మాఫీ.. మాయ!
రెన్యువల్ చేసుకున్న రైతులకే రెండో విడత రుణమాఫీ
జిల్లాలో మొత్తం రుణమాఫీ అర్హులు 2,08,425 మంది
రెన్యువల్ చేసుకున్న వారు 26,399 మంది
రంగారెడ్డి జిల్లా : రుణమాఫీపై ప్రభుత్వం పెడుతున్న సవాలక్ష నిబంధనలు రైతులు ముప్పుతిప్పలు పెడుతున్నాయి. ఇటీవల రెండో విడత రుణమాఫీ నిధులను ప్రభుత్వం విడుదల చేసిన నేపథ్యం.. యంత్రాంగం జిల్లాలో 2,08,425 మంది రైతులకు రూ.125.6 కోట్లు బ్యాంకులకు బదిలీ చేసింది. ఈక్రమం లో ఈనెల 31లోగా రైతుల ఖాతాల్లో నిధులను జమ చేయాల్సి ఉంది. ఈ మేరకు అధికారులు చర్యలు మొదలుపెట్టారు. అయితే రెన్యువల్ చేసుకున్న రైతులకు మాత్రమే రుణమాఫీలో ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేయడంతో అసలుకే ఎసరు వచ్చింది. రైతుల పంటరుణాలను రెన్యువల్ చేయడంలో బ్యాంకర్లు ఉదాసీనంగా వ్యవహరించడంతో ఈ పరిస్థితి నెలకొంది. జిల్లాలో పంట రుణ మాఫీకి 2,08,425 మంది అర్హులున్నారు. వీరంతా రుణాలను రెన్యువల్ చేసుకోవాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు కేవలం 26,399 మంది రైతులు మాత్రమే రుణాలను రెన్యువల్ చేసుకున్నారు. దీంతో ఆయా రైతుల బ్యాంకు ఖాతాల్లో జిల్లా వ్యవసాయశాఖ ఇప్పటివరకు రూ.22.22 కోట్లు జమచేసింది. నిర్దేశించిన లక్ష్యంలో కేవలం 12శాతం మాత్రమే పురోగతి సాధించినట్లు స్పష్టమవుతోంది. ఈక్రమంలో ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా రెండు లక్షల మంది రైతులకు రుణమాఫీ నిధులు జమచే యడం కష్టమే.
కదలనున్న అక్రమాల డొంక..
రుణమాఫీలో అక్రమాలకు కళ్లెం వేసేందుకు తాజాగా రెన్యువల్ ప్రక్రియను ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. గతంలో మాదిరిగా కాకుండా ఈ సారి విడతల వారీగా రుణాన్ని మాఫీ చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రతిసారి రైతులు రుణాన్ని రీషెడ్యుల్ చేసుకోవాలి. ఈ క్రమంలో బోగస్ ఖాతాల తంతు బయటపడనుంది. మొదటివిడతలో అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేయడంతో మూడున్నరవేల మంది నకిలీ రైతులు బయటపడ్డారు. దీంతో వారికివ్వాల్సిన నిధులను వెనక్కు పంపిన సంగతి తెలిసిందే. తాజాగా రెన్యువల్ ప్రక్రియ పూర్తయితే అక్రమాల సంగతి తేలనుంది. అదేవిధంగా ఆడిట్ నివేదికలు సైతం రావాల్పి ఉంది. మొత్తంగా జాప్యం జరుగుతున్న కొద్దీ అక్రమాల తంతు వెలుగులోకి వస్తుందని వ్యవసాయశాఖ అధికారి ఒకరు
‘సాక్షి’తో అభిప్రాయపడ్డారు.