
మహబూబ్‌నగర్: పట్టపగలే ఆలయంలో హుండీ చోరీకి పాల్పడిన సంఘటన శనివారం వెలుగుచూసింది. ఎస్‌ఐ జగన్మోహన్ తెలిపిన వివరాలు.. మండలంలోని పాత కిష్టంపల్లిలోని ఆంజనేయ స్వామి ఆలయంలో దుండగులు హుండీని పగులగొట్టి రూ.రెండు లక్షలు నగదు, అలాగే వెండి నగలు అపహరించారు. ఆలయంలో పూజలు నిర్వహించడానికి శనివారం ఉదయం ఆలయ పూజారి సోములు వెళ్లాడు.
తాళాలు పగులగొట్టి ఉండటంతో హుండీని గమనించాడు. పగిలి ఉండటంతో వెంటనే సర్పంచ్‌తోపాటు ఆలయ కమిటీ సభ్యులకు తెలిపారు. వారు అక్కడికి చేరుకుని పోలీసులకు తెలిపారు. ఎస్‌ఐ జగన్మోహన్ సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఆలయంలో సీసీ కెమెరాలు ఉండటంతో పుటేజీని పరిశీలించారు. ఈ ఆధారాలను పోలీసులు స్వాధీనం చేసుకుని, విచారణ చేస్తున్నారు.
కారులో వచ్చి...
వికారాబాద్‌కు చెందిన అంబిరియా నానవత్ (టీఎస్ 34 టీఎ 0783) కారులో కిష్టంపల్లి ఆలయానికి చేరుకున్నారు. ఎవరూ లేకపోవడంతో ఆలయంలోకి చొరబడ్డారు. తాళాలు పగులగొట్టిన అనంతరం కారులో ఉన్న మహిళ ఆలయ గర్భగుడిలోకి వెళ్లి హుండీలోని నగదు తీసుకున్నారు.
కారు నంబర్‌ను పోలీసులు ట్రేస్ చేయగా కారు వికారాబాద్‌కు చెందిన అంబిరియా నానవత్ అనే వ్యక్తిదిగా గుర్తించారు. ఇదే కారుకు జూలై 3న నాగర్‌కర్నూల్ జిల్లా మన్ననూర్‌లో ఫైన్ వేసినట్లు గుర్తించారు. ఆలయ కమిటీ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్‌ఐ తెలిపారు.