రైతుల నమ్మకాన్ని ఆ బ్యాంకు నీరుగార్చింది. పంట రుణాల వసూళ్లలో తిరకాసు ప్రదర్శిస్తోంది. నోరున్నోళ్లకు మాత్రమే న్యాయం చేస్తోంది. పంటల బీమా ప్రీమియం పేరుతో చేతివాటం చూపింది. అడిగినోళ్లకు మాత్రమే చెల్లింపులు చేస్తూ గుట్టు చప్పుడు కాకుండా వ్యవహరిస్తున్న సిండికేట్ బ్యాంకు వైనమిది...
సాక్షి ప్రతినిధి, కడప: జిల్లాలోని ముద్దనూరు సిండికేట్ బ్యాంకులో దాదాపు 3వేల మంది రైతులకు పంట రుణాలు ఇచ్చారు. ఇంతకాలం బ్యాంకర్లు సూచించిన మొత్తం చెల్లిస్తూ రుణాలను ఖాతాదారులు రెన్యువల్ చేయించుకుంటూ వచ్చారు. అయితే వడ్డీలేని పంట రుణాలతో రైతులకు నమ్మలేని నిజం బహిర్గతమైంది. ప్రీమియం పేరుతో అధిక మొత్తం వసూళ్లు చేస్తూ చేతివాటం ప్రదర్శించారు. ఇదేమని ప్రశ్నిస్తే కిమ్మనకుండా వారి నుంచి తీసుకున్న అధిక మొత్తాన్ని వెనక్కు ఇచ్చేస్తున్నారు. ఎంత కాలం నుంచి ఇలాంటి బాగోతం నడుస్తోంది? ఎంత మొత్తాన్ని బ్యాంకు యంత్రాంగం రైతుల నుంచి దండుకుంది? అన్న ప్రశ్నలు ప్రస్తుతం రైతుల మదిలో తొలుస్తున్నాయి. కాగా ఇదే బ్యాంకులో నిక్కచ్చిగా నిలదీసిన ఖాతాదారుల నుంచి మాత్రం ఎంత మొత్తం చెల్లించాలో అంతే తీసుకున్నట్లు తెలుస్తోంది. అందుకు నల్లబల్లెకు చెందిన జి.పవన్ కుమార్‌రెడ్డి పేరును ఉదహరిస్తున్నారు.రూ.1లక్ష సిండికేట్ బ్యాంకులో పంట రుణం తీసుకుంటే రెన్యువల్‌లో రూ.1,03,500 మాత్రమే చెల్లించినట్లు సమాచారం.
వడ్డీ లేని రుణాలు కావడంతోనే..
వడ్డీ లేని పంట రుణాలు ప్రవేశపెట్టడంతో బ్యాంకు అసలు స్వరూపం బహిర్గతమైందని రైతులు చెబుతున్నారు. దశాబ్దాల తరబడి సిండికేట్ బ్యాంకుతో ఆర్థిక పరమైన ప్రత్యక్ష లావాదేవీలను ఆ ప్రాంతం వారు నిర్వహిస్తున్నారు. లక్ష చెల్లిస్తే వడ్డీలేని రుణం కారణంగా రెన్యువల్‌లో పంటల బీమా ప్రీమియం, సర్వీసు ట్యాక్స్ మాత్రమే తీసుకోవాల్సి ఉంది. ఆమేరకే వసూళ్లు చేస్తున్నామంటూ ముద్దనూరు సిండికేట్ బ్యాంకు ఖాతాదారులను నమ్మబలికింది. బ్యాంకర్లు చెప్పిన మేరకు మాత్రమే చెల్లింపులు చేస్తూ వచ్చారు.
అయితే ప్రీమియం చెల్లింపుల్లో తేడాను గుర్తించడంతో అసలు విషయం బహిర్గతమైంది. 3.5శాతం మాత్రమే ప్రీమియం వసూలు చేయాల్సి ఉండగా రెట్టింపు స్థాయిలో వసూలు చేశారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. ప్రశ్నించిన వారికి మాత్రం ఎవరెవరి దగ్గర అధిక మొత్తం తీసుకున్నామో వారందరికీ వెనక్కి ఇచ్చేస్తామని ఆ బ్యాంకు యంత్రాంగం చెప్పుకొస్తోంది. అయితే రైతులు మాత్రం ప్రస్తుతం గుర్తించినందున వెనక్కు ఇస్తామంటున్నారు. గతంలో కూడా ఇలాగే వసూలు చేశారు కదా.. వాటి మాటేమిటి అంటుండడంతో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి.
ఆర్బీఐ నిబంధనలు సైతం...
ఆర్బీఐ నిబంధనల ప్రకారం రూ.25 వేలు లోపు పంట రుణాలు తీసుకుంటే ప్రాసెసింగ్ చార్జీలు( సర్వీసు చార్జీ ) వసూలు చేయకూడదని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. బ్యాంకర్లు వాటిని అమలు పర్చి మరింత బాధ్యతాయుతంగా పని చేయాల్సి ఉంది. అయితే ముద్దనూరు సిండికేట్ బ్యాంకులో రూ.25వేల లోపు రుణాలకు కూడా సర్వీసు చార్జీలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. ప్రస్తుతం ముద్దనూరు సిండికేట్ బ్యాంకులో అతి కొద్దిమందికి మినహా అధిక శాతం మంది నుంచి ప్రీమియం చెల్లించాల్సిన దానికంటే అధికంగా వసూలు చేసుకున్నట్లు సమాచారం. ఈ లెక్కన లక్షలాది రూపాయలు స్వాహాకు గురైనట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఈ తతంగాన్ని ఛేదించాల్సిన లీడ్ బ్యాంకు కూడా మెతక ైవె ఖరి అవలంబిస్తోందని పలువురు పేర్కొంటున్నారు. ఈ విషయాన్ని లీడ్ బ్యాంకు మేనేజర్ నాగసుబ్బారెడ్డి దృష్టికి సాక్షి ప్రతినిధి తీసుకెళ్లగా రైతుల నుంచి వసూలు చేసిన అధిక మొత్తాన్ని వెనక్కు ఇవ్వాలని ఆదేశించనున్నట్లు తెలిపారు. అలా ఎందుకు వసూలు చేశారన్నదానిపై విచారణ చేసి వాస్తవాలను వెలుగులోకి తెస్తామని చెప్పారు.
నమ్మకంగా నొక్కేశారు..!
Published Mon, Dec 23 2013 2:48 AM | Last Updated on Sat, Sep 2 2017 1:51 AM
Advertisement