కేటులలో ఈ సిండి‘కేటు’ రూటే సెపరేటు..! | Syndicate Former Bank Manager Arrested in Scam Kadapa | Sakshi
Sakshi News home page

కేటులలో ఈ సిండి‘కేటు’ రూటే సెపరేటు..!

Published Thu, Jun 27 2019 9:18 AM | Last Updated on Thu, Jun 27 2019 9:18 AM

Syndicate Former Bank Manager Arrested in Scam Kadapa - Sakshi

సాక్షి, ఖాజీపేట(కడప) : ఖాజీపేట సిండికేట్‌ బ్యాంకు మాజీ మేనేజర్‌ చేతివాటం కారణంగా రూ. 2.22 కోట్లు అక్రమాలు జరిగాయి. ఈ అక్రమాల గుట్టు మేనేజర్‌ ఫిర్యాదుతో పోలీసుల పరిశోధనలో వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని అరెస్టు చేశారు. మరో కీలక నిందితుడు పరారీలో ఉన్నాడు. అయితే ఈ కేసులో కీలక సూత్రధారులు, పాత్రధారులు తెరవెనుక ఇంకా ఉన్నట్లు తెలుస్తోంది. వారంతా బయటకు వస్తారా లేక మేనేజర్‌ ఫిర్యాదు మేరకే పోలీసులు కేసు పరిశీలించి వదిలేస్తారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

సాధారణంగా చిన్న సంతకంలో తేడా వస్తేనే బ్యాంకు అధికారులు పైసా డబ్బు ఇవ్వరు. అలాంటిది ఖాజీపేట సిండికేట్‌ బ్యాంకు మాజీ మేనేజర్‌ జయంత్‌బాబు తన అధికారాన్ని ఉపయోగించుకుని అనేక అక్రమాలకు పాల్పడ్డారు. బ్యాంకును దళారులకు నిలయంగా చేసుకుని వారి సహకారంతో అడ్డదిడ్డంగా తనకు అనుకూలమైన వారికి రుణాలు ఇప్పించారు. దుకాణాలు లేక పోయినా వారు దొంగ బిల్లులు పెట్టినా , సాగుభూమి లేక పోయినా వ్యవసాయ రుణాలు ఇవ్వడం. ఇలా ముద్రరుణాలు, వ్యవసాయ రుణాలు ఇచ్చి  అనేక అక్రమాలకు పాల్పడ్డారు.  ముఖ్యంగా వ్యవసాయ రుణాల్లో దొంగ పాసుపుస్తకాలు, దొంగ 1బీలు తీసుకు రావడం వెనుక వీఆర్‌ఓల పాత్రపై చర్చ జరుగుతోంది.

వ్యవసాయ రుణాలు ఎలా ఇస్తారు
వ్యవసాయ రుణాలు తీసుకోవాలంటే తప్పనిసరిగా పాస్‌పుస్తకం తోపాటు 1బీ, ఆ రైతు ఆధార్‌కార్డు తీసుకు రావాలి. వాటిని పరిశీలించిన ఫీల్డ్‌ ఆఫీసర్‌ ఆన్‌లైన్‌లో 1బీ ని పరిశీలించిన తరువాత ఫైల్‌ను మేనేజర్‌కు పంపిస్తారు. ఆయన పరిశీలించిన తరువాత రైతుకు బ్యాంకు రుణం అందిస్తారు. అయితే బ్యాంకు అధికారులు అలాంటి నిబంధనలు అమలు చేయకుండానే రుణాలు మంజూరు చేశారు. ఇలా సుమారు 60కి పైగా వ్యవసాయ రుణాలను బ్యాంకు ద్వారా పొందినట్లు తెలుస్తోంది. 

ఎలా వచ్చాయి..?
సాధారణంగా పాసు పుస్తకాలు ఒక్క రెవెన్యూ అధికారుల ద్వారానే వస్తాయి. అలాగే 1బీ కావాలంటే రెవెన్యూ కార్యాలయం లేక మీసేవా కేంద్రాల్లో తీసుకోవచ్చు. కానీ అవి దళారుల చేతికి ఎలా వచ్చాయన్నది చర్చనీయాంశంగా మారింది. రెవెన్యూ శాఖలోని కొందరు సిబ్బంది దొంగ పాసు పుస్తకాలను తయారు చేయడంలో సిద్ధహస్తులుగా ఉన్నట్లు సమాచారం. గతంలో దొంగ పాసుపుస్తకాలపై అప్పటి జాయింట్‌ కలెక్టర్‌ శ్వేతాకు పలువురు  ఫిర్యాదు చేశారు. ఆమె బదిలీతో విచారణ అటకెక్కింది. నేడు అదే వ్యక్తులు బ్యాంకు దళారీలకు పాసుపుస్తకాలు అందించి ఉంటారన్న అనుమానాలు ఉన్నాయి. అలాగే బోగస్‌ 1బీ తయారీలో మీసేవా కేంద్రంలోని వారిపై అనేక  అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

మనకు తెలియకుండా రుణాలు
కొందరు వ్యక్తులకు సెంటు భూమిలేక పోయినా బ్యాంకులో వ్యవసాయ రుణాలు పొందడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. వారికి బ్యాంకు నోటీసులు రావడంతో అసలు కథ వెలుగులోకి వచ్చింది. మనకు తెలియకుండానే మన పేరుతో దొంగ  ఆధార్‌ కార్డులు, 1బీ, పాసు పుస్తకాలు పెట్టి దొంగ సంతకాలతో రుణాలు పొందినట్లు తెలుస్తోంది. మరికొందరు రూ. 20వేలు రుణం తీసుకుంటే వారి పేరుతో రూ. లక్ష లేక రూ.2లక్షలు రుణం తీసుకున్నట్లుగా రికార్డుల్లో నమోదు చేయడం లాంటి మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. రుణం తీసుకునే వ్యక్తి అకౌంట్లో నుంచి కాకుండా అంత పెద్ద మొత్తంలో అతనికి తెలియకుండా ఎలా డబ్బు తీశారన్నది అనేక అనుమానాలకు దారితీస్తోంది.

రెండేళ్లుగా బ్యాంకర్లు ఎందుకు చర్యలు తీసుకోలేదు
బ్యాంకులో అనేక అక్రమాలు 2015–16లో జరిగితే 2019 ఫిబ్రవరి 5న పోలీసులకు బ్యాంకు అధికారులు ఫిర్యాదు చేశారు. అంటే సుమారు రెండేళ్ల పాటు ఈ అక్రమాలపై ఉన్నతాధికారులు స్పందించలేదు. అలాగే 2016–17, 18 ఏడాదిల్లో  బ్యాంక్‌ ఆడిట్‌ జరుగుతుంది. ఆ ఆడిట్‌లో ఆడిటర్లు అక్రమాలను గుర్తించారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఒకవేళ గుర్తించి ఉంటే ఉన్నతాధికారులు చర్యలకు ఎందుకు  ఉపక్రమించలేదు. వీటన్నింటిపై పోలీసులు దృష్టి సారించి   విచారణ జరపాలని స్థానికులు కోరుతున్నారు. 

సమగ్ర విచారణ చేస్తున్నాం: సీఐ కంబగిరి రాముడు 
ఈ కేసును ఛాలెంజ్‌గా తీసుకుని విచారణ చేస్తున్నాం. అక్రమాలకు కారకులైన ఎవ్వరిని వదలం. దొంగ పాసుపుస్తకాలు మొదలు దుకాణాలు లేకుండానే ముద్ర రుణాలు తీసుకోవడం ఇలా అన్ని విషయాలను లోతుగా విచారిస్తున్నాం.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement