జయంతిపురం వద్ద 2 వేల హెక్టార్ల అటవీ ప్రాంతం
దీనిని ఆనుకునే ఫ్యాక్టరీ ఏర్పాటుకు సన్నాహాలు
నాలుగేళ్లలో అంతరించిపోనున్న రిజర్వ్ ఫారెస్ట్‌లోని జంతువులు
విజయవాడ : జగ్గయ్యపేట మండలం జయంతిపురంలో వీబీసీ ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ భారీ కర్మాగారం ఏర్పాటుతో ఇక్కడి అటవీ ప్రాంతంలో వన్య ప్రాణులు అంతరించిపోయే ప్రమాదం ముంచుకురానుంది. జయంతిపురం సమీపంలోని 500 ఎకరాల్లో వీబీసీ ప్రతిపాదిత స్థలాన్ని ఆనుకొని ఏడు గ్రామాలకు విస్తరించిన రెండు వేల ఎకరాల అటవీ ప్రాంతం ఉంది. అది రిజర్వ్ ఫారెస్ట్ కావటంతో వన్యప్రాణుల సంచారమూ అధికమే. ముప్పయ్యేళ్ల క్రితం ఇక్కడ జింకలు, నెమళ్లు, అడవి పందులు, దుప్పిలు, కొండచిలువలు, అనేక ఇతర జంతువులు ఉండేవి. రిజర్వ్ ఫారెస్ట్ కావటం, పక్కనే అడవిలోనే కృష్ణానది కూడా ఉండటంతో జంతువులకు ఇబ్బందులు ఉండేవి కాదు. గడచిన 20 ఏళ్లలో ఇక్కడ 19 సిమెంట్ ఫ్యాక్టరీలు, వందకు పైగా ఇతర పరిశ్రమలు ఏర్పడ్డాయి. వాయు కాలుష్యంతో గడచిన ఇరవయ్యేళ్లలో పెద్ద సంఖ్యలో జంతువులు మృత్యువాత పడ్డాయి.
ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...
ప్రస్తుతం ఈ ప్రాంతంలో కాలుష్య తీవ్రత సెకనుకు 59 మైక్రోగ్రాములుగా ఉంది. ఇది 60 దాటితే తీవ్ర దుష్పరిణామాలు ఉంటాయని ఇప్పటికే అనేక సంస్థలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో వీబీసీ ఏర్పాటు చేయనున్న భారీ కర్మాగారంలో అమ్మోనియా ప్లాంట్, నైట్రిక్ యాసిడ్ ప్లాంట్, అమ్మోనియం నైట్రేట్ ప్లాంట్, యూరియా ప్లాంట్లు కూడా ఏర్పాటు చేస్తారు. తెలంగాణ రాష్ట్రంలోని రామగుండంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కర్మాగారం కంటే రెట్టింపు స్థాయి ఉత్పత్తితో రెట్టింపు సంఖ్యలో ప్లాంట్లు ఏర్పాటు చేయనుండటం గమనార్హం. దీనివల్ల ప్రమాదకర స్థాయిని దాటి కాలుష్యం పెరగటం ఖాయం. దీనివల్ల మనుషులతో పాటు వన్యప్రాణులకూ ముప్పు తప్పదు. సాధారణంగా ఏడేళ్ల జీవిత కాలం ఉన్న దుప్పిలు ఇక్కడి అటవీ ప్రాంతంలో వాయు కాలుష్యం ప్రభావంతో ఏడాదిన్నరకే మృత్యువాత పడుతున్నాయి. మిగిలిన జంతువులదీ ఇదే పరిస్థితి. ఇప్పటివరకు అడవికి కనీసం 10 కిలోమీటర్ల దూరంలో పరిశ్రమలు ఉండటంతో నష్టం తీవ్రత కొంత తక్కువగా ఉండేది. ఇప్పుడు 500 మీటర్ల దూరంలోనే వీబీసీ కర్మాగారం ఏర్పాటు కానుండటంతో మరో నాలుగేళ్లలో అడవిలోని జంతు సంపద పూర్తిగా అంతరించిపోయే ప్రమాదముంది.
అధికార పార్టీ కనుసన్నల్లోనే...
అధికార పార్టీ కనుసన్నల్లోనే ఈ ఫ్యాక్టరీ ఏర్పాటుకు అనుకూలంగా యుద్ధప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి. దీనిపై పట్టించుకోవాల్సిన ప్రభుత్వ పెద్దలే పూర్తిగా సహకరిస్తుండటం శోచనీయం. పర్యావరణ వేత్తలు ఈ ఫ్యాక్టరీ ఏర్పాటును అడ్డుకునేందుకు చేస్తున్న యత్నాలను ప్రభుత్వ పెద్దలు తొక్కిపట్టి మరీ ఆ యాజమాన్యానికి సహకరిస్తుండటం గమనార్హం.
వీబీసీతో వన్యప్రాణాలు హరీ!
Published Sat, Oct 17 2015 2:13 AM | Last Updated on Sun, Sep 3 2017 11:04 AM
Advertisement