పన్ను ఆదా కోసం సెక్షన్ 80సీ కింద ఇప్పటికే రూ.1.50 లక్షలు ఇన్వెస్ట్ చేశాను. దీనికి అదనంగా పన్ను ఆదా కోసం ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి?
– రాకేశ్ వర్మ
ఐటీ చట్టం సెక్షన్ 80సీ కింద గరిష్ట పరిమితి రూ.1.5 లక్షల మేరకు ఇప్పటికే మీరు ఇన్వెస్ట్ చేసి ఉంటే.. అప్పుడు అదనపు పన్ను ఆదా కోసం మీ ముందున్న మార్గం నేషనల్ పెన్షన్ సిస్టమ్ టైర్–1. రిటైర్మెంట్ పథకమైన ఎన్‌పీఎస్‌లో గరిష్టంగా రూ.50,000 పెట్టుబడిపై పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని పొందొచ్చు. సెక్షన్ 80సీకి అదనంగా కల్పించిన ప్రయోజనం ఇది.
విశ్రాంత జీవనం కోసం నిధి ఏర్పాటు చేసుకోవాలనే లక్ష్యాన్ని సాకారం చేసేందుకు వీలుగా 2004లో కేంద్ర సర్కారు ఎన్‌పీఎస్ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. 18–70 ఏళ్ల వయసు పరిధిలోని ఎవరైనా ఇందులో చేరేందుకు అర్హులే. ఒక ఏడాదిలో ఇందులో కనీసం రూ.500 ఇన్వెస్ట్ చేసినా సరిపోతుంది. ఇందులో చేసిన పెట్టుబడి ఏదైనా కానీ 60 ఏళ్ల వరకు వెనక్కి తీసుకోవడానికి ఉండదు. అంటే అప్పటి వరకు లాకిన్ అయి ఉంటుంది. కొన్ని అసాధారణ పరిస్థితులు ఎదురైన సందర్భాల్లోనే దీన్నుంచి ఉపసంహరణలకు అనుమతి ఉంటుంది. 60 ఏళ్లు నిండిన తర్వాత అప్పటి వరకు సమకూరిన నిధి నుంచి 60 శాతాన్ని ఉపసంహరించుకోవడానికి అనుమతిస్తారు. మిగిలిన 40 శాతంతో యాన్యుటీ ప్లాన్ తీసుకోవాలి.
ఇటీవలి తీసుకొచ్చిన సవరణ నేపథ్యంలో 60 ఏళ్లు నిండిన తర్వాత.. నెల లేదా త్రైమాసికం లేదా ఏడాదికోసారి క్రమంగా కావాల్సినంత ఉపసంహరించుకోవడానికి వీలు ఏర్పడింది. ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్ చేసే వారు 2 రకాల ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్లలో ఒకటి ఎంపిక చేసుకోవచ్చు. ఆటో లేదా యాక్టివ్. ఆటో ఆప్షన్ ఎంపిక చేసుకోవడం కొంత బెటర్. ఈ ఆప్షన్‌లో ఈక్విటీలకు కేటాయింపులు ఇన్వెస్టర్ వయసు ఆధారంగా మారుతుంటాయి.
ఉదాహరణకు ఇన్వెస్టర్ వయసు 35 ఏళ్లు అనుకుందాం. 100 నుంచి 35 ఏళ్లు తీసివేయగా, మిగిలిన మేర (65%) ఈక్విటీలకు కేటాయింపులు వెళతాయి. ఇన్వెస్టర్ వయసు పెరుగుతున్న కొద్దీ ఈక్విటీలకు కేటాయింపులు తగ్గుతూ వెళతాయి. యాక్టివ్ ఆప్షన్‌లో ఈక్విటీలకు గరిష్టంగా 75% వరకు పెట్టుబడులు కేటాయించుకోవచ్చు. ఈక్విటీ కేటాయింపులు పోను, మిగిలినదాన్ని డెట్, ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్‌మెంట్ సాధనాలకు కేటాయించొచ్చు.
- సమాధానం: ధీరేంద్ర కుమార్, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్
Comments
Please login to add a commentAdd a comment