తిరగరాశారు! | Renewal the process of rescheduling With preserved | Sakshi
Sakshi News home page

తిరగరాశారు!

Published Thu, Feb 19 2015 12:43 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM

తిరగరాశారు! - Sakshi

తిరగరాశారు!

ఈ గణాంకాలు చూస్తుంటే బ్యాంకర్లు రైతుల పాలిట స్పందించిన తీరు అమోఘమనిపిస్తోంది కదూ. కానీ ఇదంతా బ్యాంకర్లు చూపిస్తున్న లెక్కల మాయ. అసలు సంగతి ఏమిటంటే.. రబీ సీజన్‌లో రైతుల చేతికి వచ్చిన రుణం కేవలం రూ.29.01 కోట్లు మాత్రమే. ఈ రుణ మొత్తం అందింది 20,023 మంది రైతులకే. మిగతా రుణాలన్నీ రెన్యూవల్, రీషెడ్యూల్ చేసినవే. బుధవారం లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్(ఎల్‌డీఎం) జిల్లా యంత్రాంగానికి సమర్పించిన నివేదిక ఈ విషయాన్ని బహిర్గతం చేసింది.
 
 
- పంటరుణాల పంపిణీలో బ్యాంకర్ల గిమ్మిక్కులు
- రెన్యూవల్, రీషెడ్యూల్ ప్రక్రియతో సరిపెట్టిన వైనం
- ఎండమావిగా ఆర్థికసాయం

 
రబీ సీజన్‌లో పంటరుణాల లక్ష్యం : రూ.272.44 కోట్లు
ఇప్పటివరకు ఇచ్చిన రుణాలు : రూ.256.42 కోట్లు
లబ్ధిపొందిన రైతులు : 58,362
రబీలో రుణ పంపిణీ సాధన : 94.1శాతం

సాక్షి, రంగారెడ్డి జిల్లా: భారీ స్థాయిలో పంట రుణ ప్రణాళిక రూపొందించడం.. చివరకు కాకి లెక్కలతో పురోగతిని వివరించడం జిల్లా యంత్రాంగానికి పరిపాటిగా మారింది. రైతులకు కోట్ల రూపాయల రుణాలిస్తున్నామంటూ ప్రగల్బాలు పలికే బ్యాంకర్లు.. ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి లెక్కల మాయ చేసి లక్ష్యాల్ని సాధించినట్లు చూపిస్తున్నారు. ఇందులో కొత్తగా రుణాలందించడం అతితక్కువగా ఉండడం, పాత బకాయిలనే రెన్యూవల్ లేదా రీషెడ్యూల్ చేయడం చేస్తున్నారు. ఈ ఏడాది రబీ సీజన్‌లోనూ ఇదే తరహా పరిస్థితి పునరావృతమైంది. రూ. 272.44 కోట్లు ఇస్తామని కార్యచరణ విడుదల చేసిన అధికారులు.. ఇప్పటివరకు రూ.29.01 మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారు. మిగతా రూ.227.41 కోట్లు రీషెడ్యూల్, రెన్యూవల్ చేసి 94.1శాతం లక్ష్యం సాధించినట్లు చెప్పుకోవడం గమనార్హం.
 
రికార్డుల్లోనే అంకెలు..
వరుస నష్టాలతో కుదేలవుతున్న రైతులకు పంటల సాగుకు పెట్టుబడి రూపంలో బ్యాంకులు రుణాలందిస్తాయి. ప్రభుత్వమే ఇందుకు కార్యచరణ రూపొందించి అమలు చేస్తుంది. భూముల పాసు పుస్తకాల్ని తనఖా పెట్టుకుని బ్యాంకులు రుణాలివ్వడం సాధారణమే. కానీ ప్రస్తుతం బ్యాంకులు రూటు మార్చాయి. రుణాలివ్వడంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తూ రైతులను ముప్పుతిప్పలు పెడుతున్నాయి. గతేడాది ఖరీఫ్‌లో నెలకొన్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా జిల్లాను కరువు ప్రాంతంగా కేంద్రం ప్రకటించింది. ఈ క్రమంలో రైతుల రుణాలు రీషెడ్యూల్ చేసి కొత్తగా ఆర్థిక చేయూత అందించాలి. ఈ క్రమంలో రుణాలు రీషెడ్యూల్ చేసిన బ్యాంకులు.. చివరగా రైతులకు కొత్త రుణాలు ఇవ్వకుండా చేతులె త్తేశాయి. జిల్లావ్యాప్తంగా 62వేల మంది రైతులకు రూ.211.25 కోట్లు రెన్యూవల్ చేయగా 5,807 మంది రైతులకు రూ.16.16 కోట్లు రీషెడ్యూల్ చేశారు.
 
చెయ్యిచ్చిన ప్రధాన బ్యాంకుల
- జిల్లాలో లీడ్ బ్యాంకుగా స్టేట్‌బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్(ఎస్‌బీహెచ్) వ్యవహరిస్తోంది.
- ఈ క్రమంలో ప్రస్తుత రబీ సీజన్‌లో రూ.65.5కోట్ల రుణాలను రైతులకు ఇచ్చేలా ప్రణాళిక రూపొందించింది.
- కానీ ఈ బ్యాంకు జిల్లాలో ఇప్పటివరకు ఒక్క రైతుకు కూడా కొత్తగా రుణం ఇవ్వలేదని అధికారుల నివేదికలు చెబుతున్నాయి. అదేవిధంగా భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్‌బీఐ)కు సైతం రూ.2.44 కోట్ల లక్ష్యం నిర్దేశించినప్పటికీ ఒక్కపైసా రైతులకు రుణరూపంలో ఇవ్వలేదు. ప్రధాన బ్యాంకులే మొండికేయడంతో జిల్లాలో ఆర్థిక సాయం కోసం రైతులు ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
 
యాచారం మండలం మంతన్‌గౌరెల్లికి చెందిన సభావట్ లింగా 2012లో తనకున్న 4.20 ఎకరాల పొలానికి సంబంధించిన పట్టాదారు పాసుపుస్తకాలు పెట్టి మాల్ ఆంధ్రాబ్యాంకులో రూ. 80 వేల రుణం తీసుకున్నాడు. వడ్డీతో సహా రూ.లక్ష ఏడు వేలు అయింది. ప్రభుత్వం రుణమాపీ చేయడంతో రూ. 25 వేలు మాఫీ అయింది. కొద్ది రోజుల కింద లింగా బ్యాంకులో రెన్యూవల్ చేసుకున్నాడు. రూ.లక్ష రుణం కింద జమ చేసుకొని కేవలం రూ.7 వేలను మాత్రమే ఇవ్వడం జరిగింది. రైతు మీద మళ్లీ రూ.లక్ష అప్పు అలానే మిగిలింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement