బక్కచిక్కిన పశువులకు మంచి రోజులు
♦ నల్లవాగులో పునరావాస కేంద్రం ఏర్పాటు
♦ దక్షిణ భారత దేశంలోనే తొలికేంద్రం
♦ మొదటిరోజు తరలివచ్చిన మూడువేల పశువులు
♦ తొలకరి మొదలయ్యే వరకు కొనసాగింపు
ఎన్నాళ్లకెన్నాళ్లకు... మూగజీవాలకూ మంచి రోజులొచ్చాయి. ఓవైపు కరువు మరోవైపు మండుటెండలతో పశువులు అల్లాడుతున్నాయి. గ్రాసం, నీరు దొరక్క బక్కచిక్కిపోతున్నాయి. ఇప్పటికే వందలాది పశువులు మృత్యువాత పడ్డాయి. మరికొన్ని కబేళా బాటపడుతున్నాయి. పశువుల దీనస్థితిని గుర్తించి న ప్రభుత్వం పునరావాస కేంద్రాన్ని ప్రారంభించింది. దక్షిణ భారత దేశంలో ఎక్కడా లేని విధంగా కల్హేర్ మండలం నల్లవాగు ప్రాజెక్టు ఒడ్డున ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని ఖేడ్ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. పదివేల పశువులు పునరావాసం పొందేందుకు వీలుగా ఏర్పాట్లు చేయగా మొదటిరోజు మూడు వేలవరకు వచ్చాయి. ప్రాజెక్టు ఒడ్డున టెంట్లు వేసి నీడ, దాణాతోపాటు సకల వసతులు కల్పించారు. - కల్హేర్
కల్హేర్: నల్లవాగు ప్రాజెక్టులో నీళ్లు ఉండటం కేంద్రం ఏర్పాటుకు అనుకూలంగా మారింది. ఫలితంగా నియోజకవర్గంలోని నారాయణఖేడ్, పెద్దశంకరంపేట, మనూర్, కంగ్టీ, కల్హేర్ మండలాల్లోని పశువులకు ప్రయోజనం చేకూరింది. పశుసంవర్దక శాఖ అధికారులు ఇక్కడ అన్ని సౌకర్యాలు కల్పించారు. తొలకరి వర్షాలు వచ్చాక అంటే దాదాపు జూన్ మొదటి వారం వరకు కేంద్రం కొనసాగనుంది. ఎండ తగలకుండా టెంట్లు, నీటితొట్లు, ఒక్కో పశువుకు రోజుకు 5 కిలోల ఎండుగడ్డి ఉచితంగా అందించనున్నారు.
అంతేకాదు 50 శాతం సబ్సిడీపై దాణా పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికే 22 మె ట్రిక్ టన్నుల ఎండుగడ్డి, కావాల్సినంత దాణా సిద్ధంగా ఉంచారు. పాలిచ్చే గేదెలు, ఆవుల కోసం ప్రత్యేకంగా విజయ డెయిరీ తరపున పాలకేంద్రం నిర్వహణతో పాటు వాటి ఆరోగ్యం కాపాడేందుకు డాక్టర్లను నియమించారు. పాడి యజమానుల ఆరోగ్య సంరక్షణ కోసం వైద్య సిబ్బంది, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచనున్నారు. రాత్రిళ్లు ఇక్కడ ఉండేవా రు ఇబ్బంది పడకుండా కరెంటు అందించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే విద్యుత్తు స్తంభాలు ఏర్పాటుచేస్తున్నారు.
అంచనాలకు మించి పశువులు
కేంద్రానికి తరలివచ్చే పశువుల వివరాలను అధికారులు నమోదు చే స్తున్నారు. మొదటి రోజే అంచనాలకు మించి మూడు వేలకు పైగా పశువులు తరలివచ్చాయి. మొత్తం పదివేల మూగజీవాలు పునరావాసం పొందేందుకు సౌకర్యాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. కేంద్రం ఏర్పాటుపై ఖేడ్ నియోజకవర్గ రైతన్నలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
పశువులకు మంచి జరుగుతుంది
నల్లవాగులో పశువుల కోసం కేంద్రం పెట్టడంతో వాటికి మంచి జరుగతది. చెరువులు, కుంటల్ల నీళ్లు లేవు. రోజు గట్ల వైపు తిరిగి మేపినా గ్రాసం దొరుకతలేదు. అందుకే ఇక్కడికి బర్రెలు, ఆవుల్ని తోలుకొచ్చిన. - మల్లయ్య, సిర్గాపూర్
బతికించుకుంటాం
కరువులో నాలా చాలా మంది రైతులు పశువులను కాపాడుకునేందు కు చాలా ఇబ్బందులు ప డుతున్నరు. నల్లవాగులోని కేంద్రంలో పశువులు తీసుకొచ్చిన. పశువులను బతికించకుంటాం. - రాజు, ముబారక్‌పూర్
సరిపడా స్టాక్
పునరావాస కేంద్రంలో పశువులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. సకల వసతులు కల్పించాం. ఎండుగడ్డి, దాణా సరఫరా చేస్తున్నాం. ఇప్పటికే సరిపడా స్టాక్ ఉంది. - లక్ష్మారెడ్డి, పశుసంవర్ధక శాఖ జేడీ