వాషింగ్టన్ : భారత్ నుంచి వచ్చే వారితో సహా వలసదారులకి ప్రయోజనం చేకూరేలా అమెరికాలోని బైడెన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్–1బీ వీసాదారుల జీవిత భాగస్వామ్యులకు (భర్త/భార్య) ఆటోమేటిక్‌గా వర్క్ ఆథరైజేషన్ కల్పించడానికి అంగీకరించింది. అమెరికాలో ఉద్యోగాలు చేయాలనుకునే ఐటీ నిపుణుల భార్యలకి ఈ నిర్ణయంతో ఎంతో ఊరట లభించింది.
అమెరికా సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్) హెచ్–1బీ వీసా కలిగిన వారి కుటుంబ సభ్యులు (భార/భర్త, 21 ఏళ్ల వయసులోపు పిల్లలు)కి హెచ్–4 వీసా జారీ చేస్తుంది. ఈ వీసాదారులు అమెరికాలో ఉద్యోగం చేయాలనుకుంటే ఎంప్లాయ్‌మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ (ఈఏడీ) కలిగి ఉండాలి. దీనిని ఎప్పటికప్పుడు వారు పొడిగించుకుంటూ ఉండాల్సి వస్తుంది. ఇకపై అలాంటి బాధ లేకుండా ఉద్యోగం చేయడానికి వీలుగా ఆటోమేటిక్ వర్క్ ఆథరైజేషన్‌తో కూడిన హెచ్–4 వీసాను మంజూరు చేయడానికి బైడెన్ సర్కార్ పచ్చ జెండా ఊపింది. ఈ నిర్ణయంతో భారత్ నుంచి వెళ్లే మహిళలకే అత్యధికంగా లబ్ధి చేకూరనుంది.
ఈఏడీని పొడిగించుకోవడాన్ని సవాల్ చేస్తూ హెచ్–4 వీసాదారుల తరఫున అమెరికన్ ఇమ్మిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్ (ఏఐఎల్‌ఏ) కోర్టులో పిటిషన్ వేసింది. ‘హెచ్–4 వీసాదారులు తరచూ రెగ్యులేటరీ పరీక్ష ఎదుర్కోవాలి. అయితే గతంలో హోంల్యాండ్ ఏజెన్సీ వారికి ఉద్యోగం రాకుండా నిషేధం విధించింది. దీంతో రీ ఆథరైజేషన్ కోసం ఎందరో ఎదురు చూస్తున్నారు. ఎలాంటి చట్టపరమైన కారణాలు లేకుండా వారు అత్యధిక వేతనాలు వచ్చే ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తోంది’అని ఏఐఎల్‌ఏ లాయర్ జాన్ వాస్డెన్ చెప్పారు. దీనిపై బైడెన్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ప్రస్తుతం 90 వేలమందికి పైగా హెచ్–4 వీసాదారులకు వర్క్ ఆథరైజేషన్ ఉంది.
Comments
Please login to add a commentAdd a comment