Boutiques owners
-
లాభసాటి బిజినెస్, మోడ్రన్ డ్రెస్సింగ్‌కు కేరాఫ్‌గా బొటిక్
జగిత్యాలటౌన్: మహిళల మోడ్రన్ డ్రెస్సింగ్‌కు కేరాఫ్‌గా బొటిక్‌లు నిలుస్తున్నాయి. ప్రస్తుత కాలంలో ట్రెండుతో పాటు మహిళల ఆసక్తి, అభిరుచికి తగిన విధంగా అనేక రంగులు, డిజైన్లు, మెటీరియల్ ఒకేచోట లభిస్తుండటంతో బొటిక్‌లకు డిమాండ్ పెరిగింది. గతంలో ఒక షాపులో మెటీరియల్ కొనుగోలు చేసి దానికి లైనింగ్ మరోచోట, స్టిచింగ్ ఇంకో చోట ఇలా పలు దుకాణాలు తిరగాల్సి వచ్చేది. ప్రస్తుతం ఉద్యోగాలు, వ్యాపారాల నిర్వహణతో బిజీగా మారిన మహిళలకు వన్‌స్టెప్ సర్వీస్ అందజేస్తున్న బొటిక్‌లు వరంగా మారాయి. మెటీరియల్, లైనింగ్, డిజైనింగ్‌తో పాటు స్టిచింగ్ కూడా ఒకేచోట లభిస్తుండటంతో మహిళలు బొటిక్‌లకు క్యూ కడుతున్నారు. పండగలు, ఫంక్షన్లు, పార్టీలు, సందర్భం ఏదైనా బొటిక్కు వెళ్లి అకేషన్ డీటేల్స్ చెప్తే చాలు మెటీరియల్ సెలెక్షన్ దగ్గర నుంచి కంప్యూటర్ డిజైనింగ్ మగ్గం వర్క్ ఏది కావాలంటే అది, ఎలా కావాలంటే అలా రెడీ చేసి కస్టమర్లకు డెలివరీ చేయడం బొటిక్‌ల ప్రత్యేకత. అభిరుచికి అనుగుణంగా.. గతంలో కస్టమర్లు మ్యాచింగ్ బ్లౌజులు మాత్రమే అడిగేవారు. ప్రస్తుతం మారుతున్న మహిళల ఆలోచన, అభిరుచికి అనుగుణంగా మగ్గం వర్క్, బోట్‌నెక్, కంప్యూటర్ బ్లౌజులకు గిరాకీ పెరిగింది. అకేషన్ డీటేల్స్ చెప్తే ఏది వేసుకుంటే బాగుంటుందో సజెస్ట్ చేయడమే కాకుండా కస్టమర్ల అభిరుచికి అనుగుణంగా మెటీరియల్ సెలెక్షన్, డిజైన్, మగ్గం వర్క్‌తో ట్రెండీ బ్లౌజెస్ రెడీ చేసి ఇస్తాం. అందుబాటు ధరల్లో అనుకున్న డిజైన్లు అనుకున్న సమయానికి డెలివరీ ఇస్తున్నాం. బొటిక్ నిర్వహణతో స్వయం ఉపాధితో పాటు పదిమందికి పని కల్పిస్తున్నామనే సంతృప్తి ఉంది. – ప్రణీత, బొటిక్ నిర్వాహకురాలు మహిళల అభిరుచిని బట్టి బోట్‌నెక్, మగ్గం వర్క్, కంప్యూటర్ డిజైన్డ్ బ్లౌజెస్ అందుబా టులో ఉన్నాయి. మగ్గం వర్క్ బ్లౌజెస్ ధరలు రూ.1400 నుంచి రూ.10వేల వరకు ఉండగా, బోట్‌నెక్ బ్లౌజులకు రూ.400 నుంచి రూ. వెయ్యి చార్జ్ చేస్తున్నారు. కంప్యూటర్ డిజైన్డ్ బ్లౌజులకు రూ.500 నుంచి రూ.3వేల వరకు మెటీరియల్ డిజైన్ బట్టి ధర నిర్ణయిస్తారు. -
రెన్యువల్ జరిగేనా?
- డబ్బులు పోయినట్టేనా! - మిర్చియార్డు షాపుల యజమానుల్లో ఆందోళన - అధికారులపై ఒత్తిడి పెంచాలని నిర్ణయం పాతగుంటూరు, న్యూస్‌లైన్, మిర్చియార్డులో కమిషన్ షాపుల రెన్వువల్ విషయంలో అయోమయ పరిస్థితి నెలకొంది. ప్రస్తుత పాలక వర్గం తీసుకున్న నిర్ణయం మేరకు రెన్యువల్ చేస్తారని ఎదురుచూస్తుండగా, కొత్త ప్రభుత్వం ఏర్పడగానే పాలకవర్గం మారిపోతుందనే ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. షాపుల రెన్యువల్ కోసం ఇప్పటికే వ్యాపారులు అధికారికంగా, అనధికారికంగా అధికారులకు నగదు చెల్లించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. భారీగా నగదు సమర్పించుకున్నా రెన్యువల్లో జాప్యంపై షాపుల యజమానులు ఎం జరుగుతుందోనని తలలు పట్టుకుంటున్నారు. రెండు రోజులు క్రితమే నగరంలోని ఒక ప్రధాన ఫంక్షన్ హాలులో యూనియన్ సభ్యులు, షాపుల యజమానులు రహస్యంగా సమావేశం నిర్వహించి, శుక్రవారం కూడా మరోసారి సమావేశమైనట్టు తెలిసింది. అధికారులపై ఒత్తిడి పెంచి అయినా రెన్యువల్ చేయించుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. యార్డులోని 293 షాపులు రద్దు చేస్తూ అధికారులు గతంలో నోటీసులు ఇచ్చారు. ప్రతి షాపునకు రెన్యువల్ కోసం రూ.35వేలు యూనియన్‌లోని ఒక నాయకుడికి ఇచ్చినట్లు వ్యాపారులు బాహాటంగానే చెబుతున్నారు. దీనికి అదనంగా అధికారులు రూ.20 వేలు అడిగినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. నూతన లెసైన్సు కోసం రూ.55 వేల చొప్పున డిమాండ్ చేస్తున్నారని వినికిడి. జీవో నంబర్ 17 ప్రకారం కొత్త షాపులకు రూ.10 లక్షల డిపాజిట్, రూ.25 వేలు ష్యూరిటీ కింద చూపించాలి. అయితే ఈ జీవోనే పాత, కొత్త అన్నింటికీచూపించి అధిక మొత్తంలో రెన్యువల్ కోసం డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులకు డబ్బులివ్వకుండా కోర్టుకెళ్లి రెన్యువల్ చేయించుకోవచ్చని సమావేశంలో కొందరు అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలిసింది. మరికొంతమంది డబ్బులు తీసుకున్న అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి పని చేయించుకోవడమే మేలనే అభిప్రాయం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఏది ఏమైనా పాలకవర్గం మారకముందే షాపుల రెన్యువల్ పూర్తి చేసేలా అధికారులపై ఒత్తిడి తేవాలని అత్యధిక మంది షాపుల యజమానులు, అసోసియేషన్ సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.