ఆదాయ వనరులు పుష్కలం.. అభివృద్ధి చేయండి
సీఎంకు వివరించిన కలెక్టర్ జానకి
నెల్లూరు సాక్షి, ప్రతినిధి: నెల్లూరు జిల్లాలో ఆదాయవనరులు పుష్కలంగా ఉన్నాయి. అన్నిరంగాలపై దృష్టిపెడితే జిల్లా మరింత ప్రగతి సాధించే అవకాశం ఉంది. దీనిపై జిల్లా కలెక్టర్ జానకి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు పలు ప్రతిపాదనలు చేశారు. విజయవాడలో బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లా కలెక్టర్లతో సమావేశమయ్యారు. ముందుగా సూచించిన మేరకు ఆయా జిల్లాల్లో అభివృద్ధి పనులకు సంబంధించిన నివేదికలు సిద్ధం చేసి తీసుకురావాలని ఆయా జిల్లా కలెక్టర్‌లను సీఎం ఆదేశించిన విషయం తెలిసిందే.
అందులో భాగంగా బుధవారం సీఎంతో సమావేశమైన కలెక్టర్ జానకి ‘జిల్లా మత్స్య ఉత్పత్తులకు నెలవు. ఈ సంవత్సరం సుమారు రూ.1,200 కోట్ల టర్నోవర్ జరిగింది. మత్స్య పరిశ్రమను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలి. అందుకోసం విరివిగా కోల్డ్ స్టోరేజ్‌లు ఏర్పాటుచేయాలి. అదేవిధంగా చేనేత ఉత్పత్తులకు జిల్లా దేశస్థాయిలో ప్రసిద్ధి చెందింది. చేనేత పరిశ్రమను అభివృద్ధి చేస్తే వేలాది కుటుంబాలకు ఉపాధి కల్పించడంతో పాటు వ్యాపార అభివృద్ధి జరుగుతుంది. సోమశిల, కండలేరు రిజర్వాయర్‌లలో నీరు పుష్కలంగా ఉంటుంది.
ఆ ప్రాంతంలో విద్యుత్, నీరు సరఫరా చేసి పరిశ్రమలు అభివృద్ధిచేయాలి. పులికాట్, నేలపట్టు పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. ఈ ప్రాంతాలను అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తే పర్యాటకుల సంఖ్య విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. తద్వారా ఆ పరిసర ప్రాంతాలు అభివృద్ధి చెందడంతో పాటు ప్రభుత్వానికి ఆదాయం పెరిగే అవకాశం ఉంది.’ అని కలెక్టర్ జానకి సీఎం చంద్రబాబునాయుడికి వివరించారు. ఇందులో జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ప్రతిపాదనలు కూడా ఉన్నాయి.