వసూల్ రాజా!
విద్యా శాఖలో అంతా ఆయనే....
► అనుమతి కావాలంటే చేయి తడపాల్సిందే
► పాఠశాలల రెన్యూవల్‌కూ తప్పని కాసుల బెడద
► ఏళ్ల తరబడిగా కార్యాలయంలోనే తిష్ట
► మధ్యవర్తిత్వం నెరుపుతున్న ఓ పాఠశాల యాజమాని
► ఫిర్యాదుకు యాజమాన్యాల వెనుకంజ
► లొసుగుల నేపథ్యంలో సాఫీగా వ్యవహారం
మీరు కొత్తగా స్కూల్ పెట్టాలనుకుంటున్నారా? అయితే, విద్యాశాఖలో ఆ అధికారిని కలవాల్సిందే! మీ పాఠశాలను మళ్లీ వచ్చే విద్యా సంవత్సరానికి రెన్యూవల్ చేసుకోవాలా? ఆ అధికారిని కలిసి చేయి తడపండి. ఇట్టే పనైపోతుంది!!
సాక్షి ప్రతినిధి, కర్నూలు: విద్యా శాఖలో ఏ పని కావాలన్నా కాసులతో పని. జేబు బరువుంటేనే అక్కడ పని అవుతుందనే ఆరోపణ వినిపిస్తోంది. ప్రతి పనికీ రూ.10వేల నుంచి రూ.15వేల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. కార్యాలయంలో ఎన్నో ఏళ్లుగా తిష్ట వేసిన సదరు అధికారి ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు, ముగ్గురు టీచర్లు కలిసి పెట్టుకున్న చిన్న పాఠశాలను కూడా ఈయన వదలని పరిస్థితి. కొండారెడ్డి బురుజుకు దగ్గరలోని ఓ పాఠశాల యజమాని ఈ దందాకు మధ్యవర్తిత్వం నెరుపుతున్నట్లు చర్చ జరుగుతోంది.
పాఠశాలకు సంబంధించిన ఏ అనుమతి కావాలన్నా ముందుగా సదరు అధికారిని కలవాల్సి వస్తోంది. ఆ వెంటనే ఆయన పనిని బట్టి ఒక రేటు ఫిక్స్ చేస్తున్నారు. ఈ మొత్తం అందజేతకు నమ్మకస్తుడైన ఓ వ్యక్తికి అప్పగించేలా ఒప్పందం చేసుకుంటున్నారు. కొండారెడ్డి బురుజు సమీపంలోని ఓ ప్రైవేట్ పాఠశాల యజమానే ఆ నమ్మకస్తుడు. అక్కడ పైసలు ముట్టిన వెంటనే ఇక్కడ పనులు చకచకా జరిగిపోతున్నాయి. మూడో కంటికి తెలియకుండా ఆయన వ్యవహారం సాగిపోతోంది. అడిగిన మొత్తం సదరు మధ్యవర్తికి అందలేదంటే.. సంబంధిత ఫైలు ఎక్కడికక్కడ నిలిచిపోతోంది.
కనీస సౌకర్యాలు కరువు
వాస్తవానికి జిల్లాలోని పలు ప్రైవేటు పాఠశాలల్లో కనీస సౌకర్యాలు లేవు. విద్యాశాఖ నిబంధనల ప్రకారం.. ఏ పాఠశాలలోనూ విద్యార్థులకు సరిపడా టాయ్‌లెట్లు, ఆట స్థలం కానీ లేవు. అంతేకాకుండా సరైన టీచర్లు కూడా లేరు. మరోవైపు ఒక్కో క్లాసు రూంలో అనుమతికి మించి విద్యార్థులు ఉంటున్నారు. అదేవిధంగా ఒక్కో సెక్షన్‌కు కూడా పరిమితికి మించి విద్యార్థులను కూర్చోబెడుతున్నారు. అన్నింటికీ మించి వసూలు చేసే ఫీజుల విషయంలో విద్యాశాఖ పట్టీపట్టనట్టు వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో తమ లోపాలను ఏ మాత్రం చూసీచూడనట్టు వదిలేసేందుకు ప్రతి పనికో రేటును నిర్ణయించి ఆ అధికారి తన పబ్బం గడుపుకుంటున్నాడు.
అన్నీ తానై నడిపిస్తున్న వైనం
విద్యాశాఖలో ఈ అధికారి అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. ఎన్నో సంవత్సరాలుగా తిష్టవేసిన సదరు అధికారికి విద్యాశాఖలోని మొత్తం వ్యవహారాలు కొట్టిన పండి కావడంతో ఎవ్వరికీ చిక్కకుండా పనులు చక్కపెట్టుకుంటున్నారు. ఈ అధికారిని విద్యాశాఖ నుంచి కదిలించేందుకు అనేక మంది చేసిన ప్రయత్నాలు సఫలీకృతం కాలేదంటే పరిస్థితి ఏమిటో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. మరోవైపు తమ లోటుపాట్లు బయటపడకుండా ఉండేందుకే.. లంచాలు ఇస్తున్న ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు కూడా ఈయనపై ఫిర్యాదు వెనుకంజ వేస్తుండటానికి కారణంగా తెలుస్తోంది.