mirchiyardu
-
రెన్యువల్ జరిగేనా?
- డబ్బులు పోయినట్టేనా! - మిర్చియార్డు షాపుల యజమానుల్లో ఆందోళన - అధికారులపై ఒత్తిడి పెంచాలని నిర్ణయం పాతగుంటూరు, న్యూస్‌లైన్, మిర్చియార్డులో కమిషన్ షాపుల రెన్వువల్ విషయంలో అయోమయ పరిస్థితి నెలకొంది. ప్రస్తుత పాలక వర్గం తీసుకున్న నిర్ణయం మేరకు రెన్యువల్ చేస్తారని ఎదురుచూస్తుండగా, కొత్త ప్రభుత్వం ఏర్పడగానే పాలకవర్గం మారిపోతుందనే ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. షాపుల రెన్యువల్ కోసం ఇప్పటికే వ్యాపారులు అధికారికంగా, అనధికారికంగా అధికారులకు నగదు చెల్లించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. భారీగా నగదు సమర్పించుకున్నా రెన్యువల్లో జాప్యంపై షాపుల యజమానులు ఎం జరుగుతుందోనని తలలు పట్టుకుంటున్నారు. రెండు రోజులు క్రితమే నగరంలోని ఒక ప్రధాన ఫంక్షన్ హాలులో యూనియన్ సభ్యులు, షాపుల యజమానులు రహస్యంగా సమావేశం నిర్వహించి, శుక్రవారం కూడా మరోసారి సమావేశమైనట్టు తెలిసింది. అధికారులపై ఒత్తిడి పెంచి అయినా రెన్యువల్ చేయించుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. యార్డులోని 293 షాపులు రద్దు చేస్తూ అధికారులు గతంలో నోటీసులు ఇచ్చారు. ప్రతి షాపునకు రెన్యువల్ కోసం రూ.35వేలు యూనియన్‌లోని ఒక నాయకుడికి ఇచ్చినట్లు వ్యాపారులు బాహాటంగానే చెబుతున్నారు. దీనికి అదనంగా అధికారులు రూ.20 వేలు అడిగినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. నూతన లెసైన్సు కోసం రూ.55 వేల చొప్పున డిమాండ్ చేస్తున్నారని వినికిడి. జీవో నంబర్ 17 ప్రకారం కొత్త షాపులకు రూ.10 లక్షల డిపాజిట్, రూ.25 వేలు ష్యూరిటీ కింద చూపించాలి. అయితే ఈ జీవోనే పాత, కొత్త అన్నింటికీచూపించి అధిక మొత్తంలో రెన్యువల్ కోసం డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులకు డబ్బులివ్వకుండా కోర్టుకెళ్లి రెన్యువల్ చేయించుకోవచ్చని సమావేశంలో కొందరు అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలిసింది. మరికొంతమంది డబ్బులు తీసుకున్న అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి పని చేయించుకోవడమే మేలనే అభిప్రాయం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఏది ఏమైనా పాలకవర్గం మారకముందే షాపుల రెన్యువల్ పూర్తి చేసేలా అధికారులపై ఒత్తిడి తేవాలని అత్యధిక మంది షాపుల యజమానులు, అసోసియేషన్ సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
డబ్బులిస్తేనే కమీషన్ షాపుల రెన్యువల్
- లేకుంటే రెన్యువల్స్ ఆగిపోతాయి - మిర్చి యార్డులో బ్రోకర్ల హల్చల్ - తమకు సంబంధం లేదంటున్న అధికారులు - ఆందోళనలో షాపుల యజమానులు పాతగుంటూరు, న్యూస్‌లైన్, డబ్బులిచ్చుకుంటేనే కమీషన్ షాపులు రెన్యువల్ అవుతాయి... లేకపోతే రెన్యువల్స్ ఆగిపోతాయ్.. అంటూ మిర్చియార్డులో కొంతమంది బ్రోకర్లు యథేచ్ఛగా వసూళ్లకు పాల్పడుతున్నారు. దీనిపై కమీషన్ షాపుల యజమానులు బిత్తరపోతున్నారు. కొన్ని రోజుల కిందట 293 షాపుల రెన్యువల్స్ రద్దయినట్లు షాపుల యజమానులకు అధికారులు నోటీసులు జారీ చేసిన సంగతి విధితమే. ఈ షాపులు రెన్యువల్ కావాలంటే ఉన్నతాధికారులకు డబ్బులు ముట్టచెప్పాలంటూ బ్రోకర్లు బుధవారానికి డెడ్‌లైన్ విధించినట్లు విశ్వసనీయ సమాచారం. గతంలో రెన్యువల్ కోసం ఒక్కొషాపునకు రూ.35 వేల చొప్పున 193 షాపులకు వసూలు చేశార ని ఆరోపణలున్నాయి. ఆ 193 షాపులకు మళ్లీ ఒక్కో షాపునకు రూ.20 వేలు ఇవ్వాలని, మిగిలిన వంద షాపుల రెన్యువల్ కోసం ఒక్కో షాపునకు రూ.55 వేలు ఇవ్వాలని వసూళ్లకు పాల్పడుతున్నారు. అలాగే నూతనంగా 36 షాపుల ఏర్పాటుకు ఒక్కో షాపునకు రూ.55 వేల చొప్పున ఇవ్వాలని కూడా దళారులు హల్చల్ చేస్తున్నట్లు తెలిసింది. ఎన్నికల అనంతరం ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందో, అప్పుడు ఈ రెన్యువల్ విషయం ఎలా మారుతుందో చెప్పలేము గనుక ప్రస్తుత పాలనలోనే ముడుపులు చెల్లించి రెన్యువల్ చేయించుకోవాలని ఒత్తిడి తెస్తున్నట్టు పలువురు ఆరోపిస్తున్నారు. డబ్బు వసూళ్లలో అసోసియేషన్ సభ్యుడు ఒకరు కీలకపాత్ర పోషిస్తున్నట్లు వ్యాపారులు ఆరోపిస్తున్నారు. గతంలో షాపుల కేటాయింపునకు తక్కువ డి పాజిట్ ఉండేది. నూతనగా షాపు లెసైన్సు కావాలంటే చట్టప్రకారం రూ.10 లక్షలు డిపాజిట్ చేయాలి. కొందరు అధికారుల సూచనల మేరకు ఎంతోకొంత డబ్బులిచ్చి పాతవాటినే రెన్యువల్ చేసుకోవాలని కొందరు పావులు కదుపుతున్నట్లు తెలిసింది. దీనివల్ల ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతుందని యార్డు కార్యాలయ సిబ్బంది అంటున్నారు. నా దృష్టికి రాలేదు... ఈ విషయంపై యార్డు ఉన్నత శ్రేణి కార్యదర్శి నరహరిని న్యూస్‌లైన్ వివరణ కోరగా వసూళ్ల విషయం తన దృష్టికి రాలేదన్నారు. షాపుల లెసైన్సుల రెన్యువల్స్ చట్ట ప్రకారమే జరుగుతాయని చెప్పారు.