రెన్యువల్‌కూ రేటు!
ఎయిడెడ్ స్కూళ్లకు ముడుపుల బెడద
రెన్యువల్ కాకపోతే జీతాలు బంద్
ఉసూరుమంటున్న ఉపాధ్యాయులు
విశాఖపట్నం: ఎయిడెడ్ స్కూళ్లకు అవినీతి బెడద పట్టుకుంది. మామూళ్లు ఇస్తేనే తప్ప రెన్యువల్ జరగని పరిస్థితి నెలకొంది. అలా రెన్యువల్ పూర్తికాని పాఠశాలల ఉపాధ్యాయులకు జీతాలు నిలిచిపోయే ప్రమాదంలో పడుతున్నాయి. దీంతో ఆయా ఎయిడెడ్ స్కూళ్ల టీచర్లు జీతాలందక నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎయిడెడ్ పాఠశాలలకు రెన్యువల్ ర్దిష్టంగా ఉండడం లేదు. ఏటా కొన్ని, రెండేళ్లకు కొన్ని రెన్యువల్ చేసుకోవలసినవి మరికొన్ని ఉన్నాయి. పలుకుబడి ఉన్నవారు, ప్రయివేటు స్కూళ్ల వారు రెన్యువల్ విషయంలో ‘అడిగినవి’ సమర్పించుకోవడంతో ఏమంత అవస్థలు పడడం లేదు. కానీ ఏడాదికో, రెండేళ్లకో రెన్యువల్ చేయించుకోవలసి వస్తున్న చోటా, మోటా స్కూళ్ల వారు చిక్కుల్లో పడుతున్నారు. రెన్యువల్ చేయించుకోవాలంటే సంబంధిత స్కూలు స్థల పత్రాలు, ప్లాన్, లీజు ఆధారాలు, ఫైర్ సర్టిఫికెట్లు, పారిశుధ్య పరిస్థితి, ఆట స్థలం వంటివి సమర్పించాలి. వీటన్నిటినీ రీజనల్ జాయింట్ డెరైక్టర్ (ఆర్జేడీ)కు పంపుతారు. ఆర్జేడీ సంతృప్తి చెందాక రెన్యూవల్ చేస్తారు. కానీ జీవీఎంసీ, ఫైర్, డీఈవో కార్యాలయాల్లో సంబంధిత సిబ్బంది చేతులు తడిపితేనే తప్ప రెన్యూవల్ ఫైళ్లు కదలడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
దీంతో రెన్యువల్ నోచుకోని స్కూళ్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు జీతాలు రావడం లేదు. సకల హంగులూ ఉన్న పెద్ద ఎయిడెడ్ స్కూళ్లు, ప్రయివేటు పాఠశాలల నిబంధనలనే రేకుల షెడ్లు, సాదాసీదా భవనాల్లో నడుస్తున్న వాటికీ వర్తింప చేస్తూ పితలాటకం పెడుతున్నారని ఈ టీచర్లు వాపోతున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఒక్కో స్కూలు రెన్యూవల్‌కు స్థాయిని బట్టి 30 వేల నుంచి లక్ష రూపాయల వరకూ ముడుపులు సమర్పించుకోవలసి వస్తోందని చెబుతున్నారు. ఈ మొత్తాన్ని భరించే వారికి నిరభ్యంతరంగా రెన్యువల్ అయిపోతోందంటున్నారు. ఆ స్తోమతు లేని స్కూలు యాజమాన్యాలు ముడుపులు చెల్లించడానికి ముందుకు రావడం లేదు. ఫలితంగా రెన్యువల్ నిలిచిపోయి గుర్తింపు (రికగ్నైజేషన్)కు ఎసరొచ్చే పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో ఆరేడు నెలలుగా కొన్ని ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు జీతాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం ఇప్పుడు జీతాల గ్రాంటును మంజూరు చేసినా స్కూళ్లు రెన్యువల్ కాకపోవడం వల్ల వారు వాటిని పొందే అవకాశం లేదు. ఫలితంగా ఈ టీచర్లంతా అటు జీతాల్లేక, త్వరలో అందుకునే వీలు లేక, తమ గోడు ఎవరితో చెప్పుకోవాలో తెలియక త్రిశంకు స్వర్గంలో ఉన్నారు.