11 లక్షల మందికి ‘నో రెన్యువల్’! | 11 million people, 'No renewal'! | Sakshi
Sakshi News home page

11 లక్షల మందికి ‘నో రెన్యువల్’!

Published Thu, Dec 18 2014 12:39 AM | Last Updated on Sat, Sep 2 2017 6:20 PM

11 లక్షల మందికి ‘నో రెన్యువల్’!

11 లక్షల మందికి ‘నో రెన్యువల్’!

  • 34 లక్షల మంది రైతుల్లో... 23 లక్షల మంది రుణాలే రె న్యువల్  
  •  ఖరీఫ్ రుణ లక్ష్యం రూ. 14 వేల కోట్లు... ఇచ్చింది రూ. 11 వేల కోట్లు
  •  రబీ సీజన్‌కు సంబంధించి కూడా లక్ష్యానికి దూరంగా రుణాల మంజూరు
  •  నెలాఖరులోగా ‘రెన్యువల్’ పూర్తి చేసి రుణాలివ్వాలని తెలంగాణ ప్రభుత్వఆదేశం
  •  రైతులే ముందుకు రావడం లేదంటున్న బ్యాంకర్లు
  •  లక్ష్యాల మేరకు ప్రాధాన్య, అప్రాధాన్య రంగాలకు రుణాలిచ్చామని వెల్లడి
  • సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇంకా దాదాపు 11 లక్షల మంది రైతులకు చెందిన పంట రుణాలు రెన్యువల్ కాలేదు. ఖరీఫ్ సీజన్‌లో మొత్తంగా రూ. 14 వేల కోట్ల మేరకు కొత్త రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా... రూ.11 వేల కోట్లు మాత్రమే ఇచ్చారు. ఇక రబీలో పెట్టుకున్న రుణ మంజూరు లక్ష్యం రూ. 6,300 కోట్లు కాగా... ఇప్పటికీ ఈ రుణ పంపిణీ క్షేత్ర స్థాయిలో ఆశించిన మేరకు ముందుకు సాగడం లేదు.

    బుధవారం సచివాలయంలో ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అధ్యక్షతన జరిగిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. రాష్ట్రంలో రుణమాఫీ కోసం ప్రభుత్వం రూ. 4,250 కోట్లను విడుదల చేయడంతో... మొత్తం 34 లక్షల రైతుల రుణాలను రెన్యువల్ చేసి, కొత్త రుణాలు ఇవ్వాలని నిర్ణయించారు. కానీ ఇప్పటి వరకు 23 లక్షల ఖాతాలు మాత్రమే రెన్యువల్ అయ్యాయి.

    ఖరీఫ్‌లో రైతులకు మొత్తం రూ. 11 వేల కోట్ల రుణాలు ఇచ్చినట్లు బ్యాంకర్లు ప్రభుత్వం దృష్టికి తీసుకుని వచ్చారు. దీంతో మిగతా 11 లక్షల మంది రైతుల రుణాలు రెన్యువల్ చేసి, వెంటనే వారికి కొత్త రుణాలు ఇవ్వాలని మంత్రి ఈటెల రాజేందర్, ప్రభుత్వ సీఎస్ రాజీవ్‌శర్మ బ్యాంకర్లను కోరారు. అయితే వర్షాల్లేక, క్షేత్రస్థాయిలో వ్యవసాయానికి అనుకూల పరిస్థితులు లేక రైతులు రుణాలు తీసుకోవడానికి ముందుకు రావడం లేదని బ్యాంకర్లు ప్రభుత్వానికి వివరించినట్లు సమాచారం.

    తెలంగాణ రాష్ట్ర రుణ ప్రణాళిక ప్రకారం ప్రాధాన్య, అప్రాధాన్య రంగాలకు లక్ష్యం మేరకు రుణాలు పంపిణీ చేసినట్లు వారు తెలిపారు. ప్రాధాన్యతా రంగానికి 40 శాతం రుణాలు ఇవ్వాల్సి ఉంటే.. ఇప్పటికే 33 శాతం మేరకు ఇచ్చినట్లు వివరించారు. కాగా.. రబీ సీజన్‌లో రూ. 6,300 కోట్ల రుణాలివ్వాలని నిర్ణయించినా... క్షేత్రస్థాయిలో ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదని ప్రభుత్వ అధికారులు బ్యాంకర్ల దృష్టికి తీసుకువచ్చారు. రుణాల రెన్యువల్‌కు సంబంధించి ఎక్కడ ఇబ్బంది ఉందో బ్యాంకులు వివరిస్తే దానిని సరిచేయడానికి వీలవుతుందని సూచించారు.

    ఈ సందర్భంగా మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ... ప్రభుత్వం సంక్షేమ రంగానికి పెద్దపీట వేస్తోందని, అందుకు అనుగుణంగా బ్యాంకర్లు రుణాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. స్వయం ఉపాధి పథకాల కింద ఇచ్చే రుణాలు ఆ కుటుంబాన్ని నిలబెట్టే విధంగా ఉండాలని, అందుకు అవసరమైన సూచనలు, సలహాలను ఇవ్వాలని బ్యాంకులను కోరారు. ఇదివరకే మంజూరైన వారికి ఈ మూడు నెలల కాలంలో రుణాలన్నీ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సీఎస్ రాజీవ్‌శర్మ మాట్లాడుతూ.. పంట రుణాల రెన్యువల్‌లో కొద్దిరోజులుగా ఎలాంటి పురోగతి కనిపించడం లేదన్నారు. ఈ నెలాఖరులోగా దానిని పూర్తి చేయాలని కోరారు.

    సంతృప్తస్థాయిలో బ్యాంకు ఖాతాలు..

    తెలంగాణ రాష్ట్రంలో 97 శాతం కుటుంబాలకు బ్యాంకు ఖాతాలు ఇచ్చామని, ఈ నెల 20వ తేదీ నాటికి అందరికీ ఖాతాలు కల్పించినట్లు ప్రకటించనున్నామని బ్యాంకర్లు సమావేశంలో వెల్లడించారు. జన్ ధన్ యోజన కింద 36 లక్షల ఖాతాలు తెరిపించినట్లు చెప్పారు. వారందరికీ ‘రూపే’ కార్డులను పంపిణీ చేశామని... వారికి రూ. 30 వేల జీవిత బీమా, రూ. లక్ష ప్రమాద బీమా పాలసీ ఇస్తున్నామని తెలిపారు. తెలంగాణలో దాదాపు కోటి బ్యాంకు ఖాతాలున్నట్లు చెప్పారు.

    ఎస్‌ఎల్‌బీసీ కన్వీనర్, ఎస్‌బీహెచ్ ఎండీ శంతన్ ముఖర్జీ మాట్లాడుతూ... ప్రభుత్వం చేపట్టిన పలు పథకాలను అభినందించారు. రాష్ట్రంలో బ్యాంకు శాఖల సంఖ్య 4,682కు చేరిందని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ఏప్రిల్-సెప్టెంబర్ మధ్యకాలంలో రూ. 10,531 కోట్ల డిపాజిట్లు వచ్చాయని, దీనితో మొత్తం డిపాజిట్లు రూ. 2,97,422 కోట్లకు చేరాయని తెలిపారు. దేశంలో రుణ నిష్పత్తి అత్యధికంగా 113 శాతం ఉన్నట్లు తెలిపారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement