Lionel Messi: ఫుట్‌బాల్ అభిమానులకు, మెస్సీ ఫ్యాన్స్‌కు మింగుడుపడని వార్త ఇది. స్టార్ ఆటగాడు, ప్రపంచంలోనే రిచ్చెస్ట్ ప్లేయర్ లియోనెల్ మెస్సీకి ఊహించని పరిణామం ఎదురైంది. 21 ఏళ్ల సుదీర్ఘ బార్సిలోనా క్లబ్(Catalan club) పయనం ముగిసింది. ఇకపై ఈ స్పెయిన్ క్లబ్ తరపున మెస్సీ ఆడబోవడం లేదు. ఆర్థికపరమైన ఇబ్బందుల వల్ల ఆయనతో కాంట్రాక్ట్ రెన్యువల్ చేసుకునేందుకు సుముఖంగా లేమని క్లబ్ ప్రకటించింది. ఈ మేరకు గురువారం మధ్యాహ్నం క్లబ్ తరపు అధికారిక సమాచారం వెలువడింది. దీంతో సాకర్ అభిమానులు నివ్వెరపోతున్నారు.
నిజానికి క్లబ్‌తో మెస్సీ కాంట్రాక్ట్ ముగిసి చాలా రోజులే అవుతోంది. ఈ నేపథ్యంలో కొన్ని క్లబ్‌లు పోటాపోటీ పడగా.. అర్జెంటీనా ఫుట్‌బాల్ మాంత్రికుడు తమతోనే కొనసాగుతాడని క్లబ్ చెబుతూ వస్తోంది. ఇదిలా ఉంటే కోపా అమెరికా 2021 అర్జెంటీనా విక్టరీ తర్వాత.. మెస్సీ సెలవుల్లో ఉన్నాడు. తిరిగి బుధవారం క్లబ్‌లో చేరాడు. దీంతో ఈ వారాంతంలో కాంట్రాక్ట్ రెన్యువల్ ఉండొచ్చని కథనాలు వెలువడ్డాయి. ఇంతలోపే మెస్సీతో బంధం ముగిసిందని బార్సిలోనా ప్రకటించడం ఫుట్‌బాల్ అభిమానుల్ని విస్మయానికి గురి చేసింది.
చదవండి: ఏం తమాషాగా ఉందా?
అయితే వ్యక్తిగత కారణాలతో కిందటి ఏడాదే మెస్సీ.. బార్సిలోనా నుంచి బయటకు వచ్చేయాలని ప్రయత్నించాడు. అయితే అప్పుడే క్లబ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు తీసుకున్న జోవాన్ లపోర్టా.. మెస్సీని బతిమాలి కొనసాగేలా చూశాడు. తిరిగి ఈ ఏడాది జూన్ 30న మెస్సీ -బార్సిలోనా క్లబ్ ఒప్పందం ముగియగా.. 1 బిలియన్ డాలర్ల అప్పుల్లో క్లబ్ కూరుకుపోవడం, పైగా కరోనా దెబ్బకి ఆర్థికంగా కుదేలుకావడంతో కాంట్రాక్ట్ రెన్యువల్ అయ్యేనా? అనే అనుమానాలు తలెత్తాయి. అయితే లపోర్టా మాత్రం మరో ఐదేళ్లు మెస్సీ తమతోనే కొనసాగుతాడంటూ కాన్ఫిడెంట్‌గా ప్రకటనలు ఇచ్చాడు.
ఈ తరుణంలో నిన్న(గురువారం) ఉదయం క్యాంప్‌నౌ స్టేడియం దగ్గర జరిగిన చర్చల అనంతరం.. మెస్సీ కాంట్రాక్ట్ ముగిసినట్లు క్లబ్ ఈ ప్రకటన చేయడం విశేషం. 50 శాతం కోతలు, ఒప్పందంలో క్లబ్ కండిషన్లకు మెస్సీ విముఖత వ్యక్తం చేయగా.. కాంట్రాక్ట్ రద్దుకే క్లబ్ మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. 13 ఏళ్ల వయసులో బార్సిలోనా క్లబ్ యూత్ వింగ్‌లో చేరిన మెస్సీ.. 16 ఏళ్లకు క్లబ్ జట్టులో చేరాడు. ఈ స్పెయిన్ క్లబ్ తరపున 778 మ్యాచ్‌లు ఆడి.. 672 గోల్స్‌తో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇదిలా ఉంటే బార్సిలోనా నుంచి తన ఎగ్జిట్‌పై మెస్సీ ఎలా స్పందిస్తాడో చూడాలి. ప్రస్తుతం ఫ్రీ ఏజెంట్‌గా ఉన్న మెస్సీ.. ఏ క్లబ్‌లో చేరేది త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment