అంతరించి పోతున్న జంతు జాతికి చెందిన 2 కృష్ణ జింకల (బ్లాక్‌బక్) కళేబరాలు, మాంసం స్వాధీనం చేసుకున్నట్టు
నిందితుల అరెస్టు: చీఫ్ వైల్డ్‌లైఫ్ వార్డెన్
సాక్షి, హైదరాబాద్: అంతరించి పోతున్న జంతు జాతికి చెందిన 2 కృష్ణ జింకల (బ్లాక్‌బక్) కళేబరాలు, మాంసం స్వాధీనం చేసుకున్నట్టు చీఫ్ వైల్డ్‌లైఫ్ వార్డెన్ మనోరంజన్ భాంజా వెల్లడించారు. వీటితోపాటు ఆరు బూడిద రంగు కుందేళ్లు, ఆరు కంజు పిట్టలు, 27 బుడక పిట్టలు, పాము మెడ కలిగిన కొంగ, అడవిబాతు (నీటి) కళేబరాలు కూడా స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వీటి మాంసాన్ని అమ్ముతున్న పాతబస్తీకి చెందిన సయ్యద్ జమీర్‌ను, సరఫరా చేసిన మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలోని దండుపల్లికి చెందిన రాజేశ్‌లను సోమవారం రాత్రి పోలీ సులు అరెస్ట్ చేసినట్లు చెప్పారు. స్వాధీనం చేసుకున్న కళేబరాలు, నిందితులను మంగళవారం అరణ్యభవన్‌లో మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. ట్రాన్సిట్ రిమాండ్ కింద అటవీ అధికారులు వీరిని ప్రశ్నిస్తున్నారని భాంజా తెలిపారు.
వైల్డ్‌లైఫ్ ఓఎస్‌డీ శంకరన్, హైదరాబాద్ జిల్లా అటవీ అధికారి సీపీ వెంకటరెడ్డితో కలసి ఆయన మీడి యాతో మాట్లాడుతూ... వన్యప్రాణి సంరక్షణ చట్టంలోని షెడ్యూల్ ఒకటిలో ఉన్న కృష్ణజింకలను చంపిన వారికి, కనీస జరిమానా రూ.10వేలు మొదలుకుని ఎంతైనా వేయవచ్చునని, నాన్‌బెయిలబుల్ కేసు కింద మూడేళ్ల నుంచి ఏడేళ్ల వరకు శిక్ష విధించవచ్చని చెప్పారు. భూపాలపల్లి జిల్లాలో చోటు చేసుకున్న జింకల వేట తదనంతర పరిణామాల పట్ల అటవీశాఖ పారదర్శకంగా వ్యవహరిస్తోందన్నారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యా లయంలోని అటవీ ప్రాంతంలో చోటు చేసుకుంటున్న జింకలు, ఇతర జంతువుల వేటపై వీసీ, సీఎస్‌ఓతో చర్చిం చినట్లు ఓఎస్‌డీ శంకరన్ తెలిపారు. వర్సిటీలో 400 ఎకరాల అటవీ భూమిలో పచ్చగడ్డి, నీటిని ఏర్పాటు చేసి జంతువులను అక్కడకు తరలించాలని వర్శిటీ అధికారులకు సూచించామన్నారు.