వర్షాలకు దెబ్బతిన్న చెరువులు, కాల్వలు, ప్రాజెక్టులకు అత్యవసర మరమ్మతులు
1,800 లస్కర్ల నియామకానికి ఆర్థికశాఖ అనుమతి కోరండి: మంత్రి ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: భారీవర్షాలు, వరదలతో దెబ్బతిన్న చెరువుల కట్టలు, కాల్వలు, ఇతర ప్రాజెక్టుల పునరుద్ధరణకు తక్షణమే స్వల్పకాలిక టెండర్లు ఆహ్వానించాలని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. పనులకు పరిపాలనాపర అనుమతులను అత్యవసరంగా జారీ చేసి శుక్రవారం ఉదయం నాటికి ఆన్‌లైన్‌లో టెండర్లను పొందుపర్చాలని సూచించారు. దెబ్బతిన్న చెరువులు, కాల్వలు, ఇతర ప్రాజెక్టుల పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలపై గురువారం ఆయన జలసౌధ నుంచి క్షేత్రస్థాయిలోని నీటిపారుదల శాఖ ఇంజనీర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. మొత్తంగా 544 జలవనరులకు నష్టం వాటిల్లిందని, అత్యవసర మరమ్మతులకు రూ.113 కోట్లు అవసరమని అధికారులు మంత్రికి నివేదించారు.
అత్యవసర, శాశ్వత మరమ్మతులకు రూ.1,100 కోట్లు కేటాయించాలని కోరగా, రాష్ట్ర ఆర్థిక శాఖ రూ.350 కోట్లు కేటాయించిందని అధికారులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. నిధులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని, తక్షణమే అన్ని పనులకు షార్ట్ టెండర్లు ఆహ్వానించాలని మంత్రి ఆదేశించారు. మళ్లీ భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు ఉన్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. మానవ తప్పిదంతో ఏదైనా నష్టం జరిగితే సంబంధిత చీఫ్ ఇంజనీర్లను బాధ్యులుగా చేస్తూ కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
వట్టెం పంప్‌హౌస్ పునరుద్ధరణ ఖర్చు నిర్మాణ సంస్థదే...: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పరిధిలోని వట్టెం వద్ద నిర్మించిన పంప్‌హౌస్‌తోపాటు సొరంగం నీటమునగగా, 4000 హెచ్‌పీ సామర్థ్యం కలిగిన 16 పంపుల ద్వారా నీళ్లను బయటకు తోడేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు మంత్రికి చెప్పారు. నిర్మాణ సంస్థే సొంతఖర్చుతో పునరుద్ధరణ పనులు నిర్వహిస్తుందని అధికారులు తెలిపారు.
త్వరలో పదోన్నతులు, బదిలీలు..: విపత్తుల సమయంలో 90 శాతం మంది ఉద్యోగులు బాగా పనిచేశారని, మిగిలిన 10 శాతం మంది సైతం తమ పనితీరును మెరుగుపరుచుకోవాలని మంత్రి ఉత్తమ్ సూచించారు. కొత్తగా నియామకం పొందిన 700 మంది ఏఈలకు త్వరలో పోస్టింగులతోపాటు నీటిపారుదల శాఖలో ఇంజనీర్లకు పదోన్నతులు, బదిలీలు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. తాత్కాలిక పదోన్నతులు కాకుండా శాశ్వత పదోన్నతులే ఇస్తామన్నారు. నీటిపారుదలశాఖలో ఖాళీగా ఉన్న 1,800 లస్కర్ పోస్టుల భర్తీకి అనుమతి కోరుతూ ఆర్థికశాఖకు ప్రతిపాదనలను పంపించాలని అధికారులను ఆదేశించారు. సమీక్షలో నీటిపారుదలశాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్‌పాటిల్, ఈఎన్‌సీ(జనరల్) అనిల్‌కుమార్, ఈఎన్‌సీ (ఓఅండ్‌ఎం) నాగేందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment