మిడ్‌క్యాప్‌లో మెరుగైన అవకాశాలు | Better Prospects in Midcap | Sakshi
Sakshi News home page

మిడ్‌క్యాప్‌లో మెరుగైన అవకాశాలు

Published Mon, Sep 2 2024 7:08 AM | Last Updated on Mon, Sep 2 2024 9:03 AM

Better Prospects in Midcap

మోతీలాల్‌ ఓస్వాల్‌ నిఫ్టీ మిడ్‌క్యాప్‌ 150 ఇండెక్స్‌ ఫండ్‌

దీర్ఘకాల లక్ష్యాలకు ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ మెరుగైన ఆప్షన్‌ అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరీ ముఖ్యంగా దీర్ఘకాలంలో మెరుగైన సంపద సృష్టించాలని కోరుకునే వారు నిఫ్టీ మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ ఫండ్స్‌ను పరిశీలించొచ్చు. ఈ విభాగంలో పెట్టుబడికి తక్కువ పథకాలే అందుబాటులో ఉన్నాయి. అందులో మోతీలాల్‌ ఓస్వాల్‌ నిఫ్టీ మిడ్‌క్యాప్‌ 150 ఇండెక్స్‌ ఫండ్‌ ఒకటి. ఇన్వెస్టర్లు తమ వెసులుబాటుకు అనుగుణంగా సిస్టమ్యాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిప్‌) లేదా లంప్‌సమ్‌ రూపంలోనూ ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు.

రాబడులు 
మోతీలాల్‌ ఓస్వాల్‌ నిఫ్టీ మిడ్‌క్యాప్‌ 150 ఇండెక్స్‌ ఫండ్‌ 2019 సెప్టెంబర్‌లో మొదలైంది. గడిచిన ఏడాది కాలంలో అసాధారణ స్థాయిలో 50 శాతం రాబడినిచ్చింది. మరీ ముఖ్యంగా మిడ్‌క్యాప్‌ షేర్ల ర్యాలీ ఈ పథకం లాభాల్లో ప్రతిఫలిస్తోంది. మూడేళ్లలో ఏటా 27.55 శాతం చొప్పున పెట్టుబడులపై ప్రతిఫలాన్ని అందించింది. ఆరంభం నుంచి చూసుకుంటే వార్షిక రాబడి రేటు 32 శాతంగా ఉంది. నిఫ్టీ 100తో పోల్చి చూస్తే నిఫ్టీ మిడ్‌క్యాప్‌ 150 ఇండెక్స్‌ పరిమిత రిస్క్‌తోనే రోలింగ్‌ రాబడులు అధికంగా ఇస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు. యాక్టివ్‌ ఫండ్స్‌తో పోలిస్తే ఇండెక్స్‌ ఫండ్స్‌ దీర్ఘకాలంలో మెరుగైన ఆప్షన్‌ అవుతుంది. వీటిల్లో ఫండ్స్‌ సంస్థలు వసూలు చేసే చార్జీలు తక్కువగా ఉంటాయి. దీంతో ఇన్వెస్టర్లకు రాబడులు మెరుగవుతాయి.

దీర్ఘకాలంలో నిఫ్టీ మిడ్‌క్యాప్‌ 150 ఇండెక్స్‌ ఫండ్స్‌ మంచి రాబడులను ఇస్తాయి. కానీ, అదే సమయంలో అధిక రిస్క్‌ కూడా ఉంటుంది. కరెక్షన్లలో ఎక్కువ విలువను కోల్పోవడం ఈ విభాగంలో గమనించొచ్చు. అందుకని రిస్క్‌ భరించే సామర్థ్యంతో ఉన్న వారు, కనీసం 7–10 ఏళ్ల కాలానికి ఈ విభాగాన్ని పరిశీలించొచ్చు. అయితే, ఈ పథకం కేవలం మిడ్‌క్యాప్‌ ఒక్కటే కాకుండా, లార్జ్‌క్యాప్‌కూ ప్రాధాన్యం ఇవ్వడం వల్ల రిస్క్‌ తక్కువగా ఉంటుందని గమనించొచ్చు.

పెట్టుబడులకు విధానం
ప్రతీ ఇన్వెస్టర్‌ ఈక్విటీ పెట్టుబడుల్లో లార్జ్‌క్యాప్‌తోపాటు మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్‌ కంపెనీలకూ చోటు కల్పించుకోవాలి. తద్వారా రిస్క్‌ సర్దుబాటుతో అధిక రాబడులు సమకూర్చుకోవడం సాధ్యపడుతుంది. టాప్‌–100 కంపెనీల తదుపరి 150 కంపెనీల్లో ఈ పథకం ప్రధానంగా ఇన్వెస్ట్‌ చేస్తుంది. తమ పనితీరుతో చిన్న కంపెనీల నుంచి మధ్యస్థ స్థాయికి ఎదిగిన ఇవి.. దీర్ఘకాలంలో లార్జ్‌క్యాప్‌ కంపెనీలుగానూ అవతరించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది ఇన్వెస్టర్ల రాబడులను ఇతోధికం చేస్తుంది.

మార్కెట్‌ విలువ పరంగా 101 నుంచి 250 వరకు వరుసలో ఉన్న కంపెనీలు మిడ్‌క్యాప్‌ విభాగం కిందకు వస్తాయి. మిడ్‌క్యాప్‌ ఫండ్స్‌కు.. నిఫ్టీ 150 మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ ఫండ్స్‌కు మధ్య వ్యత్యాసాన్ని గమనించినట్టయితే.. నిఫ్టీ 150 మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ ఫండ్స్‌ ఒకే రంగానికి, ఒకే స్టాక్‌కు ఎక్కువ కేటాయింపులు చేయవు. దీంతో రిస్క్‌ను వైవిధ్యం చేసుకున్నట్టు అవుతుంది.

పోర్ట్‌ఫోలియో 
ఈ పథకం నిర్వహణలో ప్రస్తుతం రూ.1878 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇందులో 99.86 శాతం మేర ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేసి ఉంది. ఇందులో 41 శాతం పెట్టుబడులు లార్జ్‌క్యాప్‌ కంపెనీల్లోనే ఉన్నాయి. మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ ఫండ్‌ అయినప్పటికీ లార్జ్‌క్యాప్‌కు ఈ స్థాయి కేటాయింపులతో రిస్క్‌ను తగ్గించే విధానాన్ని అనుసరిస్తున్నట్టు తెలుస్తోంది.

మిడ్‌ క్యాప్‌ కంపెనీలకు 59 శాతం కేటాయింపులు చేసింది. రిస్క్‌ దృష్ట్యా స్మాల్‌క్యాప్‌లో ఇన్వెస్ట్‌ చేయలేదు. పోర్ట్‌ఫోలియోలో 150 స్టాక్స్‌ ఉన్నాయి. అత్యధికంగా 21 శాతం పెట్టుబడులను ఇండస్ట్రియల్స్‌ కంపెనీలకు కేటాయించింది. ఆ తర్వాత 17 శాతం మేర ఫైనాన్షియల్‌ రంగ కంపెనీల్లో, కన్జ్యూమర్‌ డిస్క్రీషినరీలో 14.39 శాతం, మెటీరియల్స్‌లో 13 శాతం, హెల్త్‌కేర్‌లో 10.52 శాతం చొప్పున ఇన్వెస్ట్‌ చేసింది.     – సాక్షి, బిజినెస్‌ డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement