3 లక్షల వాహనాలకు రూ.1000 చొప్పున చలానా....
విధించిన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు
త్వరలో హైదరాబాద్‌లో శ్రీకారానికి కసరత్తు
దేశంలోనే తొలిసారిగా అమలు
మియాపూర్‌కు చెందిన రవీందర్ కారు ఇన్సూరెన్స్ గడువు ముగిసింది. కారు రోడ్డెక్కితే చలానా పడుతుందని, నేడో..రేపో ఇన్సూరెన్స్ రెన్యూవల్ చేశాక కారును బయటకు తీద్దామని ఇంట్లోనే ఉంచాడు. ఈలోగా సైబరాబాద్ పోలీసుల నుంచి రూ.1000 చలానా కట్టాలని రవీందర్ ఇంటికి రసీదు చేరింది. తాను కారును రోడ్డుపైకి తీసుకెళ్లకున్నా... ఇన్సూరెన్స్ గడువు ముగిసిన వంటనే చలానా విధించడాన్ని చూసిన ఆయన ఆశ్చర్యపోయాడు. ఇలా ఒక్క రవీందరేకాదు... నెల రోజుల వ ్యవధిలో సుమారు మూడు లక్షల వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు చలానా విధించారు. కారు రోడ్డుమీద తిరగకున్నా...ఇంట్లో ఉన్నా గడువులోగా ఇన్సూరెన్స్ రెన్యూవల్ చేసుకోకుంటే ఆటోమెటిక్‌గా చలానా బారిన పడడం ఖాయమని...ఇలా చలానా విధించే అధికారం తమకు మోటారు వాహనాల చట్టం (196) కల్పించిందని పోలీసులు చెబుతున్నారు. ఇదే విధానాన్ని నగర ట్రాఫిక్ పోలీసులు కూడా అమలు చేసేందుకు కసరత్తు ప్రారంభించారు. అయితే..ఇన్సూరెన్స్ గడువు ముగిసి..రెన్యూవల్ చేసుకోకుండా ఇంట్లో ఉన్న వాహనానికి చలానా విధించే అధికారం లేదని, కేవలం రోడ్డుపై తిరిగే వాహనాలకు మాత్రమే చలానా విధించాలని మోటారు వాహనాల చట్టం చెబుతోంద ని హైదరాబాద్ సంయుక్త రవాణా కమిషనర్ రఘునాథ్ పేర్కొన్నారు. ఒకపక్క ట్రాఫిక్ పోలీసులు చట్టం ప్రకారమే చలానా వేస్తున్నామంటుండగా.. మరోపక్క ఆ ఆధికారం పోలీసులకు లేదని రవాణా శాఖ అధికారులు స్పష్టం చేస్తుండటంతో వాహనదారుల్లో గందరగోళం నెలకొంది.
బాధితులకు ఇన్సూరెన్సే ఆసరా...
రోడ్డు ప్రమాదాల్లో మృతులు, క్షతగాత్రుల కుటుంబాలకు ఊరట కలిగించేది ప్రమాదానికి కారణమైన వాహన థర్డ్‌పార్టీ ఇన్సూరెన్స్ మాత్రమే. వాహనానికి ఇది లేకపోతే మృతులు, క్షతగాత్రుల కుటుంబాలు తీవ్రంగా నష్టపోవాల్సిందే. సైబరాబాద్‌లో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలలో 33 శాతం వాహనాలు ‘థర్డ్‌పార్టీ ఇన్సూరెన్స్’ రెన్యూవల్ చేసుకోలేదని దర్యాప్తులో తేలింది. ఫలితంగా బాధితులు నష్టపోవాల్సి వచ్చింది. దీనికి చెక్‌పెట్టేందుకు సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్, ట్రాఫిక్ డీసీపీ అవినాష్ మహంతిలు థర్డ్‌పార్టీ ఇన్సూరెన్స్ చేసుకోని వాహనదారులపై కొరడా జులిపిస్తున్నారు. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఉన్న అన్ని రకాల వాహనాలకు సంబంధించిన (బైక్, ఆటో, కారు, జీపు, లారీ, డీసీఎం, భారీ వాహనాలు) ఇన్సూరెన్స్ డేటాను ఇన్సూరెన్స్ ఇన్‌ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా (ఐఐబీఐ) నేతృత్వంలోని ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ అథారిటీ (ఐఆర్‌ఏ) నుంచి తెప్పించుకున్నారు. ఈ డేటా ఆధారంగా ఇన్సూరెన్స్ రెన్యూవల్ చేసుకోని వాహనదారులకు రూ.1000 చొప్పున చలానా విధిస్తున్నారు.
హెచ్చరిక చేసి ఉంటే బాగుండేది...
పోలీసులు, రవాణా అధికారుల పరస్పర విరుద్ధమైన ప్రకటనలతో వాహనదారుల్లో గందరగోళం నెలకొంది. దీంతో చలానా భారిన పడకుండా ఎలా తప్పించుకోవాలో తెలియక వాహనదారులు సతమతమవుతున్నారు. కనీసం ఇలాంటి విధానం అమలుచేసే ముందు హెచ్చరికలు పంపితే కొంతమేరైనా తమకు వెసులుబాటు ఉండేదంటున్నారు.
బాధితులకు ఊరట కల్పించేందుకే...
థర్డ్‌పార్టీ ఇన్సూరెన్స్ లేని వాహనాల వల్ల రోడ్డు ప్రమాద బాధితులు నష్టపోతున్నారు. ఇన్సూరెన్స్ రెన్యూవల్ చేసుకోని ప్రతి వాహనానికి చలానా వేస్తున్నాం. ఇన్యూరెన్స్ లేని వాహనం రోడ్డు ఎక్కాలి.. తనిఖీల్లో మేం పట్టుకోవాలనేది లేదు. డేటా బేస్ ఆధారంగా చలానాలు విధించే అధికారం మోటారు వాహన చట్టం మాకు కల్పించింది. ఇలా చేయడం వల్ల వాహనదారులు బీమా గడువు ముగియకముందే అప్రమత్తమై రెన్యూవల్ చేసుకుంటారు. తద్వారా బాధితులకు కనీస న్యాయం జరుగుతుంది. - మహంతి,ట్రాఫిక్ డీసీపీ
చలానా విధించే అధికారం లేదు
థర్డ్‌పార్టీ ఇన్సూరెన్స్ చేయడం వాహనదారుడి బాధ్యత. ఆ ఇన్సూరెన్స్‌లేని వాహనాలు రోడ్డుపై తిరిగినప్పుడు మాత్రమే చలానా వేసే అధికారం అధికారులకు ఉంది. ఇన్సూరెన్స్ రెన్యూవల్ చేసుకోకుండా ఇంట్లోనే ఉన్న వాహనాలకు చలానా విధించే అధికారం మోటారు వాహన చట్టంలో లేదు.
- రఘునాథ్, ఆర్టీఏ జాయింట్ కమిషనర్
బీమా గడువు దాటితే బాదుడే..!
Published Tue, Dec 9 2014 12:02 AM | Last Updated on Sat, Sep 2 2017 5:50 PM
Advertisement
Advertisement