విజయవాడ డివిజన్ నుంచి రైల్ కార్గొ రవాణా
సాక్షి, అమరావతి: కొత్త ఆదాయ వనరులను పెంపొందించుకునే ప్రణాళికలో భాగంగా రాష్ట్రం నుంచి రైల్ కార్గో అవకాశాలను విస్తరించడంపై దక్షిణ మధ్య రైల్వే దృష్టి సారించింది. ఇప్పటికే ఈ ఏడాది విజయవాడ డివిజన్ రికార్డుస్థాయిలో కార్గో రవాణా చేసింది. వ్యవసాయ ఉత్పత్తుల రవాణాపై ప్రత్యేక దృష్టి సారించిన రైల్వే తాజాగా .. గ్రానైట్, ఫ్లైయాష్ రవాణా చేసేందుకు ఉన్న అవకాశాలను చేజిక్కించుకునేందుకు రంగంలోకి దిగింది.
సత్ఫలితాలిస్తున్న బీడీయూ..
రైల్ కార్గో టర్నోవర్‌ను పెంపొందించుకునేందుకు రైల్వే శాఖ ప్రత్యేకంగా బిజినెస్ డెవలప్‌మెంట్ యూనిట్లు (బీడీయూ) ఏర్పాటు చేసింది. డివిజన్‌స్థాయి, క్షేత్రస్థాయిలో ఈ బీడీయూల ద్వారా వ్యవసాయ, పారిశ్రామికవర్గాలతో సమావేశమవుతోంది. రోడ్డు మార్గంలో వస్తు రవాణా చేస్తున్న వ్యాపార సంస్థలు, ఉత్పత్తిదారులతో సంప్రదింపులు జరుపుతోంది. రైల్ కార్గో రవాణా ద్వారా తాము అందిస్తున్న రాయితీలను వివరిస్తూ వ్యాపార అవకాశాలను పెంపొందించుకుంటోంది. రైతు సంఘాలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతిదారులకు కేంద్ర రైల్వే శాఖ ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన కిసాన్ రైళ్ల సౌలభ్యంపై అవగాహన కల్పిస్తోంది. రైతులు నేరుగా తమ ఉత్పత్తులను రవాణా చేస్తే ఫ్రైట్ చార్జీల్లో 50శాతం రాయితీ ఇస్తూ.. సానుకూల ఫలితాలను రాబట్టింది.
రికార్డు స్థాయిలో రైల్ కార్గో..
50 శాతం రాయితీతో కిసాన్ రైళ్లు ప్రవేశపెట్టడంతో రైల్ కార్గో రవాణా రికార్డుస్థాయిలో పెరిగింది. మామిడి, ఉల్లిపాయలు, ఆక్వా, డెయిరీ ఉత్పత్తులు, కూరగాయలు, ఇతర పండ్లు రికార్డు స్థాయిలో రవాణా చేశారు. 2020–21లో విజయవాడ డివిజన్ నుంచి వ్యవసాయ ఉత్పత్తులు ఏకంగా 40,121 మెట్రిక్ టన్నుల రవాణా చేయగా.. 2021–22లో సెప్టెంబర్ 15నాటికే 9,810 మెట్రిక్ టన్నులు రవాణా చేశారు. ఢిల్లీ, ముంబాయి, కోల్‌కతా, గువహతి, చెన్నై, బెంగళూరు తదితర నగరాలకు ఎక్కువుగా రవాణా చేశారు. కిసాన్ రైళ్లలో కాకుండా ఇతర రైళ్ల ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే మరో 1,060 మెట్రిక్ టన్నులు రవాణా చేశారు.
పారిశ్రామిక ఉత్పత్తుల రవాణాకు ప్రణాళిక..
తాజాగా దక్షిణ మధ్య రైల్వే అధికారులు విజయవాడ డివిజన్ నుంచి పారిశ్రామిక ఉత్పత్తుల రవాణాపై దృష్టి సారించారు. ప్రధానంగా గ్రానైట్, ఫ్లైయాష్‌ను దేశంలోని వివిధ ప్రాంతాలకు రవాణా చేసేందుకు సూత్రప్రాయంగా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇప్పటి వరకు ఒంగోలు జిల్లా నుంచి భారీస్థాయిలో గ్రానైట్‌ను, థర్మల్ ప్లాంట్ల నుంచి ఫ్లైయాష్‌ను రవాణా చేసేందుకు.. రోడ్డు మార్గాన్నే ఆశ్రయిస్తున్నారు. ప్రస్తుతం వాటిని రైళ్ల ద్వారా రవాణా చేసేందుకు రైల్వే అధికారులు జరిపిన సంప్రదింపులు ఫలప్రదమయ్యాయి. వారానికి ఐదు ర్యాక్‌ల చొప్పున గ్రానైట్, ఫ్లైయాష్ రవాణా చేసేందుకు రైల్వే శాఖ సన్నాహాలు చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment