ఆర్ కార్డుల జాబితాల్లో తప్పులే ఆయన ఆదాయ వనరులు
తప్పు తీవ్రతను బట్టి వేలు నుంచి లక్షలు డిమాండ్
ఉన్నతాధికారుల ఆదేశాలు సైతం బేఖాతరు
ఇదీ స్టీల్‌ప్లాంట్ సబ్ ఎంప్లాయ్‌మెంట్ అధికారి తీరు
తమ్మినాన రామయ్య స్టీల్‌ప్లాంట్ నిర్వాసితుడు. ఇంటికో ఉద్యోగం హామీలో భాగంగా ప్రభుత్వం అతనికి ఆర్.కార్డు మంజూరు చేసింది. వయసు దాటినా ఉద్యోగం రాలేదు. దాంతో బీటెక్ చేసిన తన కుమారుడు జయప్రకాష్‌కు తన ఆర్.కార్డును బదిలీ చేయించాడు.
కొడుక్కి ప్లాంట్‌లో ఉద్యోగం రావాలంటే ఆర్.కార్డు ఆధారంగా స్టీల్‌ప్లాంట్ సబ్ ఎంప్లాయ్‌మెంట్ కార్యాలయంలో అతని పేరు నమోదు చేయించాలి. దానికి ఎప్పుడో సెప్టెం బర్‌లోనే దరఖాస్తు చేశారు. మహా అయితే.. రెండుమూ డు రోజుల్లో ఆ పని పూర్తి అవ్వాలి. కానీ అలా జరగలేదు..
ఎంప్లాయ్‌మెంట్ అధికారి సైంధవుడిగా అడ్డుపడ్డారు.. రకరకాల సాకులు చెబుతూ ఎనిమిది నెలలు కాలయాపన చేశా రు. చివరికి అసలు విషయానకొచ్చారు. రూ.8 లక్షలు ఇస్తేనే పని అవుతుందని తేల్చేశారు. అంత ఇచ్చుకోలేనని రామయ్య అనడంతో.. బేరసారాలు మొదలయ్యాయి.. రూ.5 లక్షలు.. రూ. 2 లక్షలు.. ఇలా చివరికి రూ.1.50 లక్షలకు ఒప్పందం కుదిరింది. కథ అక్కడే అడ్డం తిరిగింది.. ఈ బేరసారాలతో విసిగిపోయిన రామయ్య ఏసీబీకి ఉప్పందించారు. ఇంకేముంది.. సొమ్ములందుకుంటూ ఎంప్లాయ్‌మెంట్ అధికారి ఉచ్చులో ఇరుక్కున్నారు.
గాజువాక: లంచాలు డిమాండ్ చేయడం.. ముక్కు పిండి వసూలు చేయడం.. ఈ అధికారికి కొత్త కాదు. అసలాయన స్టయిలే అది. పైసలందనిదే ఫైలు ముట్టరు. ఉన్నతాధికారుల ఉత్తర్వులంటే లెక్కేలేదు. ఎవరెన్ని ఆదేశాలిచ్చినా.. తనకో పద్ధతి ఉందంటారు. గట్టిగా మాట్లాడితే డేటా లేదనో.. ఇంకేదో లేదనో కొర్రీలు వేసి తిప్పించుకోవడం ఆయనకు అలవాటు. ఏసీబీ ట్రాప్‌లో మంగళవారం అడ్డంగా దొరికిపోయిన స్టీల్‌ప్లాంట్ సబ్ ఎంప్లాయిమెంట్ అధికారి పి.ఎం.సతీష్‌కుమార్ బాధితులు రామయ్యతోపాటు ఇంకెందరో ఉన్నారు. ఆర్ కార్డుల జాబితాల్లో దొర్లిన తప్పులు, పొరపాట్లను ఆయన తన అక్రమ సంపాదనకు మార్గంగా మార్చుకున్నారని నిర్వాసితులు ఎప్పట్నుంచో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్టీల్‌ప్లాంట్ భూసేకరణ విభాగం అధికారులు నిర్వాసితుల ఆర్ కార్డులను వారి వారసులకు బదిలీ చేసినా.. వాటిని ఇక్కడి ఎంప్లాయ్‌మెంట్ కార్యాలయంలో నమోదు చేయడానికి ఇక్కడి అధికారి వేలు.. లక్షలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు కొత్త కాదు. ఏసీబీ డీఎస్పీ రామకృష్ణ ప్రసాద్ సైతం ఈ విషయాన్ని నిర్థారించారు. గత మూడేళ్ల కాలంలో ఈ అధికారి తీరుతో నిర్వాసితులు తీవ్ర ఆర్థిక భారం మోయాల్సి వచ్చిందని మంగళవారంనాటి సంఘటనతో స్పష్టమవుతోంది. స్టీల్‌ప్లాంట్ ఎంప్లాయ్‌మెంట్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌కు డబ్బులు ఇచ్చుకోలేని అనేకమంది నిర్వాసితులు నెలల తరబడి తిరిగి చివరకు గత్యంతరం లేని పరిస్థితుల్లో తమ ఆస్తులను తనఖా పెట్టో, తలకు మించిన వడ్డీలకు అప్పులు తెచ్చో ముడుపులు చెల్లిస్తున్నారు.
