నంద్యాలలో ముస్తాబవుతున్న వేదిక
– తంగెడంచ, ఓర్వకల్లు, నంద్యాలలో ముఖ్యమంత్రి సుడిగాలి పర్యటన
– రాత్రికి నంద్యాలలో బస
– ఉప ఎన్నిక నేపథ్యంలో నంద్యాలపై ప్రత్యేక దృష్టి
కర్నూలు(అగ్రికల్చర్): రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుధవారం జిల్లాలో పర్యటించనున్నారు. నందికొట్కూరు, పాణ్యం, నంద్యాల నియోజకవర్గాల్లో ఆయన పర్యటించనున్నారు. జిల్లా కలెక్టర్‌గా సత్యనారాయణ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ముఖ్యమంత్రి జిల్లాలో పర్యటించడం ఇదే మొదటి సారి. దీంతో పర్యటనను విజయవంతం చేయడంపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించారు. సీఎం పర్యటనలో నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. త్వరలో నంద్యాల ఉప ఎన్నిక జరుగనున్న నేపథ్యంలో అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు రాత్రి నంద్యాలలోనే బస చేయనుండటం గమనార్హం. అదేవిధంగా ఇఫ్తార్ విందులో పాల్గొనడంతో పాటు ముస్లిం పెద్దలు, మైనార్టీ నేతలతో సమావేశం కానున్నారు.
ఇఫార్ విందును రాష్ట్ర స్థాయి కార్యక్రమంగా నిర్వహిస్తున్నారు. ఉదయం 11.30 గంటలకు జూపాడుబంగ్లా మండలం తంగెడంచలో అడుగుపెట్టనున్న సీఎం గురువారం ఉదయం 9.20 గంటల వరకు జిల్లాలోనే గడపనున్నారు. ఇందుకోసం తంగెడంచ, ఓర్వకల్లు, నంద్యాల ప్రాంతాల్లో హెలిప్యాడ్‌లు ఏర్పాటు చేస్తున్నారు.
– బుధవారం ఉదయం 11.30 నుంచి 1 గంట వరకు జైన్ ఇరిగేషన్ సిస్టమ్ నెలకొల్పే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌కు శంకుస్థాపన చేస్తారు. అక్కడే రైతులతో ముఖాముఖి నిర్వహిస్తారు. ఇందుకోసం వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు 10వేల మంది రైతులను సమీకరించేందుకు చర్యలు తీసుకున్నారు.