
దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం సాయంత్రం నుంచి ఒక్కసారిగా వాతావరణం మారింది. నోయిడా-ఘజియాబాద్‌లో ఉన్నట్టుండి వర్షం కురిసింది. బలమైన గాలులతో పాటు ఢిల్లీ ఎన్‌సీఆర్‌లోని కొన్ని ప్రాంతాల్లోనూ వర్షం కురిసింది. మరికొన్ని చోట్ల చినుకులు పడ్డాయి.
గత కొన్నాళ్లుగా ఎండ వేడిమితో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఈ వర్షంతో కొంత ఉపశమనం లభించింది. కాగా ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లో నేడు (గురువారం) పగటిపూట తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ సమయంలో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని, ఇది ఉష్ణోగ్రతను తగ్గిస్తుందని పేర్కొంది. వర్షాలు కురవనున్న నేపధ్యంలో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో గంటకు 25 నుంచి 35 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన చినుకులు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గత రాత్రి 12 గంటల తర్వాత ఎన్‌సీఆర్‌లో బలమైన గాలులు వీచాయి. హాపూర్‌లోని సింబావోలిలో ఎనిమిది గంటలపాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.