పోలీసులు స్వాధీనం చేసుకున్న జింక కళేబరాలు
వన్యప్రాణుల చట్టం అమలులో ఉన్నప్పటికీ మూగజీవాల వేట ఆగడం లేదు. జిల్లాలోని అభయారణ్యంలో వేటగాళ్ల సంచారం కొనసాగుతూనే ఉంది. హైదరాబాద్ నగరానికి అభయారణ్యం వందకిలోమీటర్ల పరిధిలో ఉండటంతో పలువురు వేటగాళ్లు ఇక్కడికి వచ్చి తరచూ జంతువులను వేటాడతున్నారు. ఇదిగాక తూప్రాన్ మండల పరిసర దాబాల్లో సైతం జంతు మాంసం విరివిగా దొరుకుతోంది. ఈ మాంసానికి ఇక్కడ డిమాండ్ కూడా ఎక్కువే.. ఇక్కడి నుంచి హైదరాబాద్‌లోని పలు హోటళ్లకు సైతం సరఫరా అవుతున్నట్లు సమాచారం.
మెదక్‌జోన్: అభయారణ్యంలోని వణ్యప్రాణులకు రక్షణ కరువైంది. మానవుల జిహ్వచాపల్యం, విలాసాలకు మూగజీవాలు బలవుతున్నాయి. అధికారులు సరైన నిఘా ఏర్పాటు చేయకపోవడం, ఆకలిదప్పిక తీర్చుకునేందుకు వాటికి అనువైన పరిస్థితులు కరువవడంతో ప్రాణులు అడవులను విడిచి బయటకు వస్తున్నాయి. ఇదే అదునుగా బావిస్తున్న వేటగాళ్లు జంతువులను వేటాడుతున్నారు. మూగజీవాల వేట ఉదంతాలు జిల్లాలో తరుచూ వెలుగు చూస్తున్నాయి.
తాజాగా మంగళవారం తెల్లవారు జామున హైదరబాద్‌కు చెందిన నలుగురు యువకులు హవేళిఘణాపూర్ మండల పరిధిలోని పోచారం అరణ్యంలో సెర్చ్‌లైట్లతో సహా పట్టుబడ్డారు. నర్సాపూర్, శివ్వంపేట, వెల్దుర్తి, కౌడిపల్లి, కొల్చారం, మెదక్, హవేళిఘణాపూర్, రామాయంపేట, చిన్నశంకరంపేట, చేగుంట తదితర మండలాల పరిధిలో సుమారు 58వేల హెక్టార్లమేర అడవులు విస్తరించి ఉన్నాయి.
ఈ అటవీ ప్రాంతంలో జింకలు, దుప్పిలు, కొండగొర్లు, నీల్గాయిలు, అడవిపందులు, నెమళ్లు పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి. పోచారం అభయారణ్యంలో రెండు జింకల ప్రత్యుత్పత్తి కేంద్రాలు సైతం ఉన్నాయి. ఇక్కడ వీటి సంఖ్య వేలల్లో ఉంటుంది.
జంతు మాంసానికి భలే డిమాండ్..
రాష్ట్ర రాజదాని హైదరాబాద్‌కు కేవలం 100 కిలోమీటర్ల దూరంలోనే ఈ అడవి ప్రాంతం ఉంది. దీంతో హైదరాబాద్‌కు చెందిన పలు ఉన్నత కుటుంబాల యువకులు, విశ్రాంత ఉద్యోగులు వేటకోసం జిల్లాలోని అటవీ ప్రాంతాలకు తరుచూ వస్తుంటారు. అడవుల్లో తిరిగేందుకు అనువైన వాహనాలతో పాటు తుపాకులు సెర్చ్‌లైట్లతో వచ్చి వేటాడిన ఉదంతాలు కోకొళ్లలుగా ఉన్నాయి. ఇదిలా ఉండగా 44వ జాతీయ రహదారి తూప్రాన్, కండ్లకొయ్యతో పాటు పలు దాబాల్లో జంతువుల మాంసాన్ని విక్రయిస్తున్నారు.
ఈ దాబాల్లోకి మాంసాన్ని సరఫరా చేసేందుకు తూప్రాన్‌కు మండలానికి చెందిన కొందరు వేటను వృత్తిగా ఎంచుకున్నారు. వీరు జిల్లాలోని ఆయా మండలాలకు చెందిన కొంత మందిని సహాయకులుగా ఏర్పాటు చేసుకుని జింకలు, నెమళ్లు, కొండగొర్ల వంటి వణ్యప్రాణులను వేటాడుతునట్లు జరిగిన పలు సంఘటనలు బట్టి రుజువవుతోంది. వణ్యప్రాణుల మాంసానికి డిమాండ్ బాగా ఉండటం, కిలో జింక మాంసానికి రూ.1500 ధర పలుకుతుండటంతో వేటగాళ్లు దీనినే ప్రధాన వృత్తిగా ఎంచుకున్నట్లు సమాచారం.
2016 సంవత్సరం జులై మాసంలో వెల్దుర్తి మండలం శెట్టిపల్లి వద్ద పట్టుబడిన నాలుగు జింకల శరీర భాగాలు హైదరాబాద్‌కు సరఫరా చేసేందుకు సిద్ధం చేశారు. వాటిని మెదక్ మండలం పాతూర్ అడవుల్లో వేటాడినట్లు, అంతేకాకుండా హైదరబాద్‌లోని పలు హొటళ్లకు ఈ మాంసం సరఫరా చేస్తున్నట్లు తెలిసింది.
కఠిన చర్యలు తీసుకోవాలి..
వన్యప్రాణి సంరక్షణ చట్టం–1972 ప్రకారం మూగజీవాలను వేటాడటం నేరం. విచారణలో నేరం రుజువైతే జరిమానాతో పాటు జైలు శిక్షసైతం ఉంటోంది. కాగా పలు సందర్భాల్లో వేటాడుతూ పట్టుబడిన వారిపై కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఈ ఘటనలు పునరావృతం అవుతున్నాయి. ఈనెల 17న, తెల్లవారు జామున పోచారం అభయారణ్యంప్రాంతంలో అనుమాన స్పదంగా దొరికిన నలుగురు వ్యక్తుల వద్ద సెర్చ్‌లైట్లు ఉండటంతో వేటగాళ్లేనని అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
మచ్చుకు కొన్ని సంఘటనలు...
ఐదేళ్ల క్రితం తూప్రాన్ మండల పరిధిలో వన్యప్రాణులను వేటాడే ముఠాను అటవీ అధికారులకు పట్టుకున్నారు. అప్పట్లో వారి నుంచి వన్యప్రాణులను వేటాడే పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. సుమారు 8 సంవత్సరాల క్రితం హైదరాబాద్‌కు చెందిన కొంత మంది వన్యప్రాణులను వేటాడేందుకు రామాయంపేట మండలంలోని అటవీప్రాంతాల్లోకి తుపాకులతో వచ్చి అధికారులకు పట్టుబడ్డారు.
గట్టి నిఘా ఏర్పాటు చేస్తాం..
ఎవరైనా అనుమతులు లేకుండా అటవీ ప్రాంతంలో సంచరిస్తే వారిపై శాఖపరమైన చర్యలు తీసుకుంటాం. ఇప్పటి వరకు నమోదైన కేసులు కోర్టు పరిధిలో పెండింగ్‌లో ఉన్నాయి. ఇకనుంచి అడవిలో గట్టి నిఘా ఏర్పాటు చేస్తాం. అనుమానితులను ఎవరినీ వదలిపెట్టం. –పద్మజారాణి, డీఎఫ్‌ఓ
Comments
Please login to add a commentAdd a comment