డబ్బులిస్తేనే కమీషన్ షాపుల రెన్యువల్ | commission shops renewal | Sakshi
Sakshi News home page

డబ్బులిస్తేనే కమీషన్ షాపుల రెన్యువల్

Published Fri, Apr 25 2014 1:19 AM | Last Updated on Sat, Sep 2 2017 6:28 AM

డబ్బులిస్తేనే కమీషన్ షాపుల రెన్యువల్

డబ్బులిస్తేనే కమీషన్ షాపుల రెన్యువల్

- లేకుంటే రెన్యువల్స్ ఆగిపోతాయి
- మిర్చి యార్డులో బ్రోకర్‌ల హల్‌చల్
- తమకు సంబంధం లేదంటున్న అధికారులు
- ఆందోళనలో షాపుల యజమానులు

 
 పాతగుంటూరు, న్యూస్‌లైన్, డబ్బులిచ్చుకుంటేనే కమీషన్ షాపులు రెన్యువల్ అవుతాయి... లేకపోతే రెన్యువల్స్ ఆగిపోతాయ్.. అంటూ మిర్చియార్డులో  కొంతమంది బ్రోకర్లు యథేచ్ఛగా వసూళ్లకు పాల్పడుతున్నారు. దీనిపై కమీషన్ షాపుల యజమానులు బిత్తరపోతున్నారు.

కొన్ని రోజుల కిందట 293 షాపుల రెన్యువల్స్ రద్దయినట్లు షాపుల యజమానులకు అధికారులు నోటీసులు జారీ చేసిన సంగతి విధితమే.  ఈ షాపులు రెన్యువల్ కావాలంటే ఉన్నతాధికారులకు డబ్బులు ముట్టచెప్పాలంటూ బ్రోకర్లు బుధవారానికి డెడ్‌లైన్ విధించినట్లు విశ్వసనీయ సమాచారం.

గతంలో రెన్యువల్ కోసం ఒక్కొషాపునకు రూ.35 వేల చొప్పున  193 షాపులకు వసూలు చేశార ని ఆరోపణలున్నాయి. ఆ 193 షాపులకు మళ్లీ ఒక్కో షాపునకు రూ.20 వేలు ఇవ్వాలని, మిగిలిన వంద షాపుల రెన్యువల్ కోసం ఒక్కో షాపునకు రూ.55 వేలు ఇవ్వాలని వసూళ్లకు పాల్పడుతున్నారు.

అలాగే నూతనంగా 36 షాపుల ఏర్పాటుకు ఒక్కో షాపునకు రూ.55 వేల చొప్పున ఇవ్వాలని కూడా దళారులు హల్‌చల్ చేస్తున్నట్లు తెలిసింది. ఎన్నికల అనంతరం ఏ ప్రభుత్వం అధికారంలోకి  వస్తుందో, అప్పుడు ఈ రెన్యువల్ విషయం ఎలా మారుతుందో చెప్పలేము గనుక  ప్రస్తుత పాలనలోనే ముడుపులు చెల్లించి రెన్యువల్ చేయించుకోవాలని ఒత్తిడి తెస్తున్నట్టు పలువురు ఆరోపిస్తున్నారు.

 డబ్బు వసూళ్లలో అసోసియేషన్ సభ్యుడు ఒకరు కీలకపాత్ర పోషిస్తున్నట్లు వ్యాపారులు ఆరోపిస్తున్నారు. గతంలో షాపుల కేటాయింపునకు తక్కువ డి పాజిట్ ఉండేది. నూతనగా షాపు లెసైన్సు కావాలంటే చట్టప్రకారం రూ.10 లక్షలు డిపాజిట్ చేయాలి.

కొందరు అధికారుల సూచనల మేరకు ఎంతోకొంత డబ్బులిచ్చి పాతవాటినే రెన్యువల్ చేసుకోవాలని కొందరు పావులు కదుపుతున్నట్లు తెలిసింది. దీనివల్ల ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతుందని యార్డు కార్యాలయ సిబ్బంది అంటున్నారు.

 నా దృష్టికి రాలేదు...

ఈ విషయంపై యార్డు ఉన్నత శ్రేణి కార్యదర్శి నరహరిని న్యూస్‌లైన్ వివరణ కోరగా వసూళ్ల విషయం తన దృష్టికి  రాలేదన్నారు. షాపుల లెసైన్సుల రెన్యువల్స్ చట్ట ప్రకారమే జరుగుతాయని చెప్పారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement