పురుగును నోట కరుచుకున్న పిట్ట గూడుకు గెంతే సమయంలో క్లిక్‌మంటుంది. గట్టున బద్దకపు నిద్ర వదిలించుకున్న మొసలి తిరిగి నీళ్లల్లో దబ్బున పడే సమయాన క్లిక్. చిరుతపులి ఏమీ చేయనక్కర్లేదు. కాస్త కళ్లు మిటకరించినా చాలు– క్లిక్. ఒక ఏనుగు, తొండంతో తన గారాలపట్టిని దగ్గరగా లాక్కుంటుంది... క్లిక్కే. భీతహరిణి సౌందర్యాన్ని క్లిక్‌మనిపించే అదృష్టం అందరికీ ఉండదు. గడప దాటి అడవికి చేరి వనాలలో తిరుగుతూ వన్యప్రాణి సౌందర్యాన్ని చూపే స్త్రీలు ఉన్నారు. ఆర్జూ ఖురానా, రాధికా రామస్వామి, అపరూప డే, అర్పిత ఎస్.మూర్తి, కృష్ణకుమారి... ఈ భారతీయ మహిళా వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్లను తెలుసుకుని ఉండాలి మనం.
50,000 ఎంట్రీలు ప్రపంచవ్యాప్తంగా వస్తే వాటిలో గట్టిగా నిలిచిన మన భారతీయ మహిళా వన్యప్రాణి ఫొటోగ్రాఫర్ ఐశ్వర్య శ్రీధర్ గత సంవత్సరం ‘వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ 2020’ అవార్డు గెలుచుకుని మన దేశం పేరును రెపరెపలాడించినప్పుడు వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీని సీరియస్‌గా సాధన చేస్తున్న మహిళలపై అందరి దృష్టి పడిందని చెప్పాలి. వన్యప్రాణుల అపురూప లిప్తలను కెమెరాల్లో బంధించే ఈ స్త్రీలు ఆ పనిలో పొందే ఆనందాలను, ఎదుర్కొనే సవాళ్లను కూడా తెలుసుకోవాలనే కుతూహలం అందరికీ ఏర్పడింది. సాధారణంగా పురుషులకు వీలయ్యే పనిగా ఉన్న ఈ రంగం స్త్రీల ప్రవేశంతో కొత్త కెమెరా చూపును పొందిందని చెప్పాలి. వన్యప్రాణుల పట్ల మాతృస్పర్శతో ఈ స్త్రీలు తీసే ఫొటోల వల్ల వాటి సంరక్షణకు సంబంధించిన చింతన అందరికీ వస్తుంది.
ఇష్టమైన పని... కష్టమైన పని
బాలీవుడ్ చిత్రం ‘3 ఇడియెట్స్’లో మాధవన్ పాత్రకు వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీ అంటే చాలా ఇష్టంగా ఉంటుంది. కాని తల్లిదండ్రులు అతణ్ణి ఐఐటిలో చేర్పిస్తారు. ఇంజినీరు అవమని పోరుతుంటారు. వారిని ఒప్పించి వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్‌గా మారడం అతడికి తలకు మించిన పని అవుతుంది. పురుషులకు కూడా రిస్క్ అని భావించే ఈ పనిలో స్త్రీలు అడుగుపెట్టడం సామాన్యం కాదు. కుటుంబం నుంచి సమాజం నుంచి వీరి పట్ల ఒక ‘కన్సర్న్’ వ్యక్తమవుతూ ఉంటుంది. ‘ప్రమాదం కదూ... ఎందుకొచ్చిన తిప్పలు... ఈ ఫొటోలు తీస్తే ఏం వొస్తుంది’ ఇలాంటి కామెంట్స్ వస్తాయి. కాని ఈ మహిళా ఫొటోగ్రాఫర్లు ఈ అడ్డంకులన్నీ దాటి ముందుకు వచ్చారు. ‘ఒక కెమెరా అందుకో. వనాలలో ప్రవేశించు. వన్యప్రాణులను క్లిక్ చెయ్’ అనే సింపుల్ నినాదంతో కెమెరా పట్టుకుని అడవుల్లో తిరుగుతున్న మహిళా ఫొటోగ్రాఫర్లు ఉన్నారు.
తొలి ఫొటోగ్రాఫర్ వసుధ
భారతదేశ తొలి వైల్డ్‌లైఫ్ మహిళా ఫొటోగ్రాఫర్‌గా బెంగళూరుకు చెందిన వసుధ చక్రవర్తిని చెప్పాలి. ఆమె నీలగిరి అడవుల్లో స్థానిక గిరిజనుల సహాయంతో అద్భుతమైన వన్యప్రాణి ఫొటోలను తీసింది. వన్యప్రాణుల మీద ఇష్టంతో ఇంటర్నేషనల్ బ్యాంక్‌లో చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి కుటుంబ వ్యతిరేకతను పొందింది. కాని ఒక అమాయక జంతువు కళ్లల్లోకి చూస్తే ఎంత పెద్ద కష్టమైనా మర్చిపోవచ్చు కదా అంటుంది. ‘తెలిసిన విషయాలు కొన్ని తెలియని విషయాలు కొన్ని. రెంటి మధ్య తలుపులు ఉంటాయి. చేయవలిసిందల్లా ఆ తలుపులు తెరుచుకుని తెలుసుకోవడమే’ అంటుంది వసుధ. కాని ఆ తలుపులను తెరిచే శక్తి స్త్రీలు పొందవలసి ఉంటుంది. స్వీయ ప్రయత్నం చేయాలి. కుటుంబం మద్దతు తీసుకోవాలి.
రాధికా రామసామి మరో నలుగురు
వసుధ చక్రవర్తి లానే రాధికా రామసామి కూడా భారతదేశంలో తొలితరం మహిళా వన్యప్రాణి ఫొటోగ్రాఫర్. చెన్నైకు చెందిన రాధిక ఢిల్లీలో స్థిరపడి వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీలో పక్షులను కెమెరాలో బంధించడం ప్రారంభించింది. భారతదేశంలోని అన్ని అభయారణ్యాల్లో తిరిగి అంతరించిపోతున్న అరుదైన పక్షులను ఫొటోలు తీసింది. ఆ తర్వాత ఆఫ్రికా అడవుల్లో కూడా ఆమె కెమెరా ఫొటోల వేట కొనసాగించింది. ‘మనకు ప్రకృతి ఎంత సమృద్ధమైన వనరులు ఇచ్చిందో అడవుల్లో తిరిగితే తెలుస్తుంది.’ అంటుంది రాధికా రామసామి. ఢిల్లీకే చెందిన ఆర్జూ ఖురానా ఇటీవల ఈ రంగంలో పేరు గడిస్తోంది. ‘మిమ్మల్ని ప్రకృతితో ప్రేమలో పడవేయించడం, వనాల పట్ల గౌరవం కలిగేలా వర్ణ చిత్రాలలో మునకలేయించడమే వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్ పని’ అంటుంది ఆర్జూ. ఇక కోల్‌కటాకు చెందిన అపురూప డే రెక్కలల్లార్చే పక్షులను క్లిక్ మని పించడంలో ఎక్స్‌పర్ట్. ‘మీరు ఎక్కడికైనా వెళ్లండి. మీ కోసం ఒక పక్షి ఎదురు చూస్తూ ఉంటుంది’ అంటుందామె. కాలు కుదురుగా ఉండదని ఈ అమ్మాయికి పేరు. అలాగే అర్పిత ఎస్.మూర్తి చిరుతపులులను ఫొటోలు తీసే చిరుతగా గుర్తింపు పొందింది.
మన తెలుగు వెలుగు కృష్ణకుమారి
తెలుగు వనిత అయిన కృష్ణకుమారి ఒకటి రెండేళ్ల క్రితం సెల్‌ఫోన్‌తో ప్రకృతి చిత్రాలు తీయడాన్ని హాబీగా మొదలెట్టింది. కాని నేడు ఆమె నికాన్ డి 500 ఉపయోగించే ప్రొఫెషనల్ వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్‌గా ఎదిగింది. ‘ఒకప్పుడు నేను ఇతరులు తీసే ఫొటోలను చూసి ఆశ్చర్యపోయేదాన్ని. ఇవాళ నేను తీసిన ఫొటోలు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు’ అంటుందామె. ఇద్దరు పిల్లల తల్లి, వృత్తిరీత్యా జియోఫిజిసిస్ట్ అయిన కృష్ణకుమారి కుటుంబం ప్రోత్సాహంతో ఈ రంగంలో దూసుకువెళుతున్నారు. ‘ప్రకృతిలో ఆశ్చర్యాలకు అంతులేదు. తీస్తూ పో. పంచుతూ పో’ అంటారామె. ఇందుకోసం ఢిల్లీ బర్డ్‌ఫోటోగ్రాఫర్స్ గ్రూప్‌లో చేరి తర్ఫీదు పొందింది.వన్యప్రాణులు తమ జీవితాన్ని ప్రదర్శనకు పెట్టవు మనుషుల్లాగా. వాటిని తెలుసుకోవాల్సిన బాధ్యత మనదే. వాటి రక్షణకు నిలవాల్సింది మనమే. వారికీ మనకూ వాహకులుగా నిలిచే పని ఈ వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్స్ చేస్తున్నారు. మహిళ చేతుల్లో కెమెరా కుదురుగా ఉన్న పసిపాపలా ఉంటుంది. ఆ పసిపాప ప్రతి క్లిక్ దివ్యం. ప్రతి స్నాప్ స్వచ్ఛం.
- సాక్షి ఫ్యామిలీ
Comments
Please login to add a commentAdd a comment