రెన్యువల్ జరిగేనా?
- డబ్బులు పోయినట్టేనా!
- మిర్చియార్డు షాపుల యజమానుల్లో ఆందోళన
- అధికారులపై ఒత్తిడి పెంచాలని నిర్ణయం
పాతగుంటూరు, న్యూస్‌లైన్, మిర్చియార్డులో కమిషన్ షాపుల రెన్వువల్ విషయంలో అయోమయ పరిస్థితి నెలకొంది. ప్రస్తుత పాలక వర్గం తీసుకున్న నిర్ణయం మేరకు రెన్యువల్ చేస్తారని ఎదురుచూస్తుండగా, కొత్త ప్రభుత్వం ఏర్పడగానే పాలకవర్గం మారిపోతుందనే ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. షాపుల రెన్యువల్ కోసం ఇప్పటికే వ్యాపారులు అధికారికంగా, అనధికారికంగా అధికారులకు నగదు చెల్లించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
భారీగా నగదు సమర్పించుకున్నా రెన్యువల్‌లో జాప్యంపై షాపుల యజమానులు ఎం జరుగుతుందోనని తలలు పట్టుకుంటున్నారు. రెండు రోజులు క్రితమే నగరంలోని ఒక ప్రధాన ఫంక్షన్ హాలులో యూనియన్ సభ్యులు, షాపుల యజమానులు రహస్యంగా సమావేశం నిర్వహించి, శుక్రవారం కూడా మరోసారి సమావేశమైనట్టు తెలిసింది. అధికారులపై ఒత్తిడి పెంచి అయినా రెన్యువల్ చేయించుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.
యార్డులోని 293 షాపులు రద్దు చేస్తూ అధికారులు గతంలో నోటీసులు ఇచ్చారు. ప్రతి షాపునకు రెన్యువల్ కోసం రూ.35వేలు యూనియన్‌లోని ఒక నాయకుడికి ఇచ్చినట్లు వ్యాపారులు బాహాటంగానే చెబుతున్నారు. దీనికి అదనంగా అధికారులు రూ.20 వేలు అడిగినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. నూతన లెసైన్సు కోసం రూ.55 వేల చొప్పున డిమాండ్ చేస్తున్నారని వినికిడి. జీవో నంబర్ 17 ప్రకారం కొత్త షాపులకు రూ.10 లక్షల డిపాజిట్, రూ.25 వేలు ష్యూరిటీ కింద చూపించాలి. అయితే ఈ జీవోనే పాత, కొత్త అన్నింటికీచూపించి అధిక మొత్తంలో రెన్యువల్ కోసం డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అధికారులకు డబ్బులివ్వకుండా కోర్టుకెళ్లి రెన్యువల్ చేయించుకోవచ్చని సమావేశంలో కొందరు అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలిసింది. మరికొంతమంది డబ్బులు తీసుకున్న అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి పని చేయించుకోవడమే మేలనే అభిప్రాయం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఏది ఏమైనా పాలకవర్గం మారకముందే షాపుల రెన్యువల్ పూర్తి చేసేలా అధికారులపై ఒత్తిడి తేవాలని అత్యధిక మంది షాపుల యజమానులు, అసోసియేషన్ సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.