లంచాలు ఇవ్వని 40 రిజిస్ట్రేషన్లు పెండింగ్: ఎంప్లాయ్‌మెంట్ అధికారి డిమాండ్ చేసినంత సొమ్ము ఇచ్చుకోలేక రిజిస్ట్రేషన్‌కు దరఖాస్తు చేసుకున్న వారిలో 40 మందికి పైగానే ఇంకా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. 35 ఏళ్ల క్రితం ఉక్కు భూసేకరణ అధికారులు జారీ చేసిన ఆర్ కార్డుల రికార్డులు ప్రస్తుతం అస్తవ్యస్తంగా ఉన్నాయి. భూసేకరణ కార్యాలయంలో డేటా కనిపించకపోవడం, డౌట్‌ఫుల్ జాబితాల్లో ఉండటం, కార్డుదారుల పేర్లలో రకరకాల తప్పులు చోటు చేసుకోవడంవంటి సమస్యలు తెలిసిందే. ఆ జాబితాను భూసేకరణ అధికారులు జిల్లా జాయింట్ కలెక్టర్‌కు, ఇక్కడి సబ్ ఎంప్లాయ్‌మెంట్ కార్యాలయానికి కూడా పంపించారు. ఈ జాబితానే సతీష్‌కుమార్ తనకు వరంగా మలచుకున్నారు. భూసేకరణ విభాగం అధికారులు కోరిన సమాచారాన్ని అందజేసి తప్పులను సరిచేసుకొని ఆర్ కార్డులను మార్చుకొని ఇక్కడికి వచ్చినా.. డబ్బులు ఇవ్వకుండా పని చేయించుకొనే పరిస్థితి లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేసిన సంఘటనలున్నాయి. తనకు జిల్లా జాయింట్ కలెక్టర్ నుంచి వచ్చిన జాబితాలో సంబంధిత ఆర్ కార్డు డేటా సరిగ్గా లేదని, అందువల్ల దాన్ని నమోదు చేయలేమంటూ తొలుత తిప్పి పంపడం, ఆ తరువాత డ బ్బులు తీసుకొని పని పూర్తి చేయడం ఈ అధికారికి పరిపాటిగా మారిందన్న ఆరోపణలు తీవ్రంగానే ఉన్నా యి. కార్డులో దొర్లిన తప్పు తీవ్రతనుబట్టి రూ.15 వేల నుంచి లక్షల రూపాయలు వసూలు చేసినట్టు ఆరోపణలున్నాయి. ఎట్టకేలకు పాపం పండింది. ఆ అధికారి ఏసీబీకి దొరికిపోయారని నిర్వాసితులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇల్లు తనఖాపెట్టి నగదు ఇచ్చా: తనకు అంత పెద్ద మొత్తంలో లంచం ఇవ్వగలిగే స్తోమత లేకపోయినా తన కుమారుడి భవిష్యత్తు కోసం ఉన్న ఒక్క ఇంటిని తనఖా పెట్టి డబ్బులు అప్పు తెచ్చానని బాధితుడు టి.రామయ్య పేర్కొన్నాడు. స్టీల్‌ప్లాంట్ కోసం సర్వం కోల్పోయిన తమను అధికారులు ఇలా ఇబ్బంది పెడుతుంటే తట్టుకోలేక ఏసీబీ అధికారులను ఆశ్రయించానని చెప్పారు.
పైసలందనిదే ఫైలు ముట్టరు!
Published Wed, Mar 16 2016 12:04 AM | Last Updated on Sun, Sep 3 2017 7:49 PM
Advertisement
Advertisement