సాక్షి, న్యూఢిల్లీ : తండ్రి అనారోగ్యాన్ని అడ్డుపెట్టుకుని కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి. పైగా ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయాక వారిని ఆదుకుంటానని నమ్మబలికి ఆర్థికంగా దోచుకున్నాడు. చివరకు యువతి ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
దక్షిణ ఢిల్లీలో 12వ తరగతి చదవుతున్న సదరు యువతి తండ్రి మద్యానికి బానిసై ఆరోగ్యం పాడు చేసుకున్నాడు. దీంతో ఆయన్ని గతేడాది జూలైలో ఘజియాబాద్‌లోని హ్యాపీ హోమ్స్ రిహాబ్ సెంటర్‌కు తరలించి చికిత్స అందించటం మొదలుపెట్టారు. ఈ క్రమంలో దాని నిర్వాహకుడి కన్ను యువతిపై పడింది. ఆ వ్యక్తిని చేర్చిన రెండు రోజుల తర్వాత వారి ఇంటికి ఫోన్ చేసి ‘‘నీ తండ్రి మానసిక స్థితి బాగోలేదు. మాట్లాడాలి వెంటనే రావాలి’’ అంటూ యువతిని కోరాడు.
తన తల్లి ఇంట్లో లేదని.. ఒక్కదాన్ని అంత దూరం రాలేనని యువతి చెప్పటంతో, దగ్గర్లోని మహిపాల్‌పూర్‌లోని హోటల్‌కు వెళ్లి అక్కడ మానసిక వైద్యుడ్ని కలవాలంటూ సూచించాడు. అత్యవసర పరిస్థితి కావటంతో యువతి అతను చెప్పినట్లే వెళ్లి ఆ వైద్యుడ్ని కలిసింది. మాటల మధ్యలో ఆమెకు మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్ ఇవ్వటంతో స్పృహ కోల్పోగా.. రిహాబ్ సెంటర్ నిర్వాహకుడు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. విషయం ఎవరికైనా చెబితే ఆమె తండ్రిని చంపేస్తానని.. నగ్న ఫోటోలు బయటపెడతానని యువతిని బెదిరించాడు. ఆపై వాటి సాకుతో మరికొంత కాలం ఆమెపై అత్యాచార పర్వం కొనసాగించాడు.
ఈ ఏడాది జనవరిలో చికిత్స పొందుతూ ఆమె తండ్రి చనిపోవటంతో.. ఈసారి ఆ నిర్వాహకుడు కొత్త డ్రామా మొదలుపెట్టాడు. వారి కుటుంబానికి అండగా ఉంటానని నమ్మబలికి వారి రవాణా వ్యాపారాన్ని చూసుకోవటం ప్రారంభించాడు. అయితే వచ్చే ఆదాయంలో పైసా కూడా వారికి ఇవ్వకుండా సతాయించటంతో మోసపోయామన్న విషయం ఆ కుటుంబానికి ఆలస్యంగా అర్థమైంది. చివరకు ధైర్యం చేసిన యువతి తనపై జరిగిన దాష్టీకాన్ని తల్లికి వివరించటంతో వారు పోలీసులను ఆశ్రయించారు. నిందితుడిపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేసిన పోలీసులు.. ఇంతవరకు అతన్ని అరెస్ట్ చేయకపోవటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment