సాక్షి, హైదరాబాద్: వ్యవసాయశాఖ నిర్లక్ష్యానికి నిలువుటద్దం ఇది. అసలే కరవు.. అంతకుముందే రుణభారం...ఆపై కరెంట్‌కోత.. దీంతో రైతుల ఆత్మహత్యలు కొనసాగుతుంటే, అన్నదాతకు అండగా ఉండాల్సిందిపోయి అధికారులు ఇబ్బందులు సృష్టిస్తున్నారు. వ్యవసాయ పంటలకు బీమా సౌకర్యం ఉంటుంది. అందులో బ్యాంకు రుణాలు తీసుకోని రైతులు, బ్యాంకు రుణాలు పొందే రైతులకు వేర్వేరుగా, వివిధ పద్ధతుల్లో ప్రీమియం చెల్లింపు ఉంటుంది. రుణాలు తీసుకోని రైతులకు ప్రీమియం చెల్లింపు గడువు గత ఆగస్టు నెలాఖరుతో ముగిసింది. పంటలబీమా కోసం రైతుల నుంచి స్థానిక వ్యవసాయాధికారులు దరఖాస్తులు తీసుకున్నారు. వాటితోపాటు ప్రీమియం డీడీలనూ తీసేసుకున్నారు.
అలా రాష్ట్రవ్యాప్తంగా రెండు లక్షల మంది పంటలబీమా కోసం దరఖాస్తు చేసుకున్నారు. వాటిని అధికారులు వ్యవసాయ బీమా కంపెనీకి పంపారు. వాటిలో 1.60 లక్షల దరఖాస్తులు అసంపూర్తిగా ఉన్నాయని బీమా అధికారులు తిరస్కరించారు. కేవలం 40 వేల దరఖాస్తులే నిబంధనల ప్రకారం ఉన్నాయని, వాటికే బీమా వర్తిస్తుందని చెప్పడంతో ఉన్నతాధికారులు నోరెళ్లబెట్టారు. విచిత్రమేంటంటే ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా మెదక్‌తోపాటు, మహబూబ్‌నగర్‌కు చెందిన లక్ష దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. మిగిలిన జిల్లాలకు చెందినవి 60 వేలు తిరస్కరణకు గురయ్యాయి.
పరిశీలించకుండానే పంపేశారు...
బీమా చేసుకునేప్పుడు ఇచ్చేఫారాన్ని సరిగా నింపాలి. బ్యాంక్ అకౌంట్ నంబర్ రాయాలి. ప్రీమియం డీడీని దానికి జత చేయాలి. వ్యవసాయాధికారులు జారీచేసే పంటల సాగు ధ్రువపత్రాన్ని సమర్పించాలి. ఎన్ని ఎకరాల్లో ఏయే పంటలు వేస్తున్నారో స్పష్టంగా రాయాలి. అయితే వీటిని సరిగా నింపకపోవడం వల్లే 1.60 లక్షల దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయని వ్యవసాయాధికారి ఒకరు ‘సాక్షి’కి చెప్పారు. దరఖాస్తులు లేకుండా కేవలం డీడీలు పంపినవారూ ఉన్నారు.
మరి దరఖాస్తులు ఎక్కడ పోయాయో వ్యవసాయాధికారులే చెప్పాలి. దరఖాస్తులు సరిగా ఉన్నట్టు నిర్ధారించుకున్నాకే పంపాలి. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇదంతా జరిగిందని అంటున్నారు. రుణమాఫీ ఆలస్యం కారణంగా బ్యాంకు రుణం పొందిన అనేకమంది రైతులు బీమా సౌకర్యాన్ని కోల్పోయారు. దీనికితోడు రుణం తీసుకోనివారు కూడా అన్యాయానికి గురయ్యారు. బీమా సంస్థలను ఒప్పించి న్యాయం చేయాలని రైతులు వేడుకుంటున్నారు. లేకుంటే పంట నష్టాన్ని ప్రభుత్వమే అందజేయాలని కోరుతున్నారు.
ప్రీమియం చెల్లించినా బీమా సున్నా !
Published Thu, Nov 13 2014 3:20 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM
Advertisement