ఆదాయానికి మించిన ఖర్చులా?.. అయితే ఈ జాగ్రత్తలు మీ కోసమే! | These Are Playing Key Role While Filing Income Tax | Sakshi
Sakshi News home page

ఆదాయానికి మించిన ఖర్చులా?.. అయితే ఈ జాగ్రత్తలు మీ కోసమే!

Published Mon, Aug 2 2021 11:32 AM | Last Updated on Mon, Aug 2 2021 2:15 PM

These Are Playing Key Role While Filing Income Tax - Sakshi

చాలా మంది తమకొచ్చిన ఆదాయాన్ని పూర్తిగా డిక్లేర్‌ చేసి, పన్ను పూర్తిగా చెల్లించి, హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటారు. కొంత మంది ఆదాయం తక్కువగా చూపిస్తుంటారు లేదా అస్సలు చూపకపోనూ వచ్చు. దీనివల్ల రిటర్నుల్లో ఆదాయానికి, వాస్తవ ఆదాయానికి పొంతన ఉండదు. సంబంధం ఉండదు. ఆదాయపన్ను శాఖ అధికారులు వివరాలు అడిగినప్పుడు తడబడతారు.

సమగ్రంగా.. సంతృప్తికరంగా..
మనం రిటర్నులు వేసిన తర్వాత ఇన్‌కంట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులు వాటిని పరిశీలించి అన్ని వివరాలను క్షుణ్నంగా చెక్‌ చేస్తారు. కృత్రిమ మేధస్సు ద్వారా కొన్ని ప్రాతిపదికలను ముందుగానే ప్రోగ్రాం ద్వారా ఫీడ్‌ చేసి.. స్క్రూటినీకి ఎంపిక చేస్తారు. 97 శాతం రిటర్నులను సరళంగానే చెక్‌ చేస్తారని చెప్పవచ్చు. స్టేట్‌మెంట్‌లోని తప్పులు, ఆదాయంలో హెచ్చుతగ్గులు, కూడిక తప్పులు, తీసివేత తప్పులు, చెల్లించిన పన్నులకు సరైన వివరాలు ఇవ్వకపోవడం, వివరాలు సరిపోకపోవడం లాంటివి ఉంటే నోటీసు ద్వారా వివరాలు అడుగుతారు. వివరాలు సరిగ్గా, సమగ్రంగా, సంతృప్తికరంగా ఇస్తే అసెస్‌మెంట్‌ పూర్తయిపోతుంది. 

అంతా ఫేస్‌లెస్‌
అవసరమైనప్పుడు సంబంధిత పత్రాలు/కాగితాలు అడుగుతారు. వ్యాపారం, వృత్తికి సంబంధించిన సందర్భంలో ఎన్నో వివరాలు అడుగుతారు. అకౌంటు పుస్తకాలు, వోచర్లు, క్రయవిక్రయాలకు సంబంధించిన బిల్లులు, బ్యాంకు అకౌంటు కాపీలు.. ఇవన్నీ ఇప్పుడు అంతా ఆన్‌లైనే. అధికారులు నోటి మాట వినడం, అలా చెప్పడం ద్వారా మీరు వారిని ఒప్పించడం .. నచ్చజెప్పడం వంటివి ఇప్పుడు లేవు. ఏదైనా సరే, రాసి ఇవ్వడమే. అంటే అంతా ఫేస్‌లెస్‌.

సోర్స్‌ ఉండాలి
ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. ఒక ఉద్యోగి (50 ఏళ్లు), స్థూల జీతం సంవత్సరానికి రూ. 8,00,000 కాగా ఇంటద్దె రూ. 1,20,000, పొదుపు రూ. 1,50,000 అనుకుందాం. స్థూల ఆదాయం రూ. 8,00,000లో ఈ రెండూ పోగా నికర ఆదాయం రూ. 5,30,000గాను, పన్ను భారాన్ని రూ. 19,240గాను డిక్లేర్‌ చేశారనుకోండి.. ఇందులో ఏ తప్పూ లేదు. ఒకవేళ స్క్రూటినీకి వచ్చిందనుకోండి. అన్ని వివరాలు అడుగుతారు. ఖర్చుల వివరాలు అడుగుతారు. రిటర్న్‌ ప్రకారం ఆ వ్యక్తి స్థూల ఆదాయం రూ. 8,00,000 నుంచి సేవింగ్స్, ఇంటద్దె, ట్యాక్స్‌ తీసివేయగా రూ. 5,10,760.. (సుమారుగా రూ, 5,11,000 ... అంటే నెలకు రూ. 42,500) మిగిలి ఉంటుంది. ఖర్చు వివరాలు అడిగినప్పుడూ అన్నీ టకాటకా చెప్తాం. కరెంటు బిల్లు, నెలసరి వెచ్చాలు, సెల్‌ ఫోన్లు, స్కూల్‌ ఫీజులు, ట్యూషన్‌ ఫీజులు, సినిమాలు, హాస్పిటల్‌ ఖర్చులు, పాలు, నీరు, మెడిసిన్స్, ఇంట్లో షుగర్‌ పేషంట్ల చికిత్స వ్యయాలు, ఆపరేషన్, తిరుపతి యాత్రలు ఇలా ఎన్నో ఖర్చులు ఉంటాయి. ఇవి కాకుండా ఉండే రికరింగ్‌ డిపాజిట్లు, ఫిక్సిడ్‌ డిపాజిట్లు, చిట్‌ఫండ్‌ల వాయిదాలు.. ఇవన్నీ మీ దగ్గర మిగిలే మొత్తానికి లోబడి ఉంటే ఫర్వాలేదు. కానీ, దాటిందే అనుకోండి. కాస్త ఇబ్బంది. కాబట్టి, ఇలాంటి వాటి అసెస్‌మెంట్‌ సందర్భాలలో వివరాలు ఇచ్చేటప్పుడు ఆలోచించి ఇవ్వాలి. అంతే కాకుండా డిపార్ట్‌మెంట్‌ దగ్గర మీకు సంబంధించిన సమాచారం ఉంటుంది. మీ ఖర్చులు, ఇన్వెస్ట్‌మెంట్‌లు, చీటీలు, పిల్లల చదువుల ఖర్చులు మొదలైన వివరాలన్నీ ఉంటాయి. ఆదాయానికి మించి ఎలా ఖర్చు పెడతారు.. ఒకవేళ ఖర్చు నిజమైనదే అయితే.. ఆదాయం ఉందన్న మాట. వివరణ ఇవ్వలేకపోతే ఈ వ్యత్యాసాన్ని ఆదాయంగా భావిస్తారు. కనుక ఎప్పుడైనా సరే ఆదాయంతో పాటు మిగతా వాటన్నింటికి సంబంధించి వాటికి ‘సోర్స్‌‘ ఉండాలి. అప్పు చేశామంటే వివరణ ఇవ్వాలి. వివరణ అంటే నోటి మాటలు కాదు. రాతపూర్వకంగా ఉండాలి. సాధారణంగా, మన ఖర్చులు/ఇన్వెస్ట్‌మెంట్లను పరిగణనలోకి తీసుకోకపోవడం వల్లే ఈ తేడాలు వస్తాయి. కాబట్టి ఇటువంటి విషయాల్లో అత్యంత జాగ్రత్త వహించాలి.

ట్యాక్సేషన్‌ నిపుణులు 
కె.సీహెచ్‌. ఎ.వి.ఎస్‌.ఎన్‌ మూర్తి ,


ట్యాక్సేషన్‌ నిపుణులు 
కె.వి.ఎన్‌ లావణ్య 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement