మరో 30 రోజుల్లో 2020–21 ఆర్థిక సంవత్సరం ముగిసిపోనుంది. పన్ను ఆదా కోసం ఇప్పటి వరకు ఏమీ చేయకపోతే.. ఇప్పటికి అయినా మించిపోయింది ఏమీ లేదు. సాధారణంగా సెక్షన్ 80సీ కింద పన్ను రాయితీల గురించి ఎక్కువ మందికి అవగాహన ఉంది. కానీ, పన్నును ఆదా చేసే మరెన్నో సెక్షన్లు కూడా ఐటీ చట్టంలో ఉన్నాయి. వీటి కింద మరింత మొత్తాన్ని పన్ను లేకుండా ఆదా చేసుకునే మార్గాలున్నాయి. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షలను గరిష్టంగా సెక్షన్ 80సీ కింద చూపించుకుని ఆ మొత్తంపై పన్ను ఆదా చేసుకోవచ్చు. పన్ను వర్తించే ఆదాయం రూ.5లక్షల వరకు ఉన్నా.. పన్ను రాయితీకి కేంద్రం అవకాశం కల్పిస్తోంది. దీనికి అదనంగా రూ.1.5 లక్షలు సెక్షన్ 80సీ రాయితీలను పూర్తిగా వినియోగించుకున్నట్టయితే రూ.6.5లక్షల ఆదాయంపై ఒక ఆర్థిక సంవత్సరంలో పన్ను బాధ్యత లేకుండా చూసుకోవచ్చు. వాటి గురించి తెలుసుకునే ప్రయత్నమే నేటి ప్రాఫిట్ ప్లస్ కథనం.
హెల్త్ కవరేజీ (సెక్షన్ 80డీ)
ఆరోగ్య రక్షణ అవసరాన్ని గతంతో పోలిస్తే కరోనా ఆగమనం తర్వాత చాలా మంది తెలుసుకున్నారు. కనుక హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవడం ఆరోగ్యానికే కాదు, ఆర్థికంగానూ కలిసొస్తుంది. ఏటేటా వైద్య చికిత్సల ఖర్చులు అనూహ్యంగా పెరిగిపోతున్న తరుణంలో.. ఆస్పత్రి పాలైతే ఊహించని ఆర్థిక భారం పడకుండా చూసుకోవడంతోపాటు.. ఏటా హెల్త్‌ప్లాన్‌కు చెల్లించే ప్రీమియంపై పన్ను లేకుండా చేసుకోవచ్చు. సెక్షన్ 80డీ కింద ఒక ఆర్థిక సంవత్సరంలో హెల్త్‌ప్లాన్‌కు చెల్లించే ప్రీమియం రూ.25,000 వరకు పన్ను లేదు. దీన్ని మరింత వివరంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ సెక్షన్ కింద రూ.25,000 నుంచి రూ.లక్ష వరకు పన్ను ఆదాకు అవకాశం ఉంటుంది.
► కరుణాకర్ (60 ఏళ్లలోపు), తన జీవిత భాగస్వామి, తన పిల్లల కోసం హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం రూపేణా చెల్లించే ప్రీమియం గరిష్టంగా రూ.25వేల మొత్తంపై పన్ను మినహాయింపు కోరొచ్చు. ఒకవేళ ఇదే వ్యక్తి వయసు 60 ఏళ్లు దాటి ఉంటే, తనకు తన కుటుం బం కోసం చెల్లించే ప్రీమియం గరిష్టంగా రూ.50,000 మొత్తంపైనా పన్ను మిన హాయింపునకు చట్టం అవకాశం కల్పిస్తోంది.
► ఒకవేళ కరుణాకర్ వయసు 60 ఏళ్లలోపు అయి ఉండి తన కుటుంబానికి, అలాగే, తన తల్లిదండ్రుల కోసం (60 ఏళ్లలోపు వయసు) మరో హెల్త్ ప్లాన్‌కు ప్రీమియం చెల్లిస్తున్నాడని అనుకుంటే.. అప్పుడు కరుణాకర్ రూ.25,000, ఆయన తల్లిదండ్రుల పేరిట మరో రూ.25,000 కలిపి మొత్తం రూ.50,000 వరకు ఒక ఆర్థిక సంవత్సరంలో పన్ను మినహాయింపు పొందడానికి అర్హులు.
► మరో కేసులో కరుణాకర్ 60 ఏళ్లు దాటి ఉంటే, సహజంగానే ఆయన తల్లిదండ్రులు కూడా సీనియర్ సిటిజన్లు అయి ఉంటారు కనుక ఇద్దరికీ రూ.50,000 చొప్పున గరిష్టంగా రూ.లక్ష వరకు పన్ను ఆదా చేసుకోవచ్చు.
► నగదు కాకుండా డిజిటల్ రూపేణా చెల్లింపులపైనే పన్ను మినహాయింపు పొందగలరు. ప్రీమియం నుంచి జీఎస్‌టీ, ఇతర సెస్సులను మినహాయించిన తర్వాత మిగిలిన మొత్తానికే పన్ను ఆదా పొందాల్సి ఉంటుంది.
► ఒక వ్యక్తి తన కుటుంబానికి, తన తల్లిదండ్రుల హెల్త్ కవరేజీ మినహా మరే ఇతర బంధుత్వాలకు సంబంధించి పన్ను మినహాయింపు కోరడానికి లేదు.
► తల్లిదండ్రుల కవరేజీకి ప్రీమియంను తల్లిదండ్రులు కొంత.. వారి కుమారుడు లేదా కుమార్తె కొంత చెల్లించినట్టయితే అప్పుడు ఇరువురూ చెల్లించిన మేరకు నిబంధనలకులోబడి పన్ను ప్రయోజనానికి అర్హులు.
► హిందూ అవిభాజ్య కుటుంబానికి, ఎన్‌ఆర్‌ఐలకు సంబంధించి సెక్షన్ 80డీ కింద గరిష్ట పరిమితి రూ.25వేలు అని గుర్తుంచుకోవాలి.
హెల్త్ చెకప్
ఒకవేళ హెల్త్ పాలసీ ప్రీమియం గరిష్ట పరిమితి కంటే తక్కువే ఉందనుకుంటే.. ఉదాహరణకు కరుణాకర్ ఏటా ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీకి రూ.20,000 ప్రీమియంగా చెల్లిస్తున్నాడనుకుంటే.. మరో రూ.5 వేలకు హెల్త్ చెకప్‌లకు చేసే ఖర్చును చూపించుకోవచ్చు. ముందస్తు వ్యాధి నిర్ధారణ పరీక్షలకు ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ.5వేల మొత్తానికి సెక్షన్ 80డీ కింద పన్ను మినహాయింపు ఉంది.
► సెక్షన్ 80డీడీబీ కింద కేన్సర్, న్యూరో సంబంధిత డిమెన్షియా, మోటార్ న్యూరాన్ డిసీజ్, పార్కిన్‌సన్స్ వ్యాధులకు, ఎయిడ్స్ తదితర తీవ్ర వ్యాధుల చికిత్స కోసం చేసే ఖర్చుపై అదనంగా పన్ను రాయితీని క్లెయిమ్ చేసుకోవచ్చు. రూ.40,000 లేదా వాస్తవంగా అయిన ఖర్చు ఏది తక్కువ అయితే ఆ మొత్తంపై దీన్ని పొం దొచ్చు. ఒకవేళ పన్ను చెల్లింపుదారులు సీనియర్ సిటిజన్లు అయినా లేదా పన్ను చెల్లింపుదారుపై ఆధారపడిన వ్యక్తి సీనియర్ సిటిజన్ అయినా వారికి సంబంధించి ఈ వ్యాధుల కోసం చేసే ఖర్చు రూ.1,00,000 వరకు ప్రయోజనాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు.
సొంతిల్లు.. (24బీ/80ఈఈ/80ఈఈఏ)
సెక్షన్ 80సీ: ఇంటి రుణంలో అసలుకు (ప్రిన్సిపల్) చేసే చెల్లింపులు రూ.1.5 లక్షల మొత్తాన్ని సెక్షన్ 80సీ కింద చూపించుకుని పన్ను మినహాయింపు పొందొచ్చు. కాకపోతే ఇంటిని స్వాధీనం చేసుకున్న నాటి నుంచి ఐదేళ్లలోపు విక్రయించకుండా ఉంటేనే ఈ మినహాయింపులకు అర్హులు. ఒకవేళ విక్రయిస్తే తిరిగి పన్ను చెల్లించాల్సి వస్తుంది.
సెక్షన్ 24బీ: ఇంటి రుణంపై వడ్డీ చెల్లింపులు రూ.2 లక్షల మొత్తంపై ఒక ఆర్థిక సంవత్సరంలో పన్ను మినహాయింపును కోరొచ్చు. కాకపోతే నూతన ఇల్లు కొనుగోలు/నిర్మాణం అన్నది రుణం తీసుకున్న ఆర్థిక సంవత్సరం నుంచి ఐదేళ్లలోపు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇంటి కొనుగోలు, నిర్మాణం లేదా ఇంటి నవీకరణ కోసం తీసుకున్న రుణాలకు ఈ ప్రయోజనం వర్తిస్తుంది. రుణంతో సమకూర్చుకున్న ఇంటిని అద్దెకు ఇచ్చేసి, ఉద్యోగం లేదా వ్యాపారం, వృత్థి కారణాల రీత్యా మరో చోట నివాసం ఉంటున్నట్టు అయితే అప్పుడు కూడా ఇదే పరిమితి అమలవుతుంది. ఒకవేళ సొంతానికి కాకుండా.. అద్దెకు ఇచ్చేందుకు రుణం తీసుకుని సమకూర్చుకున్న ఇంటికి.. వడ్డీ చెల్లింపులు ఒక ఆర్థిక సంవత్సరంలో వాస్తవంగా ఎంత ఉంటే ఆ మొత్తంపై పన్ను మినహాయింపు లభిస్తుంది. అంటే ఈ ఉదాహరణలో రూ.2లక్షల పరిమితి ఉండదు. రుణం తీసుకుని ఇల్లు నిర్మించుకునే కాలంలోనూ చేసిన వడ్డీ చెల్లింపులపైనా పన్ను మినహాయింపు పొందొచ్చు. కొనుగోలు లేదా నిర్మాణం పూర్తయిన తర్వాత నుంచి ఐదు సమాన వాయిదాల్లో దీన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. ఒకవేళ నవీకరణ లేదా పునర్‌నిర్మాణం కోసం రుణం తీసుకుంటే మాత్రం.. అది పూర్తయ్యే వరకు పన్ను మినహాయింపులు లభించవు. గరిష్ట పరిమితి మేరకు మినహాయింపు పొందాలంటే.. తీసుకున్న రుణంతో మూడేళ్లలోపు ఇంటిని పూర్తి చేసుకోవాల్సి/ కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే అప్పుడు వడ్డీ చెల్లింపులపై గరిష్ట మినహాయింపు రూ.30,000కు తగ్గిపోతుంది. అద్దెకు ఇచ్చిన ఇంటి కోసం తీసుకున్న రుణంపై పన్ను మినహాయింపులు నూతన పన్ను విధానంలోనూ ఉన్నాయి. కాకపోతే కొన్ని పరిమితులను విధించారు.
సెక్షన్ 80ఈఈ: ఈ సెక్షన్ కింద రూ.50,000 వడ్డీ చెల్లింపులపై అదనపు పన్ను మినహాయింపునకు అవకాశం ఉంది. కాకపోతే రుణం రూ.35 లక్షలకు మించకూడదు. ప్రాపర్టీ విలువ రూ.50 లక్షలు మించకూడదు.
సెక్షన్ 80ఈఈఏ: రూ.45 లక్షలకు మించని, మొదటిసారి ఇల్లు కొనుగోలుపై సెక్షన్ 80ఈఈఏ కింద అదనంగా (24బీకి అదనంగా) మరో రూ.1.5 లక్షల వడ్డీ చెల్లింపులపైనా పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ సెక్షన్ కింద క్లెయిమ్ చేసుకునే వారు సెక్షన్ 80ఈఈ కింద రూ.50,000ను క్లెయిమ్ చేసుకునేందుకు అవకాశం ఉండదు.
80జీజీ: అసంఘటిత రంగంలో ఉద్యోగం చేస్తూ హెచ్‌ఆర్‌ఏ సదుపాయం లేని వారు లేదా స్వయం ఉపాధిలోని వారు ఇంటి అద్దె కోసం చేసే చెల్లింపులపై సెక్షన్ 80జీజీ కింద ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ.60,000 మేరకు పన్ను మినహాయింపు పొందడానికి అర్హులు. సొంతిల్లు ఉండి కూడా అదే ప్రాంతంలో అద్దె ఇంట్లో ఉంటున్నట్టయితే ఈ ప్రయోజనానికి అనర్హులు. అదే విధంగా మరో ప్రాంతంలో ఇంటి కొనుగోలుకు తీసుకున్న రుణంపై సెక్షన్ 24 కింద పన్ను ప్రయోజనాన్ని క్లెయిమ్ చేసుకుంటున్న వారికీ 80జీజీ కింద ప్రయోజనానికి అర్హత ఉండదు. వార్షిక వేతనంలో 25 శాతం.. లేదా వాస్తవంగా చెల్లించే వార్షిక అద్దె నుంచి 10 శాతం వార్షిక వేతనాన్ని తీసివేయగా మిగిలిన మొత్తం.. లేదా రూ.60,000.. ఈ మూడింటిలో ఏది తక్కువ అయితే ఆ మొత్తానికే మినహాయింపు పొందగలరు.
ఎన్‌పీఎస్ (సెక్షన్ 80సీసీడీ)
నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పీఎస్) అన్నది పింఛను స్కీమ్. రిటైర్మెంట్ కోసం నిధిని సమకూర్చుకోవాలని భావించే వారికి అందుబాటులో ఉన్న ఎన్నో సాధనాల్లో ఇదీ ఒకటి. కానీ, దీనికి పన్ను ప్రయోజనాలు అదనం. పైగా ఫండ్ నిర్వహణ చార్జీలు కూడా ఇతర పథకాలతో పోలిస్తే చాలా తక్కువగా ఉన్నాయి. ఎన్‌పీఎస్‌లో రూ.2లక్షల వరకు పెట్టుబడులపై పన్ను ప్రయోజనాలను అందుకోవచ్చు. రూ.1.5 లక్షలను సెక్షన్ 80సీ కింద.. మరో రూ.50వేలను సెక్షన్ 80సీసీడీ కింద చూపించుకునేందుకు అవకాశం ఉంది. 5 శాతం పన్ను పరిధిలోని వారికి రూ.50వేలపై రూ.2,600 వరకు పన్ను ఆదా అవుతుంది. అదే 30 శాతం పన్ను పరిధిలోని వారు రూ.15,600 ఆదా చేసుకోవచ్చు. ఏటా ఈ స్థాయి పన్ను ఆదాకు అదనంగా, పథకం నిర్వహణ చార్జీలు తక్కువగా ఉండడం ఆకర్షణీయతలు.
విద్యా రుణాలు (80ఈ)
విద్యారుణాల చెల్లింపులపైనా సెక్షన్ 80ఈ కింద పన్ను మినహాయింపులకు అవకాశం ఉంది. ఒక వ్యక్తి తన చదువుకు లేదా తన జీవిత భాగస్వామి, పిల్లలు, చట్టపరంగా ఎవరికైనా సంరక్షకుడిగా ఉంటూ తీసుకునే విద్యా రుణాలపై ఈ ప్రయోజనాన్ని పొందొచ్చు. కాకపోతే ప్రభుత్వం గుర్తించిన కోర్సుల కోసం తీసుకుంటేనే ఈ ప్రయోజనానికి అర్హులు. గుర్తింపు పొందిన ఆర్థిక సంస్థ (బ్యాంకు/ఎన్‌బీఎఫ్‌సీ) లేదా చారిటబుల్ ట్రస్ట్ నుంచి రుణాన్ని తీసుకోవాలన్నది నిబంధన. ఇలా విద్యా రుణాలపై వడ్డీ చెల్లింపుల మొత్తానికి పన్ను ప్రయోజనాన్ని ఎనిమిదేళ్లపాటు పొందే అవకాశం ఉంది. విద్యా రుణం ఏ సంవత్సరంలో తీసుకున్నారనే దానితో సంబంధం లేకుండా.. రుణ చెల్లింపులు ప్రారంభించిన ఏడాది నుంచి ఎనిమిదేళ్ల పాటు ఈ మినహాయింపు అమల్లోకి వస్తుంది. ఏ రుణానికి అయినా ఈఎంఐ వాయిదా అసలు, వడ్డీ భాగాలతో ఉంటుంది. వడ్డీ చెల్లింపులను సెక్షన్ 80ఈ కింద చూపించుకోవచ్చు. అలాగే, అసలుకు చేసే చెల్లింపులపై సెక్షన్ 80సీ కింద అనుమతించిన మేరకు గరిష్టంగా పన్ను ప్రయోజనాన్ని పొందొచ్చు.
సేవింగ్స్ వడ్డీ (80టీటీఏ/బీ)
బ్యాంకుల సేవింగ్స్ ఖాతాల్లోని డిపాజిట్లపై వచ్చే వడ్డీ, అదే విధంగా పోస్టాఫీసు లేదా కో–ఆపరేటివ్ సొసైటీల ఖాతాల్లోని డిపాజిట్లపై వచ్చే వడ్డీని కూడా ఆదాయపన్ను వార్షిక రిటర్నుల్లో ఆదాయంగా చూపించాల్సి ఉంటుంది. కాకపోతే ఇలా వచ్చే ఆదాయం ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10,000 మొత్తంపై సెక్షన్ 80టీటీఏ కింద పన్ను మినహాయింపు పొందడానికి వీలుంది. ఫిక్స్‌డ్ డిపాజిట్ ఆదాయానికి ఈ విధమైన మినహాయింపు లేదు. కనుక ఎఫ్‌డీల ఆదాయాన్ని ఇందులో కలపకూడదు. 60 ఏళ్లు నిండిన వారికి ప్రయోజనాలు మరొక రకంగా ఉన్నాయి. వృద్ధులకు సేవింగ్స్ డిపాజిట్లతోపాటు ఫిక్స్‌డ్ డిపాజిట్ల రూపంలోనూ ఆదాయం ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.50,000 మొత్తంపై సెక్షన్ 80టీటీబీ కింద పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసుకునేందుకు చట్టం అనుమతిస్తోంది. 80టీటీబీ కింద క్లెయిమ్ చేసుకున్న వారికి, 80టీటీఏ కింద క్లెయిమ్‌కు అర్హత ఉండదు.
విరాళాలు (80జీ)
సంస్థలకు, ప్రభుత్వం ఆమోదించిన నిధులకు ఇచ్చే విరాళాలపై సెక్షన్ 80జీ కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. నగదు రూపంలో ఇస్తే రూ.2,000కే పరిమితి. ఎక్కువ మొత్తంలో ఇవ్వాలనుకుంటే చెక్కు లేదా ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్ తదితర నగదేతర రూపాల్లో ఇవ్వాలి. ప్రభుత్వ నిర్వహణలోని చాలా సంస్థలకు ఇచ్చే విరాళాలకీ ఈ సెక్షన్ కింద పూర్తి పన్ను మినహాయింపు లభిస్తుంది. నాన్ గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూషన్స్ అయితే ఇచ్చిన విరాళంలో 50 శాతానికే పన్ను మినహాయింపు పొందగలరు.
ఇతర ప్రయోజనాలు..
రాజకీయ పార్టీలకు ఇచ్చే విరాళాలపై సెక్షన్ 80జీజీసీ కింద పన్ను మినహాయింపు ప్రయోజనం అమల్లో ఉంది. సెక్షన్ 80డీడీ లేదా 80యూ కింద పన్ను చెల్లింపుదారు లేదా వారిపై ఆధారపడిన వారు 40 శాతం వైకల్యంతో ఉంటే లేదా ఆటిజమ్, సెరబ్రల్ పాల్సీ తదితర తీవ్ర వైకల్య సమస్యలతో ఉంటే, వాటి కోసం చేసే చికిత్సల వ్యయాన్ని గరిష్టంగా రూ.1.25 లక్షలను స్థూల ఆదాయం నుంచి మినహాయించి చూపించుకోవచ్చు. ఇంకా వార్షిక ఆదాయంలో స్టాండర్డ్ డిడక్షన్ రూ.50,000తోపాటు.. ఎల్‌టీసీ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ (ఉద్యోగానికి వీడ్కోలు పలికే సమయంలో)పైనా పన్ను మినహాయింపులున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment