మంత్రిగారి ఫోన్‌తో మారిన సీన్‌ | Doubts loom large over deer hunting episode | Sakshi
Sakshi News home page

మంత్రిగారి ఫోన్‌తో మారిన సీన్‌

Published Sat, Mar 25 2017 3:26 AM | Last Updated on Tue, Sep 5 2017 6:59 AM

వేటగాళ్లు చంపిన జింకలు.. కారులో లభించిన ఫొటోలు (ఫైల్‌)

వేటగాళ్లు చంపిన జింకలు.. కారులో లభించిన ఫొటోలు (ఫైల్‌)

వేటగాళ్లను వదిలేయాలంటూ హుకుం
తూచా  పాటించిన అటవీశాఖ సిబ్బంది
ఆయుధాలతో పారిపోయిన వేటగాళ్లు
విచారణలో కనుమరుగవుతున్న వాస్తవాలు


సాక్షి, భూపాలపల్లి: మహదేవపూర్‌ అడవుల్లో జరిగిన జింకల వేట కేసులో నిందితులను కాపాడటం వెనుక ఓ మంత్రి హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రి ఫోన్‌ కాల్‌తో మొత్తం సీన్‌ మారిపోయినట్లు సమాచారం. అసలు రాత్రి జరిగిన సంఘటనకు, తెల్లవారిన తర్వాత అధికారులు చెప్పిన మాటలకు పొంతన లేకుండా పోయాయి. రాష్ట్ర కేబినెట్‌లో ఓ ముఖ్య నేతకు చెందిన వ్యక్తులు 19న పలిమెల మండలం అడవుల్లో వేటాడేందుకు వచ్చినట్లు సమాచారం. పక్కా సమాచారంతో ఫారెస్టు అధికారులు దాడి చేశారు.

అంబట్‌పల్లి వద్ద అధికార పార్టీకి చెందిన స్థానిక నేత ఇంట్లోని పశువుల కొట్టంలో దాక్కున్న వేటగాళ్లను అదుపులోకి తీసుకున్నారు. ఇంతలో ఆదిలాబాద్‌ జిల్లాలో బీసీ వర్గానికి చెందిన ఓ మంత్రి నుంచి సంఘటన స్థలంలో ఉన్న స్థానిక నేతకు ఫోన్‌ రాగానే.. అతను సదరు ఫోన్‌ను అటవీ అధికారులకు ఇచ్చినట్లు సమాచారం. మంత్రి ఏం చెప్పారో గానీ, క్షణాల్లో అటవీ అధికారుల వైఖరి మారిపోయింది.  రెండు దుప్పుల కళేబరాలను విస్టా వాహనం డిక్కీలో బలవంతంగా కుక్కారు. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలు కనిపించకుండా పోయాయి. ఈ క్రమంలో విస్టా వాహనం అక్కడే వదిలేసి, ఎర్ర జిప్సీలో వేటగాళ్లు దర్జాగా వెళ్లిపోయారు.

ఫోన్‌కు ముందు హైడ్రామా
ఫారెస్టు అధికారులు దాడి చేసిన విషయం తెలియగానే సర్వాయిపేటలో దావత్‌లో ఉన్న అధికార పార్టీకి చెందిన స్థానిక నేత క్షణాల్లో వచ్చేశాడు. వెంటనే ఈ ప్రాంతంలో టేకు దుంగల అక్రమ రవాణాలో ఆరితేరి ‘తూర్పు వీరప్పన్‌’గా పేరొందిన వ్యక్తికి ఫోన్‌ చేశాడు. రంగంలోకి దిగిన సదరు వ్యక్తి.. పట్టుకున్న వారిని విడిపించేందుకు ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. ‘తమ వాహనాన్ని ఢీ కొట్టడంతో పాటు.. ఏకంగా తుపాకీ ఎక్కుపెట్టిన వారిని వదిలే ప్రసక్తి లేదం’టూ ఫారెస్టు అధికారులు తెగేసి సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. స్థానిక నేతతో పాటు.. సదరు వ్యక్తి తమతో దగ్గరి సంబంధం ఉన్న ఓ శాసనసభ్యుడికి ఫోన్‌ చేసినట్లు తెలుస్తోంది. సదరు ఎమ్మెల్యే నుంచి మంత్రికి ఫోన్‌ వెళ్లినట్లు సమాచారం.

                                           జింకల కళేబరాలకు పోస్టుమార్టం చేస్తున్న వైద్యులు (ఫైల్‌)
గ్రామస్తుల సమక్షంలో..
రాత్రి పది గంటల సమయంలో ఫారెస్టు అధికారులు గ్రామంలోకి రావడంతో అంబట్‌పల్లి వాసులు మేల్కొన్నారు. అప్పటికీ ఎర్రజిప్సీ అంబట్‌పల్లిలో ఉంది. దుప్పుల కళేబరాలు నేలపై ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. స్థానికంగా అధికార పార్టీకి చెందిన నేత రావడం, టేకు దుంగల స్మగ్లర్‌గా భావిస్తున్న వ్యక్తి ఫోన్, ఓ శాసన సభ్యుడి జోక్యం, చివరగా మంత్రి ఫోన్‌ ఆపై దుప్పుల కళేబరాలు ఇండికా డిక్కీలో ఎక్కించడం చకచకా జరిగిపోయాయి. సంఘటన జరిగి ఐదు రోజులు గడిచినా విచారణ నత్తనడకన సాగుతుండటం అధికార పార్టీ నేతల హస్తం ఉందన్న ఆరోపణలకు బలం చేకూరుస్తోంది.

అదుపులో అనుమానితులు
దుప్పుల వేటకు సంబంధించి స్థానికంగా సహకరించినట్లుగా అనుమానిస్తున్న వ్యక్తుల ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. కొందరు అనుమానితుల ఫొటోలను మహదేవపూర్‌ రేంజర్‌ రమేశ్‌కు చూపించిన ట్లు తెలిసింది. వీటి ఆధారంగా ఆయన కొం దరు నిందితులను గుర్తించారు. వీటితో పా టు ఈ కేసులో అందరి నోటానానుతున్న ఎరుపు రంగు జిప్సీ వాహనంతో పాటు మిలిటరీ జీపుతో సంబంధం ఉన్న వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసిం ది. మరోవైపు ఫారెస్టు శాఖ విజిలెన్స్‌ విభాగం సిబ్బంది ఆధార్‌ కార్డు ఆధారంగా హైదరాబాద్‌లోని ఫజల్‌ మహ్మద్‌ఖాన్‌ ఇంటికి వెళ్లగా ఇంటికి తాళం వేసి ఉన్నట్లు సమాచారం.  

రిపోర్టుల్లో తకరారు..
దుప్పుల వేట కేసు విషయంలో పోలీసు, అటవీ శాఖ అధికారుల విచారణలో ప్రాథమిక అంశాలు వేర్వేరుగా ఉన్నట్లు తెలుస్తోంది. టాటా ఇండికా విస్టా వాహనంతో ఢీ కొట్టిన అనంతరం తుపాకీతో బెదిరించి వేటగాళ్లు పారిపోయినట్లు ఫారెస్టు అధికారులు పేర్కొంటున్నారు. టాటా ఇండికా విస్టా వాహనంలో రెండు దుప్పి కళేబరాలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఫారెస్టు శాఖ నుంచి ఫిర్యాదు అందుకున్న తర్వాత పోలీసులు అంబట్‌పల్లికి వెళ్లి గ్రామస్తులను విచారించి.. తొలుత నేలపై దుప్పి కళేబరాలు ఉన్నట్లుగా నివేదికలో పేర్కొన్నారు. ఈ మేరకు దుప్పి కళేబరాలు ఉంచిన స్థలంలో మ్యాపింగ్‌ చేశారు. ఫారెస్టు శాఖ ప్రైమరీ అఫెన్స్‌ రిపోర్టులో ఫజల్‌ మహ్మద్‌ ఖాన్‌తో పాటు మరో నలుగురు వేటలో పాల్గొన్నట్లు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement