దొంగల ముఠా వివరాలను తెలియజేస్తున్న కడప డీఎస్పీ బి. వెంకట శివారెడ్డి
కడప అర్బన్: జిల్లాలోని పలు దేవాలయాల్లోకి రాత్రివేళ అక్రమంగా ప్రవేశించి హుండీలను పగులగొట్టి డబ్బులను దొంగిలిస్తున్న ముఠాను అరెస్ట్ చేసినట్లు కడప డిఎస్పీ బి. వెంకట శివారెడ్డి తెలిపారు. బుధవారం కడప డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దొంగల ముఠా వివరాలను డీఎస్పీ వెల్లడించారు. ఆరుగురు సభ్యులున్న ఈ ముఠాలో ఐదుగురు బాలనేరస్థులు ఉన్నారు.
వీరు పలు హుండీలలో దొంగిలించిన రూ. 56 వేలల్లో రూ.14,510 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ ఆదేశాల మేరకు ఆలయాల్లోని హుండీలను పగులగొట్టి డబ్బులను దొంగిలిస్తున్న ముఠాను పట్టుకునేందుకు స్పెషల్ క్రైమ్‌టీమ్‌లను ఏర్పాటు చేశామన్నారు. కడప నగరం గౌస్‌నగర్‌కు చెందిన షేక్ మస్తాన్ అలియాస్ సలీం(26)తో పాటు ఐదుగురు బాలనేరస్తులు ఉన్నారన్నారు.
దొంగతనం చేయాలనుకునే ప్రాంతాలకు బాడుగ ఆటోలలో వెళ్లి దేవాలయాలకు వేసిన తాళాలను ఆయుధాల సహాయంతో పగులగొట్టి అందులో ఉన్న హుండీలను పగులగొట్టి డబ్బులు చోరీ చేసి తమ చెడు అలవాట్లకు ఆ డబ్బును ఉపయోగించుకుంటున్నారన్నారు. గత ఏడాది ఏప్రిల్, మే నెలల్లో కడప, కాశినాయన, సిద్దవటం మండలాల్లోని 10 ఆలయాల్లోని హుండీలను పగులగొట్టి డబ్బులు దొంగతనం చేశారన్నారు.
ఈ దొంగతనాలకు సంబంధించి ఆయా పోలీస్‌స్టేషన్‌లలో కేసులు నమోదయ్యాయన్నారు. కేసు దర్యాప్తులో భాగంగా బుధవారం పోలీసులకు రాబడిన సమాచారం మేరకు రిమ్స్ సీఐ యు. సదాశివయ్య, ఎస్‌ఐ జె. మోహన్‌కుమార్ గౌడ్‌తో పాటు సిబ్బంది నగరంలోని చలమారెడ్డి పల్లె సర్కిల్ దగ్గర వోల్వో కంపెనీ బిల్డింగ్ పక్కన కంపచెట్ల వద్ద ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు.
వీరి వద్ద నుంచి వివిధ ఆలయాల్లోని హుండీల్లో దొంగిలించిన నగదు, ఆలయ తాళాలు, హుండీలను పగులగొట్టేందుకు వినియోగించే సామగ్రిని స్వాధీనం చేసుకున్నామన్నారు. అందరూ మద్యం సేవించడం, ఇతర చెడు అలవాట్లు కలిగి, ఎలాంటి పనులు చేయకుండా ఖాళీగా తిరుగుతూ ఉంటారన్నారు. ఐదుగురు బాలనేరస్థులను ప్రభుత్వ బాలుర గృహానికి తరలిస్తామన్నారు. దొంగలను అరెస్ట్ చేయడంలో కృషి చేసిన సీఐ, ఎస్‌ఐతో పాటు సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment