బ్యాంకులు వెలవెల
సాక్షి, కడప : జూన్ మాసం వచ్చిందంటే రైతులతో బ్యాంకులు కళకళలాడుతాయి. ఖరీఫ్ రుణాలకు సంబంధించి జూన్ నుంచి సెప్టెంబరు లోపు రైతులు రుణాలను రెన్యూవల్ చేసుకుంటారు. ఈ నేపథ్యంలో బ్యాంకు సిబ్బంది బిజీబిజీగా ఉంటారు.
గత ఏడాది ఇదే సమయానికి జిల్లాలోని 66 ప్రాథమిక పరపతి సంఘాల పరిధిలో 70 శాతం మంది రైతులు రుణాలు రెన్యూవల్ చేసుకున్నారు. అయితే ఈ ఏడాది పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. చంద్రబాబు ప్రకటించిన రుణమాఫీ హామీతో బ్యాంకులు వెలవెల బోతున్నాయి. వాటివైపు అన్నదాతలు కన్నెత్తి చూడటం లేదు. బ్యాంకు సిబ్బంది పంట రుణాలు చెల్లించాలని అడిగినా ఆగండి, 8వ తేదీన చంద్రబాబు రుణమాఫీపై సంతకం చేస్తారని రైతులు ధీమాగా చెబుతూ ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ పరిణామంతో బ్యాంకుల్లో లావాదేవీలు స్తంభించిపోయాయి.
మొత్తం మీద డీసీసీబీ పరిధిలోని 66 ప్రాథమిక పరపతి సంఘాలు డీలాపడ్డాయి. ప్రభుత్వం ఏ నిబంధనలు పెట్టి రుణమాఫీ చేస్తుంది? ఎంతమేరకు రుణ మాఫీ అవుతుంది అన్న అంచనాల్లో అధికారులు నిమగ్నమయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించినట్లు రుణమాఫీ చేస్తే పెద్దగా డీసీసీ బ్యాంకుతోపాటు రైతులకు లాభం ఉండదని అధికారులు పేర్కొంటున్నారు. బ్యాంకు శాఖలు అప్పుల్లో కూరుకుపోవడం ఖాయమని అధికారులు పేర్కొంటున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మార్చి 2014 వరకు బ్యాంకులో ఉన్న పంట, దీర్ఘకాలిక రుణాలు, బంగారు రుణాలు మొత్తం, రైతుల జాబితాను సిద్ధం చేశారు.
పంట రుణాలు ఇవే
జిల్లా వ్యాప్తంగా 66 సహకార సొసైటీల పరిధిలో 89,389మంది రైతులు రూ. 250.41 కోట్ల రుణాన్ని పొందారు. ఇందులో సక్రమంగా చెల్లించని వారు 44,670 మంది రైతులు ఉన్నారు. వీరు రూ. 119.81 కోట్లను చెల్లించాల్సి ఉంది. ఈ బకాయిలన్నీ మార్చి 2014 వరకు బ్యాంకు అధికారులు లెక్కకట్టారు. సహకార బ్యాంకు కడపశాఖతోపాటు ఇతర బ్రాంచ్‌లలో 4,569మంది రైతులు రూ. 2.48 కోట్ల బంగారు రుణాలను పొందారు. ఇందులో ఎక్కువగా పంట రుణాలు రూ. లక్షలోపు ఉండడం గమనార్హం. 649 మంది రైతులకు సంబంధించి రూ. 57.56 లక్షల మొత్తాన్ని రీషెడ్యూల్ చేశారు.
దీర్ఘకాలిక రుణాలు
జిల్లాలో 9938 మంది రైతులు రూ. 54.51 కోట్ల రుణాన్ని దీర్ఘకాలిక రుణంగా పొందారు. ఇందులో సకాలంలో సక్రమంగా రుణాలు చెల్లించని వారు 7,839 మంది రైతులు రూ. 23.97 కోట్ల రుణాన్ని చెల్లించాల్సి ఉంది.
ప్రభుత్వ సూచనల మేరకు బ్యాంకు అధికారులు రైతులు చెల్లించాల్సిన రుణ బకాయిలను లెక్కకట్టి సిద్ధం చేశారు. అయితే ప్రభుత్వం బేషరతుగా రుణమాఫీ ప్రకటిస్తుందా? లేదా నిబంధనలు ఏవైనా విధిస్తుందా? అని అన్నదాతలు ఎదురు చూస్తున్నారు. బ్యాంకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రైతులు చెల్లించాల్సిన బకాయిలు ఎంతమేరకు ఉన్నాయో లెక్కకట్టి సిద్ధంగా ఉంచినట్లు డీసీసీబీ జీఎం రాఘవేంద్రరెడ్డి ‘సాక్షి’తో పేర్కొన్నారు.