
గంజాయి కేసులో అరెస్టయిన నిందితుల వివరాలను తెలియజేస్తున్న సీఐ ఎన్.వి నాగరాజు
కడప అర్బన్: కడప నగరంలోని వన్‌టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో శనివారం ఉదయం రాయల్‌థియేటర్ నుంచి గుర్రాల గడ్డకు వెళ్లే దారిలో పూల సరస్వతితో పాటు, మహమ్మద్ ఉమర్ అనే ఇద్దరు గంజాయిని విక్రయిస్తుండగా సీఐ ఎన్.వి నాగరాజు తమ సిబ్బందితో కలిసి అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 1 కిలో 200 గ్రాముల గంజాయి, మోటార్‌సైకిల్, రూ. 13,370 నగదు స్వాధీనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా శనివారం పోలీస్‌స్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీఐ నిందితుల వివరాలను తెలియజేశారు. మాసాపేటకు చెందిన పూల సరస్వతి గతంలో కూడా గంజాయిని విక్రయిస్తూ పట్టుబడిందన్నారు. ప్రస్తుతం తారకరామనగర్‌లో ఉంటూ, అక్కాయపల్లెకు చెందిన మహమ్మద్ ఉమర్‌తో కలిసి గంజాయిని విశాఖ జిల్లా నుంచి తెప్పించుకుని, మత్తుకు అలవాటైన యువతకు సరఫరా చేస్తున్నారనే సమాచారం రావడంతో దాడి చేసి పట్టుకున్నామన్నారు. వీరిని అరెస్ట్ చేయడంలో కృషి చేసిన సిబ్బందిని సీఐ అభినందించారు.