ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకం లబ్ధిదారుల సంఖ్యను రెట్టింపు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు కేంద్ర బడ్జెట్ 2024లో ప్రతిపాదనలు వెలువడే అవకాశం ఉన్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. వచ్చే మూడేళ్లలో ఈ లక్ష్యాన్ని చేరుకోవాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది.
అధికారిక వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం..ఆయుష్మాన్ భారత్ ద్వారా అందించే వార్షిక కవరేజీని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాలనే ప్రతిపాదన ఉంది. ఈ పథకాన్ని 70 ఏళ్లు పైబడిన వారికి విస్తరించాలని యోచిస్తున్నారు. వచ్చే మూడేళ్లలో ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకం లబ్ధిదారుల సంఖ్యను రెట్టింపు చేయాలని కేంద్రం పరిశీలిస్తోంది. దీనిపై రాబోయే బడ్జెట్ సమావేశాల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్‌లో కేంద్రం ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన (ఏబీ పీఎంజేఏవై)ను 12 కోట్ల కుటుంబాలకు విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. తద్వారా కేటాయింపులను రూ.7,200 కోట్లకు పెంచింది. మరో రూ.646 కోట్లు ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్‌కు కేటాయించారు. రానున్న బడ్జెట్ సమావేశాల్లో కొత్త ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తే నేషనల్ హెల్త్ అథారిటీ రూపొందించిన అంచనాల ప్రకారం కేంద్ర ఖజానాపై ఏడాదికి రూ.12,076 కోట్ల అదనపు భారం పడుతుంది.
ఇదీ చదవండి: అనంత్-రాధికల పెళ్లికి ప్రభుత్వం సెలవు ప్రకటించాలి
బడ్జెట్ రూపొందించడానికి ముందు ప్రభుత్వం వివిధ పరిశ్రమ వర్గాలను సంప్రదించింది. అందులో బడ్జెట్‌లో ఆర్థిక వనరులను పెంచాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) డిమాండ్ చేసింది. ఆరోగ్యంపై ప్రభుత్వం తక్కువ ఖర్చు చేస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు రాసిన లేఖలో ఐఎంఏ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా దేశ జీడీపీలో 1.1 శాతం నుంచి 1.6 శాతం మాత్రమే ఆరోగ్య సంక్షేమానికి కేటాయింపులు ఉన్నాయని తెలిపింది. వీక్షిత్ భారత్ 2047 లక్ష్యాలను సాధించడానికి ఆరోగ్య రంగాన్ని ప్రోత్సహించాలని చెప్పింది. పరిశ్రమలు, విద్య, వ్యవసాయం వంటి ప్రాధాన్యతా రంగంగా ఆరోగ్య రంగాన్ని మార్చాలని సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment