఇష్టం.  మేడ మీద చిన్న స్టేజ్ లాంటిది వేసి  నేను పాడుతూంటే వాడు వేల మంది ప్రేక్షకుల పెట్టు అయ్యేవాడు. వాడు మిమిక్రీ చేస్తూంటే చేయి కందిపోయేలా  చప్పట్లు కొట్టేదాన్ని’ అంటూ గుర్తు చేసుకున్నారు శిల్పారెడ్డి(గాయని కాబోయిన శిల్ప మోడల్‌గా మారారు. సామ్రాట్ మాత్రం నటుడిగా కొనసాగుతున్నాడు). ‘ సమ్మూకి మోడలింగ్ ఇంట్రస్ట్ లేక ఆఫర్లు వచ్చినా చేయలేదు. అయితే నా కోసం ర్యాంప్ వాక్ చేస్తాడు’ అని శిల్ప అంటుంటే అందుకుని ‘నా కోసం చిన్నా చాలాసార్లు డిజైన్ చేసింది. తను నా సినిమాకి పూర్తిస్థాయి డిజైనర్‌గా చే యాలని నా కోరిక’ ని చెప్పాడు సామ్రాట్.
 
 అక్క కోసం కొట్టాలనుకున్నా..  తమ్ముడ్ని కొడుతుంటే ఏడ్చా...
 ‘అక్కంటే నా ఫ్రెండ్స్‌లో  కొందరు తెగ క్రేజీగా ఉండేవారు. నాకెందుకో వాళ్లు అలా ఉండటం నచ్చేది కాదు. కొట్టాలనిపించేది’ అని సామ్రాట్ గుర్తు చేసుకుంటాడు. అదే స్థాయిలో.. ‘ఫస్ట్ మూవీలో తమ్ముడిని కొట్టే సన్నివేశం చూస్తున్నప్పుడు ఏడుపు ఆగలేదు’ అంటూ సోదర ప్రేమను మనతో పంచుకుంటున్నప్పుడు ఎన్ని రంగుల ప్రపంచాలైనా రక్త సంబంధాల ముందు దిగదుడుపే అనిపించకమానదు. రాఖీ పండుగ వచ్చిందంటే ప్రతి ఇల్లూ సోదరీ సోదరుల ఆప్యాయతలతో నిండిపోతుంది. ‘ప్రతి రాఖీ పండుగకు నేను రాఖీ కడతాను. వీడు నాకు డబ్బులిస్తాడు. మావయ్యకి రాఖీ కట్టేందుకు అమ్మ వెళుతుంటే మేం కూడా  మామయ్య ఇంటికి వెళ్లి సరదాగా గడిపేస్తుంటాం’ అంటూ ఆ పండుగ అనుభూతుల్ని అప్పజెబుతారు శిల్ప. ‘తనింత సంపాదించుకుంటుందా? కాని చిన్న రాఖీ కట్టేసి, పప్పుచారన్నం పెట్టేసి బోలెడన్ని డబ్బులు గుంజేస్తుంది’ అని చెప్పాడు సామ్రాట్.
 
 ఈ సరదాల మాటున కొండంత ఆదరణ ఉంది. ఈ గిల్లికజ్జాల నీడలో అంతులేని అనురాగం వర్ధిల్లుతూ ఉంది. ‘సినిమాల్లోకి వెళ్లినప్పుడు సంతోషించినా.. నటనను ఒక ఇష్టమైన వ్యాపకంగా మాత్రమే ఉంచుకో. ఇంకేదైనా కెరీర్‌ను ఆప్షనల్‌గా పెట్టుకో’ అని చెప్పారట శిల్ప. ‘పెద్దక్క అమ్మలాంటిదే అయితే, ‘చిన్నా’ (చిన్నక్క) నాకు ఫ్రెండ్, ఆమె చెప్పింది అక్షరాలా ఫాలో అవుతున్నా’ నన్నాడు సామ్రాట్.
 ‘మనిషి ఎదుగుదలను అందలాలను చూసి కాదు అనుబంధాలను చూసి చెప్పాలి’ అన్న మాట  ఈ అక్కాతమ్ముళ్ల అనుబంధమంత నిజం.
 - ఎస్.సత్యబాబు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement